రీ-రిలీజ్..ల ట్రెండ్ ఇంకా ముగిసిపోలేదు.ఒక్కోసారి పీక్స్ కి చేరుకుంటుంది. పాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్‌ని మళ్లీ థియేటర్లో చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ లిస్టులోకి ఇప్పుడు సూర్య డిజాస్టర్ మూవీ ‘సికిందర్’ చేరడం విశేషం. సూర్య, సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడమే కాకుండా, సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్‌కి గురైంది. అయితే ఇప్పుడు ఆ తప్పులన్నీ సరిదిద్దుకుని సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ గురించి, అలాగే గతంలో ఈ సినిమా సాధించిన ఫలితం గురించి డైరెక్టర్ లింగుస్వామి ఓపెన్ అయ్యారు. ‘సినిమా తీసేటప్పుడు, ఎడిటింగ్ విషయంలో నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్లే అప్పట్లో రిజల్ట్ తేడా కొట్టింది. జనం ఆ తప్పులనే పాయింట్ ఔట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఆ చిన్న చిన్న లోపాలు దెబ్బతీశాయి’ అని అంగీకరించారు.
అయితే ఈసారి పాత ప్రింట్..ను ఉన్నది ఉన్నట్లుగా రిలీజ్ చేయడం లేదు. ఈసారి పక్కా ప్లానింగ్‌తో వస్తున్నారు. గతంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా సినిమాలోని అనవసరమైన సీన్లకు కత్తెర వేశారు. ఏకంగా 30 నిమిషాల ‘ల్యాగ్’ కంటెంట్‌ను లేపేసి, కేవలం సూర్య క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే సన్నివేశాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ ‘క్రిస్ప్ వెర్షన్’ కచ్చితంగా ఆడియన్స్‌కి నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నారు లింగుస్వామి.
నవంబర్ 28న ఈ ‘సికిందర్ 2.0’ వెర్షన్ థియేటర్లలోకి రాబోతోంది. మరి ఈ ఎడిటెడ్ వెర్షన్ అయినా సూర్య ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఫ్లాప్ అయిన సినిమాలు అన్నీ తగిన మార్పులతో మళ్లీ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.