Dear Uma Review in Telugu: డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పృథ్వీ అంబర్ (Hero)
  • సుమయ రెడ్డి (Heroine)
  • కమల్ కామరాజు ,సప్తగిరి,అజయ్ ఘోష్,ఆమని,రాజీవ్ కనకాల,పృథ్వీరాజ్ (Cast)
  • సాయి రాజేష్ మహాదేవ్ (Director)
  • సుమయ రెడ్డి (Producer)
  • రధన్ (Music)
  • రాజ్ తోట (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 18, 2025

ఒక తెలుగమ్మాయి హీరోయిన్ గా నిలదొక్కుకోవడమే కష్టమవుతున్న ఈ తరుణంలో.. అనంతపూర్ నుంచి వచ్చిన సుమయ రెడ్డి పరిచయ చిత్రంతోనే నటిగా, నిర్మాతగా, రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హాస్పిటల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? సుమయ రెడ్డి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతుందా? అనేది చూద్దాం..!!

Dear Uma Review

కథ: పెద్ద రాక్ స్టార్ అవ్వాలనుకునే తపన ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక రోడ్ల వెంబడి తిరుగుతుంటాడు దేవ్ (పృథ్వీ అంబార్), అందరి చేత “గెటవుట్” అనిపించుకునే దేవ్ ను మొదటిసారి ఉమ (సుమయ) “వెల్కం” చెబుతుంది. దాంతో ఆమెను అభిమానించి, ప్రేమించడం మొదలెడతాడు దేవ్. కట్ చేస్తే.. దేవ్ కి ఉమ గురించి ఊహించని నిజం తెలుస్తుంది.

అసలు ఉమ ఎవరు? దేవ్ & ఉమకి ఉన్న సంబంధం ఏమిటి? ఉమకి ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “డియర్ ఉమ” చిత్రం.

నటీనటుల పనితీరు: కన్నడ నటుడు పృథ్వీ అంబర్ కి ఇది మొదటి తెలుగు సినిమా అయినప్పటికీ.. లిప్ సింక్ విషయంలో ఎక్కడా తడబడలేదు. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగోకపోయినప్పటికీ.. పృథ్వీ మాత్రం పూర్తి న్యాయం చేశాడు.

సుమయ రెడ్డి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ఆమె పాత్రను మిస్టీరియస్ గా డీల్ చేసిన విధానం బాగున్నప్పటికీ, క్యారెక్టర్ ఆర్క్ ను క్లారిటీగా రాసుకుని ఉంటే ఆసక్తిగా ఉండేది.

కమల్ కామరాజు క్యారెక్టర్ సినిమాకి మెయిన్ సర్ప్రైజ్. ఆ పాత్ర వేరియేషన్స్ కానీ, కమల్ నటన కానీ కథ గమనానికి తోడ్పడ్డాయి.

సప్తగిరి కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు, అజయ్ ఘోష్ విలనిజం పండే ఆస్కారం ఉన్నా పెద్దగా వాడుకోలేదు.

సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి నిజంగా రధన్ మ్యూజిక్ ఇచ్చాడా అనిపిస్తుంది. చాలా చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ కనీస స్థాయిలో కూడా లేదు. ఇక హీరో తాను సింగర్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం పాడే పాటలు మరి కాపీ రైట్స్ వలనో లేక మిక్సింగ్ కి టైమ్ లేకనో తెలియదు కానీ.. హీరో రఫ్ ట్రాక్స్ ఉంచేశారు. అవి చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఒక్క రెయిన్ ఫైట్ తప్ప చెప్పుకోదగ్గ ఫ్రేమ్ కానీ, సీన్ కానీ ఏదీ లేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి.

సుమయ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఆమె లేవనెత్తిన ప్రశ్న కూడా ప్రశంసనీయమే. అయితే.. ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్ కథనంతో ఆసక్తి క్రియేట్ చేయడంలో తడబడ్డాడు. ఉమ పాత్ర ట్విస్ట్ & కమల్ కామరాజు క్యారెక్టర్ ట్విస్టులు బాగానే వర్కవుట్ అయినప్పటికీ.. డ్రామాని ఆసక్తికరంగా నడపడంలో మాత్రం విఫలమయ్యాడు.

విశ్లేషణ: రాసుకున్న కోర్ పాయింట్ తోపాటు, ఆ పాయింట్ ను నడిపించే కథనం కూడా బాగుండాలి. అప్పుడే సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటుంది. లేదంటే బలప్రయత్నంగా మిగిలిపోతుంది. “డియర్ ఉమ” పరిస్థితి కూడా ఇంతే. అయితే.. ఎవరో అవకాశం ఇవ్వాలి అంటూ వెయిట్ చేయకుండా, తన అవకాశాన్ని తానే సృష్టించుకున్న సుమయ రెడ్డి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. అలాగే.. ఈ సినిమా ద్వారా లేవనెత్తిన “ఆపరేషన్ గదిలో ఒక్క బంధువైనా ఉండాలి” అనే కీలకమైన పాయింట్ మాత్రం కచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది.


ఫోకస్ పాయింట్: పాయింట్ బాగుంది కానీ.. ఎగ్జిక్యూషన్ గాడి తప్పింది!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus