2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

ఈ ఏడాది ఆరంభంలోనే ‘క్రాక్’ సినిమా హిట్ తో ఇండస్ట్రీకి ఊపొచ్చింది. ఆ తరువాత ‘నాంది’, ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’, ‘వకీల్ సాబ్’ ఇలా వరుస విజయాలను ఇండస్ట్రీ రుచి చూసింది. ఇంతలో సెకండ్ వేవ్ రావడంతో దేశంలో ప్రజలతో పాటు ఇండస్ట్రీ కూడా బాగా ఇబ్బంది పడింది. కరోనానే కాకుండా.. ఇండస్ట్రీని మరిన్ని వివాదాలు చుట్టుముట్టాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత సినిమా ఇండస్ట్రీలోకి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కరోనా సమయంలో విడుదలైనా.. భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఏపీలో బెనిఫిట్ షోలను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. మరోపక్క టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీళ్లేందంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యగానే ఏపీ ప్రభుత్వం ఇదంతా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదు.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ :

సెప్టెంబర్ 10న మెగాహీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారు. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో తేజు ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చాలా రోజులు కోమాలోనే ఉన్నాయి. అతివేగం వలనే ఈ ప్రమాదం జరిగిందనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో తేజు హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని.. రోడ్డుపై ఇసుక ఉండడం వలనే ఆయన బైక్ స్కిడ్ అయిందని చెప్పారు. అయినప్పటికీ.. ఈ యాక్సిడెంట్ గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడడంతో మెగాఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా బాధపడ్డారు.

‘రిపబ్లిక్’ ఈవెంట్ :

తేజు యాక్సిడెంట్ కి గురికావడంతో ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చి.. ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ ఇష్యూ గురించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం కావాలనే సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుందని.. ఈ విషయంలో సినీ పెద్దలు కూడా మాట్లాడాలంటూ పవన్ ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయింది.

పవన్ వ్యాఖ్యల వివాదం :

పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో సినిమా పరిశ్రమ పెద్దలు తలలు పట్టుకున్నారు. టికెట్ రేట్లను పెంచాలని నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో పవన్ అలా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. దీంతో తెలుగు నిర్మాతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఏపీ ప్రభుత్వానికి చెప్పారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు టికెట్ రేట్ విషయంలో ఇండస్ట్రీకి అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ :

ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ నేత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి.. పవన్ పై మండిపడ్డారు. పవన్ చాలా మందిని మోసం చేశాడంటూ పోసాని చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ తరువాత మరో ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ అభిమానులు తన భార్యను అవమానకర రీతితో మాట్లాడడం పై పోసాని.. పవన్ పై విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూలో పోసాని వ్యాఖ్యలు వివాదమయ్యాయి.

మా ఎలెక్షన్స్ :

ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ‘మా’ ఎన్నికలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ కి పోటీగా మంచు విష్ణు పోటీ పడ్డారు. మెగా కాంపౌండ్ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయడంతో.. మంచు ఫ్యామిలీ నేరుగానే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. మోహన్ బాబు కూడా చిరుపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మంచు విష్ణు గెలవగా.. రిగ్గింగ్ జరిగిందంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు చేసింది. కొన్ని ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. ఆ తరువాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా గెలిచిన పదవులకు రాజీనామా చేశారు. వాటిని మంచు విష్ణు ఆమోదించారు.

సమంత-చైతు డివోర్స్ :

ఈ ఏడాది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం చైతు-సమంతల విడాకులు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. అంతకుముందే సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అక్కినేని పేరుని తొలగించి అభిమానులకు హింట్ ఇచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా నాగ చైతన్య, సమంత ఇద్దరూ వార్తల్లోనే ఉంటున్నారు. ఈ విషయంలో చాలా మంది సమంతను తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు.

టికెట్ రేట్ ఇష్యూ :

ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం సినిమా టికెట్స్ పై చర్చ బాగా నడుస్తోంది. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో థియేటర్ యజమానులు ప్రభుత్వం విధించిన రేట్లకు టికెట్లను అమ్మలేక థియేటర్లను మూసేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే సినిమా టికెట్ రేట్లు రూ.5 నుంచి రూ.15 రూపాయల రేంజ్ లో ఉన్నాయి. మరోపక్క.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లు పెంచుకోమని ఇండస్ట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కిరాణా కొట్టు కలెక్షన్స్ :

హీరో నాని ‘శ్యామ్ సింగరాయ్’ ప్రమోషన్స్ లో భాగంగా టికెట్ రేట్ ఇష్యూపై మాట్లాడారు. ఏపీలో థియేటర్లో కలెక్షన్స్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాపులో కలెక్షన్స్ బాగున్నాయంటూ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలో దుమారం రేపాయి. ఏపీ మంత్రులు నానిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus