బిగ్‌బాస్‌ 4లో హీరో నా లేక జీరో నా గేమ్‌లో ఏం జరిగిందంటే?

  • September 20, 2020 / 11:57 AM IST

రెండు వారాలుగా బిగ్‌బాస్‌ను, హౌస్‌ నియమాలను లైట్‌ తీసుకుంటూ… సాగిపోతున్న బిగ్‌బాస్‌ హౌస్‌లో సీరియస్‌ నెస్‌ తీసుకురావడానికి, డ్రామా పెరగడానికి నాగార్జున ‘హీరో /జీరో’ టాస్క్‌ పెట్టాడు. ఇంట్లో ఉన్నవాళ్లలో హీరో అనుకున్నవాళ్లను కుర్చీలో కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నవాళ్లను ‘జీరో’ డోర్‌ నుంచి బయటకు నెట్టేయాలి అని షరతు పెట్టాడు. అలా జీరో నుంచి బయటకు పంపించిన వాళ్లకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని అర్థం అని కూడా చెప్పాడు. అసలు ఈ గేమ్‌లో ఏం జరిగింది? అసలు ఈ నోరు జారడాలు ఏంటి? ప్రోమోలో చూపించినట్లుగా నిజంగా అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ ఏడిచారా?

హీరో/జీరో గేమ్‌ నోయల్‌తో స్టార్ట్‌ అయ్యింది. ఆయన అమ్మ రాజశేఖర్‌ను హీరో చేశాడు. బయట చాలా అచీవ్‌ చేసిన మాస్టర్‌, ఇంట్లోకి వచ్చి అందరితో కలసిపోతున్నాడు. అందరూ హ్యాపీగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే అతను హీరో అని నోయల్‌ చెప్పాడు. అయితే ఆ వివరణకు నాగ్‌ అంగీకరించలేదు. దానిని కూడా సేఫ్‌ గేమ్‌ అనే అన్నాడు నాగ్‌. ఇక ఎవరో చెబితే నేను పడవ దిగిపోతాను అన్న కుమార్‌ సాయిని జీరోగా అభివర్ణించాడు నోయల్‌. ‘‘ఇంటికొచ్చిన కొత్తలో నా మీద కలిగిన అభిప్రాయాన్ని ఇంకా మనసులో ఉంచుకొని, నేను ఏ చిన్న మాట అన్నా తప్పుగా అనుకొని ఏడవడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తున్నారు. ఆమెకు మాటలు వినేంత ఓపిక లేదు’’ అంటూ కళ్యాణిని జీరో చేసింది సుజాత. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను పెట్టింది సుజాత. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది అమ్మ రాజశేఖర్‌కు తెలుసు. అందుకే ఆయన హీరో అని చెప్పింది.

నోయల్‌ను హీరో చేశాడు సోహైల్‌. పడవ నామినేషన్‌ టైమ్‌లో ఇనీషియేటివ్‌ తీసుకొని ఎలాంటి గొడవలు లేకుండా మొత్తం ప్రాసెస్‌ జరిగిపోయింది అందుకే నోయల్‌ హీరో అన్నాడు సోహైల్‌. దానికి నాగ్‌ అంగీకరించలేదు. డిఫెండ్‌ చేయాల్సిన టైమ్‌లో శాక్రిఫైజ్‌ చేసేవాడు హీరోనా అంటూ ప్రశ్నించాడు నాగ్‌. కళ్యాణికి ఇంట్లో ప్రతివాళ్లతో ఇష్యూస్‌ వస్తుంటే.. వాళ్లతో డీల్‌ చేయకుండా పక్కకు వెళ్లి ఏడుస్తున్నారు. ఫేస్‌ చేయకుండా అలా వేరేవాళ్లకు చెప్పడం నచ్చలేదు అంటూ కళ్యాణిని జీరో చేశాడు సోహైల్‌. ట్రూ ఎట్‌ హార్ట్‌గా ఉన్న ఆరియానాను హీరోయిన్‌ చేసింది దేవీ నాగవల్లి. షో పిచ్చి కామెడీ ట్రాక్‌లా వెళ్తోంది అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది దేవీ. అతి సర్వత్రా వర్జయేత్‌ అంటూ వివరించే ప్రయత్నం చేసింది. ఆరియానా మీద అమ్మ రాజశేఖర్‌ పిచ్చి కామెడీ చేశారు అంటూ విమర్శలు చేసింది. ‘కామెడీలు చేస్తేనే ఇక్కడ హీరోలా’ అంటూ ప్రశ్నించింది. పక్షపాతం చూపిస్తున్నాడు అంటూ అమ్మ రాజశేఖర్‌ను జీరో చేసింది దేవీ నాగవల్లి. నామినేషన్స్‌ తర్వాత అందరూ నన్ను టార్గెట్‌ చేసేశారు. ఇప్పుడు నేను చేసిన ఈ పని (అమ్మ రాజశేఖర్‌ను జీరో చేయడం)తో విలన్‌ కూడా అయిపోవచ్చు. అయినా నేను భయపడను అంటూ తేల్చేసింది దేవీ.

నా దృష్టిలో హీరోయిన్‌ లాస్య అని మెహబూబ్‌ చెప్పాడు. ఆమె తీసుకునే ప్రతి డెసిషన్‌ ఫుల్‌ క్లారిటీగా ఉంటారు. చిన్న చిన్న విషయాలు గొడవలుగా మారుతున్న సందర్భంలో వాటిని ఆమె ఆపే ప్రయత్నం చేశారు. అందుకే నా దృష్టిలో లాస్య ఈజ్‌ ఏ హీరో అని చెప్పాడు మెహబూబ్‌. అలాగే కుమార్ సాయిని జీరోగా అభివర్ణించాడు మెహబూబ్‌. నేను ఆయనతో మాట్లాడదామని ట్రై చేసినా ఆయన మాట్లాడలేదు. పడవ నామినేషన్‌ టైమ్‌లో నోయల్‌ అన్న మాటను పట్టుకొని కుమార్‌ సాయి అతనిని జీరో చేశాడు. ‘మేం ముందొచ్చాం… కలసి ఉన్నాం. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి వెళ్లిపో’ అని నోయల్‌ అన్నాడంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేశాడు కుమార్‌ సాయి. మరి ఆ మాటలు అప్పుడే ఎందుకు చెప్పలేదు నాగ్ అడిగాడు. గంగవ్వ కూడా అదే మాట అంది. ‘అప్పుడు నేను దిగొద్దు అని చెప్పినా నువ్వు దిగావు’ అంటూ గుర్తు చేసింది. ఇక హీరోగా అభిజీత్‌ను ఎంచుకున్నాడు కుమార్‌ సాయి. వ్యక్తిత్వం తెలియకుండా ఓ వ్యక్తిని నామినేట్‌ చేయడం అంటే గ్రూపిజం ఉన్నట్లే. ఆ సమయానికి ఆ గ్రూపునకు లాడర్‌ నోయల్‌ అని తేల్చేశాడు కుమార్‌ సాయి.

హారిక కూడా అభిజీత్‌ను హీరోను చేసింది. నాకు ఏ అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా అభిజీత్‌కే చెబుతాను. ఎందుకంటే అతను తొందరగా ఏదీ జడ్జ్‌ చేయడు. అలాగే కెప్టెన్సీ సమయంలో కూడా నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ వచ్చాక తీసుకుంటాను అని చెప్పాడు. ఆ విధానం నచ్చింది. టాస్క్‌లో 100 శాతం ఇస్తున్నాడు. ఇక జీరో విషయానికొస్తే కుమార్‌ సాయిని ఎంచుకుంది హారిక. మేం దిగాలని అనిపిస్తే దిగమని కుమార్‌సాయికి చెప్పినా ఆయన వినలేదు. ఇంకొకటి ఆయనతో పని పెట్టుకుంటే తొందరగా క్లియర్‌ అవ్వదు. ఇంకొకటి ఇంట్లో ఆయన లేజీగా ఉంటున్నాడు అని హారిక చెప్పింది. తన దృష్టిలో గంగవ్వ హీరో అని లాస్య చెప్పింది. గంగవ్వ తీసుకున్న డెసిషన్స్‌ బాగా నచ్చుతాయి. ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది కాబ్టటి గంగవ్వ హీరో. అమ్మ రాజశేఖర్‌ను జీరో అని చెప్పింది లాస్య. కామెడీకి ఒక లిమిట్‌ ఉంటుంది. శ్రుతి మించిన కామెడీని అందరూ యాక్సెప్ట్‌ చేయరు. నేనూ చేయలేను. అందుకే ఆయన జీరో అని చెప్పింది లాస్య. నిన్న జరిగిన ఒప్పో మొబైల్‌ టాస్క్‌లో దివి పొట్ట దగ్గర పిల్లో పెట్టడం నచ్చలేదు అని చెప్పింది లాస్య.

ఇవన్నీ చూసిన అమ్మ రాజశేఖర్‌ ఎమోషనల్‌ అయ్యారు. ‘నేను వెళ్లిపోతాను’ అంటూ ఏడ్చేశాడు. నేనిక్కడ తప్పు చేస్తున్నాను అని అనుకుంటున్నారు. అందుకే నేను ఇక్కడ ఉండలేను అంటూ మాస్టర్‌ ఏడ్చేశారు. నాకు ఇప్పటివరకు వచ్చిన పేరు స్పాయిల్‌ అవ్వకూడదు. నేను ఇక్కడ జాలీగా ఆడదామని వచ్చాను. నన్ను పంపించేయండి అంటూ అమ్మ రాజశేఖర్‌ మాస్టర్ మోకాళ్ల మీద కూర్చొని ఏడ్చేశారు. అందరికీ అందరూ నచ్చాలి అనుకోవడం ఇంపాజిబుల్‌ అంటూ రాజశేఖర్‌ను నాగ్‌ ఊరడించే ప్రయత్నం చేశాడు. ‘నన్ను ఎవరూ మెడ మీద చెయ్యి పెట్టి నెట్టేయలేదు’ అంటూ బాధపడ్డాడు మాస్టర్‌. లాస్య వచ్చి కాళ్లకు నమస్కరించి.. క్షమించమని వేడుకుంది. అయితే మాస్టర్ ఇంట్లో ఉండాల్సిందే అని గంగవ్వ తేల్చి చెప్పేసింది. గంగవ్వ లేచి వచ్చి తన చీర కొంగుతో మాస్టర్‌ కన్నీళ్లు తుడిచింది గంగవ్వ.

నా దృష్టిలో స్ట్రాంగ్‌ జీరో సుజాత అంటూ మెడ పట్టి జీరోలో పెట్టారు కళ్యాణి. మెప్పుకోసం మంచిగా మాట్లాడే రకం సుజాత అని వివరించింది. ఆమె కౌగిలింతలో నాకు కట్టప్ప కనిపిస్తున్నాడు. అలాగే గంగ్వనే ఈ ఇంట్లో హీరో. అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉంటున్నారు. మా అందరినీ ఒకేలా చూస్తారు. అఖిల్‌ కూడా గంగవ్వనే హీరో చేశాడు. అందరూ చెప్పిన వివరణే చెప్పాడు. ఇక జీరోగా కుమార్‌ సాయిని ఎంచుకున్నాడు. కుమార్‌ స్థాయిలో ఎంటర్‌టైన్మెంట్‌ కనిపించడం లేదు. ఆయన ఈ ఇంటికి ఫిట్‌ కాడు అనిపిస్తోంది అనే వివరణ ఇచ్చాడు. ఇంట్లో అందరూ ఆడుతున్నారు… అయితే ఆడటానికి వచ్చాం. అయితే గంగవ్వ మాత్రం ఎంతో కేరింగ్‌గా ఉన్నారు. అందరినీ కేరింగ్‌గా చూస్తారు. అందుకే ఆమె నా హీరో. అలాగే కళ్యాణి జీరో అని ఆరియానా చెప్పింది. వంట గది విషయంలో, వడ్డన విషయంలో సరిగా లేనందున కళ్యాణిని జీరో చేసినట్లు చెప్పింది ఆరియానా. నా దృష్టిలో నవ్వించేవాడు హీరో.. అందుకే అమ్మ రాజశేఖర్‌ హీరో. అందరి బాధలను మరచిపోయేలా చేసే నవ్వించేవాడు హీరో అంటూ అమ్మ రాజశేఖర్‌ను పొగిడేశాడు అవినాష్. ఇక జీరోగా కుమార్‌ సాయిని జీరో చేశాడు. పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం వల్ల కుమార్‌ సాయిని జీరో చేసినట్లు చెప్పాడు అవినాష్‌.

హీరో/జీరో టాస్క్‌లో అసలు మజా ఇప్పుడు మొదలైంది. ఈ హౌస్‌లో నా హీరో అమ్మ రాజశేఖర్‌ అంటూ హీరో కుర్చీలో కూర్చోబెట్టింది దివి. ఆయన జెన్యూన్‌, పాజిటివ్‌, ఎంటరటైన్మెంట్‌. ఆయన ఇంట్లో లేకపోతే అందరికీ పిచ్చెక్కిపోద్ది. అందుకే ఆయన నా హీరో. ఇక షూట్‌ సమయంలో ఆయన చేసిన పని నాకు తప్పుగా అనిపించలేదు. ఆ ఫొటో షూట్‌ బాగా రావాలని ఆయన అలా చేశారు. ఒక డైరెక్టర్‌గా అది తప్పు కాదు. నాకు తప్పు అని కూడా అనిపించలేదు. ఆయన ఇంటెన్షన్ తప్పు కాదు. ఆయన వేసిన కొన్ని జోక్స్‌ నచ్చకపోవచ్చు. కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉన్న కుమార్ సాయిని జీరో అని చెప్పింది దివి. అమ్మ రాజశేఖర్‌ను గంగవ్వ హీరో చేసింది. ఆయన ఇంట్లో ఏ సామాన్లు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని పక్కాగా ఉంటాడు. అందరినీ నవ్విస్తారు. నోయల్‌ను రొయ్యలా అంటూ నవ్వించేసింది గంగవ్వ. పడవ నుంచి తను వద్దన్నా దిగిపోయిన కుమార్‌సాయిని జీరో చేసింది గంగవ్వ. జీవితంలో ఎంతో పోరాడిన గంగవ్వను హీరో అని ఎంచుకున్నాడు అభిజీత్‌. ఆరియానాను జీరో చేశాడు అభిజీత్‌.

ఎక్కువమంది హీరో ట్యాగ్‌ వేసిన రాజశేఖర్‌… తన హీరోగా నోయల్‌ను ఎంచుకున్నాడు. ఎవరినైనా ఏడిపించాలి అంటే రెండు దెబ్బలేస్తే ఏడుస్తారు. అదే నవ్వించాలంటే అంత సులభం కాదు. దానికి రియల్‌నెస్‌ యాక్టింగ్‌ ఉండాలి. అందుకే నోయల్‌ హీరో. అలాగే తనకు జీరో ట్యాగ్‌ వేసిన దేవీకి అమ్మ రాజశేఖర్‌ జీరో ట్యాగ్‌ వేశాడు. ‘ఆమెకు నాకు ఏం గొడవ లేదు. నేను ఎప్పుడు ఎంటర్‌టైన్‌ చేసినా ఆమె వచ్చి నవ్వేది. మేం జాలీగా ఉన్నప్పుడు పక్కనే ఉండి నవ్వేవారు. ఆ తర్వాత ఏదో విషయానికి హర్ట్‌ అయ్యేవారు’ అంటూ వివరించాడు మాస్టర్‌. మొన్న బీబీ కామెడీ షో సందర్భంగా కూడా ఆమెకు పెద్ద క్యారెక్టర్‌ ఇచ్చాం. కానీ ఆమె జరగని వాటిని మనసులో పెట్టుకొని నా మీద కోపం పెట్టుకున్నారు అని మాస్టర్‌ వివరించాడు. మోనాల్‌ కూడా గంగవ్వను హీరో చేసింది. ఆమె గురించి అందరూ చెప్పిందే మోనాల్‌ చెప్పింది. ఇక జీరోగా కుమార్‌సాయినే ఎంచుకుంది. అందరితో కలవడం లేదనే కారణం చెప్పింది.

నాగార్జున బ్రేక్‌ తీసుకున్న సమయంలో అమ్మ రాజశేఖర్‌ను అందరూ సముదాయించే ప్రయత్నం చేశారు. కళ్యాణి ముందుకొచ్చి మాస్టర్‌ను కూల్‌ చేసింది. అదే సమయంలో లాస్య ఏదో మాట్లాడదామని ముందుకొచ్చింది. అప్పుడే దివి కూడా రియాక్ట్‌ అయ్యింది. నా విషయంలో మాస్టర్‌ చేసిన పనిని నువ్వెందుకు మాట్లాడావు అంటూ లాస్యను అడిగింది. నీ విషయాలు నువ్వు మాట్లాడుకోవాలి కానీ… నా విషయం ఎందుకు చర్చకు తెచ్చావు అని అడిగింది. మా ఇంట్లో వాళ్లు చూస్తుంటారు… నా విషయంలో నువ్వెందుకు రియాక్ట్‌ అవ్వడం అంటూ లాస్యతో కోపంగా అంది దివి. దానికి లాస్య ఏదో చెప్పబోతుంటే ‘షటప్‌’ అంటూ వెళ్లిపోయింది. దీంతో లాస్యకు కోపం వచ్చి ‘మైండ్‌ యువర్‌ టంగ్‌’ అంటూ గట్టిగా అంది. అక్కడితో ఆగకుండా ఆ యాటిట్యూడ్‌ ఏంటి అంటూ దివిపై కోపం చూపించింది. ఎలిమినేట్‌ అయినవారితో ఫొటో దిగడానికి మొబైల్‌ తీసుకురావడానికి స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లిన నోయల్‌ అక్కడే కాసేపు ఉండి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈ మొత్తం గేమ్‌లో తప్పెవరిది, రైటెవరిది అని చూస్తే.. ఎవరి దృష్టిలో వారు కరెక్టే. తమకు అనిపించింది చెప్పారు. అందుకే దేవీ చెప్పిన మాటలకు అమ్మ రాజశేఖర్‌ నొచ్చుకున్నా బయటకు కనిపించనివ్వలేదు. అలాగే లాస్య చేసిన ఆరోపణలను తొలుత కూల్‌గానే తీసుకున్నాడు. అయితే దివి విషయంలో లాస్య చెప్పిన మాటకు బాగా హర్ట్‌ అయ్యాడు. తనకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత అప్పటికి అనిపించింది చెప్పానని, మీ మీద ఎలాంటి కోపం లేదని లాస్య వచ్చి కాళ్లు పట్టుకుని మరీ చెప్పింది. దీని బట్టి లాస్య చేసిందే తప్పు అని చెప్పొచ్చు. ఇక నాగ్‌ వెళ్లిపోయాక దివికి ఏదో క్లారిటీ ఇవ్వడానికి లాస్య వచ్చింది. ఆమె చెప్పింది వినాలని లేక దివి అడ్డుపడింది. ఇంకా చెప్పడానికి ట్రై చేస్తుంటే ‘షటప్‌’ అంటూ వెళ్లిపోయింది. ఇక్కడ తప్పు దివిదే అని చెప్పొచ్చు. ‘షటప్‌’ లాంటి మాటలు అనకుండా ఉండాల్సింది. చూద్దాం ఈ హీరో/జీరో ప్రభావం ఇంటి సభ్యుల మీద ఎలా ఉంటుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus