Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
- October 9, 2026 / 07:26 AM ISTByFilmy Focus Desk
Cast & Crew
- శ్రీవిష్ణు (Hero)
- మహిమా నంబియార్ (Heroine)
- సత్య, సుదర్శన్, షైన్ టామ్ చాకో, సాయిచంద్, శత్రు, రాధికా శరత్‌కుమార్ తదితరులు (Cast)
- జానకిరామ్ మారెళ్ల (Director)
- సీతా కర్నాటి, వెంకట కృష్ణ కర్నాటి (Producer)
- విజయ్ బుల్గానిన్ (Music)
- సాయి శ్రీరామ్ (Cinematography)
- ఛోటా కే ప్రసాద్ (Editor)
- Release Date : 9th అక్టోబర్ 2026
- కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తీ ఫిల్మ్స్ (Banner)
కామెడీ సినిమాలతో హీరోగా వరుస విజయాలను అందుకుంటున్నాడు శ్రీవిష్ణు (Sree Vishnu). మరోసారి తనకు అచ్చొచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాలోనే శ్రీవిష్ణు చేసిన లేటెస్ట్ మూవీ “కామ్రేడ్ కళ్యాణ్” (Comrade Kalyan). నక్సలిజం ఉద్యమానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సత్య, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. రైటర్ కోన వెంకట్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన “కామ్రేడ్ కళ్యాణ్” సినిమాకు సీతా కర్నాటి, వెంకట కృష్ణ కర్నాటి నిర్మాతలుగా వ్యవహరించారు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన “కామ్రేడ్ కళ్యాణ్” ఎలా ఉంది? ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను శ్రీవిష్ణు ఎంటర్‌టైన్ చేశాడా? లేదా? అంటే?
Comrade Kalyan Movie Review

కథ: కళ్యాణ్ (Sree Vishnu) ఓ పాతకాలం నాటి థియేటర్‌ను లీజుకు తీసుకొని తన స్నేహితుడు సాయితో కలిసి నడుపుతుంటాడు. ఆ థియేటర్‌ను కొని దానికి తన తండ్రి పేరు పెట్టాలని కలలు కంటుంటాడు. ఆ ఊరికి సితార (మహిమా నంబియార్) అనే ఒరియా అమ్మాయి తన కుటుంబంతో కలిసి వస్తుంది. వచ్చి రావడంతోనే కళ్యాణ్ తల్లి సరస్వతి (రాధికా శరత్‌కుమార్) ప్రాణాలు కాపాడుతుంది. సితార మంచితనం నచ్చి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు కళ్యాణ్. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకునే టైమ్‌లోనే సితార కుటుంబం అప్పుల్లో ఉందనే నిజం తెలుస్తుంది.
సితార ప్రేమ కోసం ఫేక్ నక్సలైట్‌గా మారతాడు కళ్యాణ్. లొంగిపోతే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో సితార కుటుంబాన్ని అప్పు బారి నుంచి కాపాడవచ్చని ప్లాన్ వేస్తాడు. కానీ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో) కారణంగా కళ్యాణ్ ప్లాన్ రివర్స్ అవుతుంది. మోస్ట్ వాటెండ్ నక్సలైట్‌గా అతడిపై ముద్రపడుతుంది. శంకరన్న (శత్రు)దళంలో ఓ సభ్యుడిగా మారిన కళ్యాణ్ తన స్నేహితుడు బాబుతో (సత్య) కలిసి అడవి నుంచి బయటడేందుకు ఏం చేశాడు? కళ్యాణ్ నిజమైన నక్సలైట్ కాదని దళ నాయకుడితో (సాయిచంద్) పాటు శంకరన్నకు తెలిసిందా? పోలీస్ ఆఫీసర్ జార్జ్ కుట్టి కళ్యాణ్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు? కళ్యాణ్, సితార ప్రేమకథకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? కళ్యాణ్ జన జీవన స్రవంతిలో కలిసిపోయాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.

నటీనటుల పనితీరు: ప్రేమ కోసం పరితపించే యువకుడిగా, నక్సలైట్‌గా రెండు వేరియేషన్స్‌తో కూడిన పాత్రకు శ్రీవిష్ణు (Sree Vishnu) పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్, వన్ లైనర్స్ తో నవ్వించాడు. కామ్రేడ్ కళ్యాణ్‌కు మన్ మెన్ షోగా నిలిచాడు . హీరోయిన్ మహిమా నంబియార్ నాచురల్ పర్ఫార్మెన్స్‌ను కనబరిచింది. హీరో స్నేహితుడు బాబుగా ఫుల్ లెంగ్త్ పాత్రలో సత్య కనిపించాడు. సీరియస్ సిట్యూవేషన్‌లో అతడు వేసే పంచ్‌లు, మ్యానరిజమ్స్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. సుదర్శన్ ట్రాక్‌లో కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. ఉపేంద్ర లిమాయో, బుల్లిరాజు, రఘుబాబు, రెడీన్ కింగ్స్‌లే, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రభాస్ శ్రీను కామెడీ ఆశించిన స్థాయిలో పండలేదు. వెన్నెలకిషోర్ ఒక్క సీన్‌లోనే కనిపించారు.
సీనియర్ హీరోయిన్ రాధిక నటనానుభవాన్ని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. తల్లికొడుకుల ఎమోషన్‌ను బలంగా రాసుకుంటే బాగుండేది. దళ నాయకుడిగా సాయిచంద్ హుందాగా కనిపించారు. నక్సలైట్ నాయకుడిగా శత్రు, పోలీస్ ఆఫీసర్‌గా షైన్ టామ్ చాకో నటన పర్వాలేదనిపిస్తుంది.

సాంకేతిక వర్గం పనితీరు: నక్సలిజం అన్నది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ పాయింట్‌ను వినోదాత్మకంగా చెప్పడం అంటే కత్తి మీద సామే. కామ్రేడ్ కళ్యాణ్‌తో (Comrade Kalyan) ఈ రిస్క్‌కు సిద్ధపడ్డాడు దర్శకుడు జానకిరామ్ మారెళ్ల . నక్సలిజం ఉద్యమం గురించి మరి లోతుగా వెళ్లకుండా పైపైనే టచ్ చేస్తూ తాను అనుకున్న పాయింట్‌ను ఫన్నీగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. నందు, భానులతో కలిసి డైరెక్టర్ జానకిరామ్ రాసిన ఫన్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచారు.
సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ కామ్రేడ్ కళ్యాణ్‌కు మరో హీరోలా నిలిచాడు. అడవి అందాలు, నక్సలిజం సినిమాకు కావాల్సిన ఎఫెక్ట్‌లు, ఫీల్‌ను తన కెమెరాతోనే క్రియేట్ చేశాడు. విజయ్ బుల్గానిన్ పాటల్లో ఒరియా పిల్లా మెలోడీ సాంగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. లిమిటెడ్ బడ్జెట్‌లోనే అయినా క్వాలిటీగా సినిమాను తీశారు.

విశ్లేషణ: 1990 దశకంలో నక్సల్స్ ఉద్యమం దేశంలో ఉదృతంగా సాగింది. నక్సలిజం సిద్ధాంతాల పట్ల చాలా మంది యువత ఆకర్షితులై అడవి బాట పట్టారు. కొందరు ఈ ఉద్యమాన్ని డబ్బు సంపాదించుకోవడం కోసం అక్రమంగా వాడుకోవాలని చూశారు. అలాంటి వారి జీవితాలను వినోదాత్మకంగా చూపిస్తూ దర్శకుడు జానకిరామ్ మారెళ్ల కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan) సినిమాను తెరకెక్కించారు.
సాధారణంగా నక్సలిజం సినిమాలు చాలా సీరియస్‌గా మెసేజ్‌లతో కూడి ఉంటాయి. కానీ దర్శకుడు మాత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మలిచారు. నక్సలిజం, దాని సిద్ధాంతాల గురించి తెలియని ఓ యువకుడు అనుకోకుండా వారిలో ఓ సభ్యుడిగా మారితే ఎదురయ్యే పరిణామాలేమిటనేదానిని ఫన్నీగా స్క్రీన్‌పై ఆవిష్కరించాడు.
ఆర్ నారాయణ మూర్తి సినిమాలను తన థియేటర్‌లో ఆడించే యువకుడిగా హీరో పాత్రను ఉద్యమగీతంతో పరిచయం చేశారు. ఆ తర్వాత తన లవ్‌స్టోరీ…భాష కారణంగా అతడి ప్రేమకు ఎదురైన అడ్డంకులతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. హీరోయిన్ ఫ్యామిలీని కాపాడటం కోసం దొంగ నక్సలైట్‌గా అవతారం ఎత్తబోయి నిజమైన నక్సలైట్‌గా హీరో మారే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
నక్సలైట్ల నుంచి పారిపోవాలని హీరో వేసిన ఎత్తులు రివర్స్ కావడం, దళ సభ్యులకు మరింత దగ్గర కావడం, పోలీసులకు వ్యతిరేకంగా మారే అంశాలతో సెకండాఫ్ నవ్విస్తూనే థ్రిల్‌ను పంచుతాయి. ప్రీ క్లైమాక్స్‌ను కాస్తంత ఎమోషనల్‌గా చూపించారు. క్లైమాక్స్‌లో ఓ చిన్న మెసేజ్ ఇచ్చి ఎండ్ చేశారు.
ట్విస్ట్‌లు ప్రెడిక్టబుల్‌గా రాసుకున్నారు డైరెక్టర్. ప్రేమకథ అంత కన్వీన్సింగ్‌గా అనిపించదు. 1990 బ్యాక్‌డ్రాప్‌ను సినిమా పోస్టర్లు, టైటిల్స్‌తో రీక్రియేట్ చేశారు.

ఫోకస్ పాయింట్: కామ్రేడ్ కళ్యాణ్‌కు టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్. శ్రీవిష్ణు, సత్య కామెడీ కోసం చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
















