ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!
- November 19, 2026 / 07:57 AM ISTByFilmy Focus Desk
Cast & Crew
- విశ్వేక్‌సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను (Hero)
- శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్ (Heroine)
- ప్రియదర్శిని రామ్, కరుణకుమార్, మహేష్ చింతల, శ్రీరామచంద్ర తదితరులు (Cast)
- తరుణ్ భాస్కర్ (Director)
- సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి (Producer)
- వివేక్ సాగర్ (Music)
- AJ ఆరోన్ (Cinematography)
- రవితేజ గిరిజాల (Editor)
- Release Date : 19th నవంబర్ 2026
- ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా (Banner)
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “ఈ నగరానికి ఏమైంది” టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌గా తరుణ్ భాస్కర్ రూపొందించిన మూవీ “ఈఎన్ఈ రిపీట్”. ఈ సీక్వెల్‌లో విశ్వక్‌సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. గురువారం థియేటర్లలో రిలీజైన ఈఎన్ఈ రిపీట్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్‌కు మించి నవ్వించిందా? లేదా? అంటే?
ENE Repeat Movie Review

కథ: ఉద్యోగాలు వదిలేసిన వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), ఉప్పు(వెంకటేష్ కాకుమాను), కౌశిక్ (అభినవ్ గోమటం) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. వివేక్ డైరెక్టర్‌గా, కౌశిక్ యాక్టర్‌గా మారితే ఉప్పు ఎడిటర్ అవుతాడు. కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా మారతాడు. నలుగురు కలిసి చేసిన ఓ సినిమా డిజాస్టర్ అవుతుంది. అప్పుల కారణంగా ఐదేళ్లు ఇంటికే పరిమితమవుతాడు వివేక్. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే కీర్తనను(శివాత్మిక) కార్తీక్ ఇష్టపడతాడు. కానీ ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు.
అంకిత్ అనే అబ్బాయితో కీర్తనకు పెళ్లి ఫిక్స్ చేస్తాడు ఆమె తండ్రి డాక్టర్ రావు(ప్రియదర్శిని రామ్). నలుగురు స్నేహితులు కలిసి చేసిన ఓ గొడవ కారణంగా కీర్తన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. పోలీస్ కేసు వరకు గొడవ వెళ్లడంతో తాము మళ్లీ కలిసి ఓ సినిమా చేస్తామని కీర్తన తండ్రితో వివేక్ ఛాలెంజ్ చేస్తాడు. సర్వైవల్ సినిమా తీయడం కోసం థాయ్‌లాండ్ వెళతారు. సినిమా తీసే క్రమంలో వివేక్, కార్తీక్, ఉప్పు, కౌశిక్ మధ్య ఎలాంటి గొడవలు తలెత్తాయి? రావుతో చేసిన ఛాలెంజ్‌లో వారు గెలిచారా? సినిమా తీస్తామని రావుతో వివేక్ ఎందుకు ఛాలెంజ్ చేశాడు? కీర్తనకు కార్తీక్ తన ప్రేమను వ్యక్తం చేశాడా? అపార్థాలు, ఈగోల మధ్య వారి సినిమా ఎలా పూర్తయ్యింది? అన్నదే ఈఎన్ఈ రిపీట్ కథ.

నటీనటుల పనితీరు: నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో విశ్వక్‌సేన్, అభినవ్ గోమటం ఎక్కువగా హైలైట్ అయ్యారు. ఎప్పుడు ప్రస్టేషన్, డిప్రెషన్‌లో ఉండే సినిమా డైరెక్టర్ పాత్రలో విశ్వక్‌సేన్ నటన బాగుంది. తక్కువ డైలాగ్స్‌తో వివేక్ క్యారెక్టర్‌కు మరోసారి న్యాయం చేశాడు. ఈ సీక్వెల్‌లో కామెడీ భారాన్ని మొత్తం అభినవం గోమటం మోశాడు. తన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో కనబడిన ప్రతి సీన్‌లో నవ్వించాడు. నువ్వ డూప్…దుల్కర్ సల్మాన్ కాదు…వేదవాక్కు కాదు..వెధవవాక్కు అంటూ రాసిన ప్రాసలు హిలేరియస్‌గా ఉన్నాయి. ఈ నగరానికి ఏమైందిలో కార్తీక్ పాత్రను సాయిసుశాంత్ పోషించాడు. సీక్వెల్‌లో మాత్రం ఈ క్యారెక్టర్‌లో శ్రీనాథ్ మాగంటి కనిపించాడు.
ఫస్ట్ పార్ట్ మొత్తం ఈ క్యారెక్టర్ ప్రధానంగానే నడుస్తుంది. సీక్వెల్‌లో మాత్రం పరిధి తగ్గించినట్లు కనిపించింది. శ్రీనాథ్ మాగంటి స్టైలిష్‌గా కనిపించాడు. వెంకటేష్ కాకుమాను కామెడీ కొన్ని చోట్ల ఆకట్టుకుంది. శివాత్మికకు మంచి రోల్ దక్కింది. నాచురల్ యాక్టింగ్‌తో కనబరిచింది. అనీషా ఆంబ్రోస్, ప్రియదర్శిని రామ్, కరుణ కుమార్, జీవన్ కుమార్, శ్రీరామచంద్ర, మహేష్ చింతల తమ పరిధుల మేర మెప్పించారు. ఈ సినిమాలో టాలీవుడ్ డైరెక్టర్లు సందీప్ వంగా, అనిల్ రావిపూడి, సాహో సుజీత్, నందినిరెడ్డి తో పాటు అనుదీప్ గెస్ట్‌లుగా కనిపించారు. వారు కనిపించే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్‌నిస్తాయి.

సాంకేతిక వర్గం పనితీరు: ఈ నగరానికి ఏమైందికి కొనసాగింపుగా తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు. నలుగురు స్నేహితుల పాత్రలనే తీసుకొని కొత్త కథతో ఈ సీక్వెల్ ను రూపొందించారు. సీక్వెల్ ఐడియా బాగుంది కానీ తరుణ్ భాస్కర్ ఎంచుకున్న కథలోనే కొత్తదనం లేదు. ఇలాంటి పాయింట్‌తో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. ఫస్ట్ పార్ట్‌లో కామెడీ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యింది. ఆ మ్యాజిక్ సీక్వెల్‌లో మిస్సయ్యింది.
వివేక్ సాగర్ పాటల్లో బతుకమ్మ సాంగ్ బాగుంది. అరోన్ సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. సెకండాఫ్‌లో థాయ్‌లాండ్ సీన్లలో వచ్చే విజువల్స్ బాగున్నాయి. పార్ట్ వన్‌తో పోలిస్తే సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తోనే నిర్మాతలు తెరకెక్కించారు. రెండు గంటల నలభై మూడు నిమిషాల రన్‌టైమ్ ఎక్కువగా అనిపించింది. లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది.

విశ్లేషణ: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ శైలి భిన్నంగా ఉంటుంది. ప్రేమ, కెరీర్ విషయంలో యువతరంలో ఉండే ఆలోచనలు, సంశయాలు, అనుమానాలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. హీరోయిజం, కమర్షియల్ హంగులకు దూరంగా చాలా రియలిస్టిక్‌గా ఆయన సినిమాల్లోని పాత్రలు సాగుతుంటాయి. కామెడీ కూడా సిట్యూవేషనల్‌గానే పండిస్తుంటారు. అదే ఫార్మెట్‌తో ఈఎన్ఈ రిపీట్‌ను తెరకెక్కించారు.
నలుగురు స్నేహితుల అల్లర్లను చూపిస్తూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీ గొప్పతనాన్ని చాటిచెప్పారు. సినీ రంగం పట్ల సమాజంలో ఉండే చిన్నచూపును చెబుతూనే ప్రజలకు అవి ఎలా స్ఫూర్తిగా నిలుస్తున్నాయి వివరిస్తూ తరుణ్ భాస్కర్ రాసిన డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. రాజీవ్ కనకాల చనిపోతే సినిమా హిట్టే అనే సెంటిమెంట్‌పై తరుణ్ రాసిన సైటెర్లు బాగా పేలాయి.
ఆ క్రియేటివిటీ కీలకమైన కథలో మాత్రం చూపించలేకపోయారు తరుణ్ భాస్కర్. రావుతో ఛాలెంజ్ చేసిన వివేక్ అండ్ గ్యాంగ్ సినిమా తీయడానికి పడే పాట్లు సాగతీతలా అనిపిస్తాయి. ఆ సీన్లు మొత్తం గందరగోళంగా సాగాయి. కామెడీ, సీరియస్‌నెస్ రెండు మిస్సయ్యాయి. నలుగురు స్నేహితులు గొడవలు పడటానికి సరైన కారణాలు కనిపించవు. నలుగురు స్నేహితులు కలిసి తీసిన సినిమా కూడా సిల్లీగా అనిపిస్తుంది.
అసలు కథలోకి వెళ్లడానికి తరుణ్ భాస్కర్ చాలానే టైమ్ తీసుకున్నారు. డైలాగ్స్‌లో ఇంగ్లీష్ ఎక్కువైంది. మాస్ ఆడియెన్స్‌కు అవి ఎక్కడం కష్టమే. క్లైమాక్స్ లో కథ సడెన్‌గా ఎండయిన ఫీలింగ్ కలుగుతుంది. గెస్ట్ పాత్రలను బాగా వాడుకున్నారు.

ఫోకస్ పాయింట్: సీక్వెల్‌లో నవ్వుల డోసు తగ్గింది.
రేటింగ్: 2.5/5

















