Demonte Colony 2 Review in Telugu: డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 21, 2024 / 06:01 PM IST

Cast & Crew

  • అరుల్ నిధి (Hero)
  • ప్రియ భవానీశంకర్ (Heroine)
  • మత్తుకుమార్, అరుణ్ పాండ్యన్ తదితరులు.. (Cast)
  • ఆర్.అజయ్ జ్ఞానముత్తు (Director)
  • బాబీ బాలచంద్రన్ - విజయ్ సుబ్రమణ్యం - ఆర్.సి.రాజ్ కుమార్ (Producer)
  • సామ్ సి.ఎస్ (Music)
  • హరీష్ కన్నన్ (Cinematography)

ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు నాలుగే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు. అతడి పరిచయ చిత్రమైన “డిమాంటి కాలని”కి (Demonte Colony) సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా “డిమాంటి కాలనీ 2”ను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు అజయ్. గత వారం తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి రెస్పాన్స్ అందుకుంది, ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. మరి తమిళ ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ హారర్ ఎంటర్ టైనర్ మన తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

Demonte Colony 2 Review

కథ: ముందుగా.. ఈ సీక్వెల్ “డిమాంటి కాలనీ 2” అర్థమవ్వాలన్నా, కనెక్ట్ అవ్వాలన్నా ప్రీక్వెల్ అయిన “డిమాంటి కాలనీ” తప్పనిసరిగా చూడాల్సిందే. ఇక కథలోకి వెళ్తే.. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడాన్ని డెబ్బీ (ప్రియ భవానీశంకర్) తీసుకోలేకపోతుంది. అతని మరణం వెనుక కారణం ఏమిటి అనేది వెతకడం మొదలెడుతుంది. సరిగ్గా సామ్ మరణించిన ఆరేళ్ల తర్వాత అతని ఆత్మతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అనుకోని విధంగా శ్రీనివాస్ (అరుల్ నిధి)ను డిమాంటి నుండి కాపాడుతుంది. ఆ సమయంలో శ్రీనివాస్ & డిమాంటి గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటుంది డెబ్బీ.

ఏమిటా విషయం? అసలు శ్రీనివాస్ ను డెబ్బీ ఎలా కాపాడింది? డిమాంటికి వీళ్ళందరితో సంబంధం ఏమిటి? అసలు డిమాంటీకి సంబంచించిన పుస్తకాన్ని వీళ్లు ఎందుకు చదువుతున్నారు? చదివేలా ఎవరు చేస్తున్నారు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు చెప్పిన సమాధానాలు సమాహారమే “డిమాంటి కాలనీ 2” చిత్రం.

నటీనటుల పనితీరు : బహుశా హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత ప్రియ భవానీశంకర్ ను కాస్త కొత్తగా చూపించిన సినిమా ఇదే అనుకుంటా. ఆమె లుక్ కానీ నటన కానీ ప్రేక్షకులకు గుర్తుండేలా ఉంటాయి. అరుల్ నిధి ద్విపాత్రాభినయం కూడా బాగుంది. రెండు పాత్రల నడుమ వ్యత్యాసాన్ని చూపేందుకు అరుల్ నిధి తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాన్నిచ్చాయి.

ముత్తుకుమార్ కి “సార్పట్ట” తర్వాత కాస్త మంచి పాత్ర ఈ సినిమాతోనే లభించింది. అర్చన రవిచంద్రన్ ఉన్నంతలో కాస్త కామెడీ యాడ్ చేసింది. మిగతా నటీనటులందరూ ఎక్కడా అతి చేయకుండా.. సన్నివేశానికి అవసరమైన మేరకే నటించి సినిమాకి హెల్ప్ అయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు: సామ్ సి.ఎస్ సంగీతం & సౌండ్ డిజైన్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఒక హారర్ సినిమాకి ఏ తరహా సౌండ్ డిజైన్ ఉండాలో బాగా అర్థం చేసుకొని ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ఎలివేట్ చేశాడు. కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు గగుర్పాటుకు గురయ్యారంటే కారణం సామ్ సంగీతం అనే చెప్పాలి. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. డ్రోన్ షాట్స్ & నైట్ షాట్స్ ను చాలా చక్కగా కంపోజ్ చేశాడు. అయితే… గ్రాఫిక్స్ విషయంలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల స్క్రీన్ మీద కొన్ని అవకతవకలు స్పష్టంగా కనిపిస్తాయి.

గ్రాఫిక్స్ మాత్రం చాలా పేలవంగా ఉన్నాయి. క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్ & థ్రిల్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. సరైన సీజీ వర్క్ లేని కారణంగా అవి తేలిపోయాయి. సీజీ వర్క్ విషయంలో నిర్మాతలు రాజీపడకుండా ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది. సినిమాకి సీజీ వర్క్ పెద్ద మైనస్ అయ్యిందని చెప్పాలి. అయితే.. దర్శకుడిగా, కథకుడిగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. ముఖ్యంగా సీక్వెల్ అనేసరికి ఏదో ఒకలా కనెక్ట్ చేయకుండా సినిమాలో కీలకమైన సన్నివేశమైన జ్యోతిష్యుడి చావును కనెక్ట్ చేసుకొని సీక్వెల్ ను నడిపిన తీరు ప్రశంసనీయం.

అలాగే.. మూడో పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. సీన్ కంపోజిషన్ విషయంలో హాలీవుడ్ చిత్రం “1408”ను కాపీ కొట్టినా.. సౌత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సదరు సన్నివేశాలను మార్చుకున్న విధానం బాగుంది. హాలీవుడ్ & కొరియన్ సినిమాల ఇన్స్పిరేషన్ మరీ ఎక్కువగా ఉన్నా కూడా.. కథ-కథనంతో ఆ చిన్నపాటి లోపాలను కవర్ చేశాడు అజయ్.

విశ్లేషణ: పేలవమైన గ్రాఫిక్స్ ను పక్కన పెడితే.. అద్భుతమైన సౌండ్ డిజైనింగ్ & స్క్రీన్ ప్లే కోసం “డిమాంటి కాలనీ 2” చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో చూడాల్సిందే. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పార్ట్ 3 విషయంలో మరీ ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది.

ఫోకస్ పాయింట్: సరికొత్తగా భయపెట్టారు!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus