జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించేతవరకు.. ఇంకా ప్రకటించలేదని, ఎప్పుడు ప్రకటిస్తారని వెయిట్ చేసే మనోళ్లు.. వన్స్ ప్రకటించాక అందులో ఏ భాషకు ఎన్నొచ్చాయి, ఏ జోనర్‌కి ఎన్నొచ్చాయి, రావాల్సిన వారికే వచ్చిందా, వచ్చినోళ్లు అర్హులేనా అంటే మాట్లాడతారు. ఈ విశ్లేషణలో తప్పేమీ లేదు. అయితే ఒక్కోసారి ఇందులోకి రాజకీయ ప్రమేయాలు కూడా వచ్చేస్తుంటాయి. అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, వారి ఆలోచనలకు అనుగుణంగా ఉన్న సినిమాలకు, వ్యక్తులకు అవార్డులు వస్తే కచ్చితంగా అందరి కనుబొమ్మలు పైకి లేస్తాయి.
ఇప్పుడు ప్రకటించి 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024 విషయంలోనూ అదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్న సినిమాలకు అవార్డులు దక్కాయి అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ‘ఆర్టికల్ 370’, ‘స్వాతంత్ర్య వీర సావర్కర్’ సినిమాల గురించి మాట్లాడుతున్నారు. హిందీలో రణ్‌దీప్ హుడా నటించి, దర్శకత్వం వహించిన ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ సినిమాకు జాతీయ పురస్కారం రావడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీని విమర్శించారు.
‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల చూస్తుంటే.. గాడ్సేపై తీసే సినిమాకు కూడా అవార్డు వచ్చే అవకాశం ఉంది’ అంటూ కాస్త ఘాటుగానే విమర్శించారాయన. అయితే జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో జ్యూరీ తీసుకున్న నిర్ణయాల్లో రాజకీయ ప్రభావం ఉందన్న వ్యాఖ్యల్ని జ్యూరీ ఛైర్మన్, మలయాళ చిత్రనిర్మాత జయరాజ్ ఖండించారు. మేమొక సినిమా చూసినప్పుడు దాన్ని సినిమాలానే చూస్తాం. మా ముందు రాజకీయాలు ఉండవు. ఒక దర్శకనిర్మాతగా నేను, జ్యూరీలోని పది మంది సభ్యులు సినిమాలను సినిమాలుగా చూసి అవార్డులిచ్చాం అని చెప్పారు.
అయితే, ఇలా అవార్డులపై పొలిటికల్ ప్రభావం గురించి విమర్శలు రావడం కొత్త కాదు. గతంలో కూడా వచ్చాయి. అప్పుడు ‘లేదు’ అన్నట్లే ఇప్పుడు కూడా జ్యూరీ ‘లేదు’ అని చెబుతోంది. మరి ఉందో లేదా జనాలకే తెలుసు.