దంగల్ (యుద్ధం)

  • April 28, 2017 / 06:28 AM IST

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కీలకపాత్ర పోషించడంతోపాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించి రూపొందించిన చిత్రం “దంగల్”. ఆడపిల్లలు కుస్తీ పోటీల్లో పాల్గొనడం అనే నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకుడు. అమీర్ ఖాన్ మినహా అందరూ కొత్తవారితోనే తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మొదలుకొని సాంగ్స్ వరకూ అన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ముఖ్యంగా అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం తన శరీరాన్ని కష్టపెట్టి సాధించిన “ట్రాన్స్ ఫార్మేషన్” ప్రత్యేక ఆకర్షణగా నేడు (డిసెంబర్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేషాలు మీకోసం..!!

కథ : మ‌ల్ల యోధుడైన మ‌హావీర్ సింగ్ ఫోగ‌ట్ కుటుంబ ప‌రిస్థితుల వ‌ల్ల కుస్తీ పోటీల్లో మెడ‌ల్ సాధించ‌లేక‌పోతాడు. తాను సాధించ‌లేక‌పోయిన‌ మెడ‌ల్‌ను త‌న పిల్ల‌లైనా సాధిస్తార‌ని భావిస్తాడు.. జాతీయ స్థాయిలో పహిల్వాన్ గా మెడ‌ల్ సాధించాల‌న్న‌ది కోరిక‌. అయితే త‌న‌కు ఆడ పిల్ల‌లు పుట్ట‌డంతో హ‌తాశుడ‌వుతాడు. అయినా చివ‌రికి వారి ద్వారా అనుకున్న‌ది సాధించిన మ‌ల్ల‌యోధుడు మ‌హావీర్ సింగ్ ఫోగ‌ట్ జీవిత క‌థే ఈ దంగ‌ల్ ఇతివృత్తం. ఎక్క‌డో హ‌ర్యానాలోని పల్లెటూరి జీవ‌నం. వంశాన్ని ఉద్ధ‌రించే పిల్ల‌వాడు లేక‌పోవ‌డం గ్రామాల్లో అవ‌మానంగానే చూస్తారు. న‌లుగురు ఆడ పిల్ల‌ల తండ్రిగా మారిన‌ ఫోగ‌ట్ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను ఊహించ‌వ‌చ్చు. బంగారు ప‌త‌కం సాధించేది కూతురైనా, కొడుకైనా… దానిని బంగారు ప‌త‌కమనే అంటారు క‌దా అన్న ఆలోచ‌న ఫోగ‌ట్ ఆశ‌ల‌కు ఊపిరిపోస్తుంది. ఇక ఆ త‌ర్వాత బంగారు ప‌త‌క సాధనే ల‌క్ష్యంగా ఫోగ‌ట్ త‌న చుట్టూ ఉన్న స‌మాజాన్నీ, కుటుంబాన్నీ, ఒక ద‌శ‌లో త‌న కూతుర్ల‌తోనూ పోరాట‌మే చేస్తాడు. చివ‌రికి త‌న కూతుర్ల ద్వారా మ‌ల్ల యుద్ధంలో బంగారు ప‌తాకాలు సాధించ‌డంమంతా మిగిలిన క‌థ‌.

నటీనటుల పనితీరు : వ్యక్తిగా అమీర్ ఖాన్ ను తిట్టుకొనేవారుంటారేమో కానీ.. నటుడిగా అతడిపై కనీసం వేలెత్తే సాహసం సైతం ఎవరూ చేయలేరు. ఒక నటుడిగా తన పాత్రకు ప్రాణం పోయడం కోసం అమీర్ పడే తపన అలాంటిది. “దంగల్” చిత్రంలోనూ అదే స్థాయి పర్ఫెక్షన్ ను చూపించాడు అమీర్. ఆరు నెలలు కష్టపడి పెంచిన కండలు కదా అని తన బాడీ చూపించుకోవడం కోసం ఎక్కువ స్క్రీన్ టైమ్ ను తీసుకోలేదు. కేవలం రెండే నిమిషాల సీన్ లో మాత్రమే అదరగొట్టే దేహంతో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా.. తాను వెనుక ఉండి కొత్త అమ్మాయిలైన జైరా వసీం, సానియా మల్హోత్రా, అపర్శక్తి ఖురానా మరియు “గీత” పాత్రధారి అయిన ఫాతిమా శానా షేక్ కు వెండితెరను అప్పగించిన తీరుకు జోహార్.

జైరా వసీం, ఫాతిమా శానా షేక్, సానియా మల్హోత్రా, అపర్శక్తి ఖురానాలు తెరపై కనిపించడానికి కొత్తవారేమో కానీ.. పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం కెమెరాకు ఒక్క ఫ్రేమ్ లో కూడా గౌరవం ఇవ్వకుండా పాత్రల్లో జీవించిన విధానం, కుస్తీ పోటీలో రాణించిన తీరు చూసి ఇన్స్పైర్ కాని వారు ఉండరేమో. సాక్షి తన్వార్ గృహిణి పాత్రలో జీవించేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో తనదైన మార్క్ వేసింది. అలాగే.. సినిమాలోని అందరు నటీనటులు తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఈ పాత్ర ఇక్కడ అనవసరమేమో అన్న సందేహం ఎక్కడా కలగదు, అందుకు దర్శకుడు నితీష్ తివారీని మెచ్చుకొని తీరాల్సిందే.

సాంకేతికవర్గం పనితీరు : ప్రీతమ్ సంగీతం కంటే అతడు సమకూర్చిన నేపధ్య సంగీతం కీలక సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. సేతు శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. కలర్ గ్రేడింగ్ ను సందర్భానుసారంగా వాడుకోవడంతోపాటు.. ఎమోషనల్ సీన్స్ కు పెట్టిన టైట్ క్లోజ్ లు, కుస్తీ పోటీలకు వాడిన క్రేజ్ షాట్స్ సినిమాలోని భావాన్ని వ్యక్తీకరించడం కోసం అతడు పడిన కష్టాన్ని ప్రతిబింబింపజేస్తాయి. కథకుడిగా కంటే దర్శకుడిగా నితీష్ తివారీ చేసిన మాయాజాలంలో చిక్కుకోని ప్రేక్షకుడు ఉండడు. సినిమాకి చాలా కీలకమైన క్లైమాక్స్ సీన్ లో “ఫైనల్ గేమ్”కి స్టేడియంలో తండ్రి పాత్రధారి అమీర్ ఖాన్ స్టేడియంలో లేకుండానే అతడి కుమార్తె గోల్డ్ మెడల్ గెలుచుకొనేట్లు సీన్ ను డిజైన్ చేసి.. సన్నివేశాన్ని రంజింపజేయడమే కాదు.. ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికెత్తేశాడు.

విశ్లేషణ : మాస్, క్లాస్ అన్న బేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు కోరుకొనేది “ఎంటర్ టైన్మెంట్”. ఆ ఎంటర్ టైన్మెంట్ ను అందించడంతోపాటు.. పైకి అనకపోయినా ప్రతి మగవాడిలోనూ “ఆడపిల్లే” కదా అని కాస్త తక్కువగా చూసే సహజ గుణాన్ని పారద్రోలి, ఎక్కడో మనసు లోతుల్లో పూడుకుపోయిన దేశభక్తిని కూడా ఒక్కసారిగే మేల్కొలిపే స్పూర్తిదాయక చిత్రం “దంగల్” (తెలుగులో “యుద్ధం”).

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus