ప్రస్తుతం ప్రపంచ సినిమాలోని సీనియర్, ప్రఖ్యాత దర్శకులు ఎవరైనా ఇండియన్ సినిమా గురించి మాట్లాడినా, ఇండియన్ సినిమా దర్శకుల ప్రస్తావన తీసుకొచ్చినా మెచ్చుకునేది మన టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళినే. ‘బాహబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో ఆయన మన సినిమాను ప్రపంచ వేదిక మీద నిలబెడితే.. ఆయన పేరును హాలీవుడ్, విదేశీ సాంకేతిక నిపుణులు పొగిడేస్తున్నారు. వారెవరు అనేది తర్వాత చూద్దాం. అయితే మరో మాస్టర్ మైండ్ క్రిస్టఫర్ నోలన్ కూడా ఇలానే మాట్లాడతారు అనుకున్నారంతా. కానీ ఆయన సినిమాల్లాగే ఆయన ఇంట్రెస్ట్‌లు కూడా మిగిలిన వారికి భిన్నం.
అందుకేనేమో ఆయన తనకు నచ్చిన దర్శకుడు పైవారికి నచ్చిన దర్శకుడు ఒకరు కాలేదు. ఇక అసలు విషయానికొస్తే నోలన్‌కు నచ్చిన డైరక్టర్ మన దివంగత భారతీయ దర్శకుడు సత్యజిత్ రే. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ‘ది అపు ట్రైలజీ’ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సత్యజిత్‌ను అత్యుత్తమ భారతీయ చలనచిత్ర దర్శకులలో ఒకరిగా కొనియాడారు. తన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ ప్రచారంలో భాగంగా నోలన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1000కి పైగా గొప్ప సినిమాలను భద్రపరిచిన న్యూయార్క్‌లోని క్రైటీరియన్ క్లోసెట్‌ను నోలన్ విజిట్ చేసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇష్టమైన సినిమాలను ఎంచుకుంటూ వాటిపై సమీక్షలు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులోనే సత్యజిత్ ‘ది అపు ట్రైలజీ’ గురించి కూడా ఉంది. సత్యజిత్ రే తీసిన ‘ది అపు ట్రైలజీ’ ‘పథేర్ పాంచాలి’తో మొదలవుతుంది. ఆ అద్భుతమైన చిత్రం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నేనింకా ఒక భాగమే చూశాను.. రెండు, మూడు భాగాలు చూడటానికి ఆసక్తిగా ఉన్నాను అని చెప్పారు.
‘ది అపు ట్రైలజీ’ గురించి చూస్తే.. అందులో ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజీతో’, ‘అపుర్ సంసార్’ అనే మూడు బెంగాలీ చిత్రాలున్నాయి. బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన అపు అనే వ్యక్తి బాల్యం నుండి యవ్వనం వరకు చూపిస్తారు. ఈ సినిమాలకు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపైనా వివిధ అవార్డులు వచ్చాయి.
రీసెంట్ టైమ్స్‌లో రాజమౌళి గురించి జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, రూసో బ్రదర్స్, జేమ్స్ గన్, స్కాట్ డెరిక్సన్, ఎడ్గర్ రైట్, క్రిస్టోఫర్ మిల్లర్ లాంటి వాళ్లు తెగ పొగిడేసిన విషయం తెలిసిందే.