Devara Review in Telugu: దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • జూనియర్ ఎన్.టి.ఆర్ (Hero)
  • జాన్వీ క‌పూర్ (Heroine)
  • సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, శృతి మరాఠే (Cast)
  • కొరటాల శివ (Director)
  • మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ (Producer)
  • అనిరుధ్ రవిచందర్ (Music)
  • ఆర్.రత్నవేలు (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 27, 2024

ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సోలో హీరోగా నటించగా విడుదలైన సినిమా “దేవర పార్ట్ 1” (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో జాన్వికపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవ్వగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించాడు. మరి రాజమౌళి ఎఫెక్ట్ నుండి ఎన్టీఆర్ మూడోసారైనా తప్పించుకోగలిగాడా? కొరటాల “ఆచార్య”తో కోల్పోయిన క్రెడిబిలిటీ మళ్లీ సంపాదించుకోగలిగాడా? అనేది చూద్దాం..!!

Devara Story

కథ: బ్రిటీష్ కాలం నుండి ఎర్ర సముద్రం వీరులు అంటే ప్రపంచానికి వణుకు. అటువంటి వీరుల వారసులు స్వాతంత్రం తర్వాత సరైన ఆదాయం లేక బ్రతకడం కోసం స్మగ్లింగ్ చేస్తుంటారు. అలా బ్రతుకుతున్న నాలుగు దిక్కుల గ్రామాలకు పెద్ద దిక్కు దేవర (ఎన్టీఆర్). దేవర చెప్పిన మాటకు ఎదురుతిరిగే ధైర్యం ఎవరికీ ఉండదు. అయితే.. దేవర గుండెబలాన్ని తన కండబలంతో ఎదిరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు బైరా (సైఫ్ అలీఖాన్). ఊళ్లో జనాలు ఇంకెప్పుడూ స్మగ్లింగ్ కోసం సముద్రంలోకి వెళ్లకూడదు అనే ధ్యేయంతో ఊరికి, సముద్రానికి కాపరిలా మారి తప్పు చేస్తే దేవర చంపేస్తాడు అనే భయాన్ని సృష్టిస్తాడు.

కట్ చేస్తే.. దేవర సంద్రంలోకి వెళ్లిన 14 ఏళ్ల తర్వాత కూడా అతడ్ని చంపడం కోసం భైరా ఎదురుచూస్తూనే ఉంటాడు. అదే సమయంలో తండ్రి ధైర్యాన్ని పుణికిపుచ్చుకోలేకపోయిన కొడుకు వర (ఎన్టీఆర్) మాత్రం తండ్రి పేరు నిలబెట్టలేని కొడుకుగా అభాసుపాలవుతూ ఉంటాడు.

అసలు దేవర ఏమయ్యాడు? ఇన్నేళ్లుగా సముద్రానికి కాపలా కాయడానికి కారణం ఏమిటి? వర తండ్రి పేరును నిలబెట్టగలిగాడా? భైరా పగ చల్లారిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “దేవర పార్ట్ 1” కథాంశం.

నటీనటుల పనితీరు: రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఓ ఊరి మొత్తానికి దైర్యంగా నిలిచిన దేవరగా ఠీవీగా కనిపించిన ఎన్టీఆర్, ప్రతి విషయానికి భయపడే వర పాత్రలో బేలగా కనిపించి నటుడిగా సత్తా చాటుకున్నాడు. ఇక ఫైట్స్ & డ్యాన్సులతో మరోమారు తన అభిమానుల్ని సంతుష్టులను చేశాడు. మరీ ముఖ్యంగా ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ & గ్రేస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.

సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) క్యారెక్టర్ కు తగ్గ విలనిజాన్ని పండించాడు. లిప్ సింక్ చాలా చోట్ల మిస్ అయినప్పటికీ.. ఎన్టీఆర్ ను ఢీకొనే సరైన ప్రతినాయకుడిగా అతని స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది.

జాన్వికపూర్ (Janhvi Kapoor) కనిపించేది సెకండాఫ్ నుంచే అయినా.. కనిపించిన మూడు సీన్లలో తన గ్లామర్ తో అలరించి, నటనతో పర్వాలేదనిపించుకుంది. చుట్టమల్లే పాటలో జాన్వీ సొగసు మెలికలు కుర్రకారును మెలితిప్పడం ఖాయం.

శ్రీకాంత్ రాయప్ప అనే కీలకమైన పాత్రలో తన సీనియారిటీని ప్రూవ్ చేసుకోగా.. సినిమాలో కథకుడి పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్, కథనానికి కేంద్రబిందువుగా కనిపించిన అజయ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సహాయ పాత్రల్లో కనిపించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, తమిళ నటుడు కలైయరసస్ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా మిగిలిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి మెయిన్ ఎసెట్ రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే 20 నిమిషాల ఎర్ర సముద్రం ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆ ఫైట్ ను తెరకెక్కించిన విధానం, రత్నవేలు ఫ్రేమ్స్ మాత్రం రిపీట్ స్టఫ్ అని చెప్పొచ్చు. అలాగే.. ఆఖరి 15 నిమిషాల అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. సదరు యాక్షన్ బ్లాక్స్ ను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది.

అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు మిస్ మ్యాచ్ అయినప్పటికీ.. ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్స్ & సాంగ్స్ విషయంలో మాత్రం మ్యాజిక్ చేశాడు. రెట్రో సీన్స్ కి మెటాలిక్ మ్యూజిక్ చాలా చోట్ల సింక్ అవ్వలేదు. అందువల్ల ఫియర్ సాంగ్ కానీ, కొన్ని చోట్ల దేవర పాత్రకు పడే ఎలివేషన్స్ కానీ ఎలివేట్ అవ్వాల్సిన స్థాయిలో అవ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు అని బాగా ఎలివేట్ చేశాయి.

దర్శకుడు కొరటాల శివ తన సినిమాలతో సమాజానికి ఉపయోపడే విషయాల్ని చెప్పడంలో సిద్ధహస్తుడు. “దేవర” చిత్రంలోనూ ఆ తరహా పాయింట్ ను టచ్ చేశాడు కానీ, ఎందుకో అనుకున్నంతగా వర్కవుట్ అవ్వలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ వరకు రచయితగా, దర్శకుడిగా పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ.. సెకండాఫ్ లో మాత్రం తేలిపోయాడు. మరీ ముఖ్యంగా ఎప్పుడొస్తుందో తెలియని రెండో భాగం కోసం ఇచ్చిన లీడ్ కూడా ఆసక్తికరంగా లేకపోవడం గమనార్హం. అన్నిటికంటే ముఖ్యంగా.. దేవర & వర పాత్రలను సరిగా ఎస్టాబ్లిష్ చేయకుండా, వాళ్ల గురించి తెలుసుకోవాలంటే రెండో పార్ట్ కోసం వెయిట్ చేయాలనట్లుగా వదిలేసిన తీరు రచయితగా అతడి ప్రతిభపై మచ్చగా మిగిలిపోతుంది.

ఓవరాల్ గా.. “ఆచార్య” లాంటి డిజాస్టర్ తర్వాత “దేవర”తో పర్వాలేదనిపించుకున్నాడు కొరటాల శివ. అయితే.. “దేవర” దర్శకుడిగా, రచయితగా కొరటాల స్థాయికి తగ్గ సినిమా అయితే కాదు. ఎందుకంటే.. 177 నిమిషాల సినిమాలో కొరటాల మార్క్ మహా అయితే ఒక 20 నిమిషాలు కనిపిస్తుంది. మిగతా అంతా యాక్షన్ కొరియోగ్రాఫర్ & ఎన్టీఆర్ చూసుకున్నారు.

Devara Review

విశ్లేషణ: ఒక సినిమాను రెండు భాగాలుగా విడదీసి విడుదల చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. “బాహుబలి” లాంటి సినిమానే సడన్ గా ముగించేసరికి “ఇదేమైనా సీరియలా తరువాయి భాగం వచ్చే వారం అనడానికి” అంటూ తిట్టిపోశారు ప్రేక్షకులు. అయితే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే అంశాన్ని సెకండ్ పార్ట్ కి కీలకంగా మార్చుకున్నాడు రాజమౌళి. సో, సినిమాలోని గ్రాండియర్ & విజువల్స్ కి ఈ హుక్ పాయింట్ హెల్ప్ అవ్వడంతో సెకండ్ పార్ట్ సూపర్ హిట్ అయ్యింది.

అయితే.. “దేవర” విషయంలో ఆ హుక్ పాయింట్ మిస్ అవ్వడంతోపాటు, క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సరిగా లేకుండాపోయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా పేలవంగా ఉండడం, ముఖ్యంగా సినిమాను ముగించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో “దేవర” చతికిలపడింది.

అయితే.. ఆరేళ్ల ఎన్టీఆర్ సోలో రిలీజ్ కాబట్టి, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కోసం, రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ కోసం, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం “దేవర”ను థియేటర్లలో ఒకసారి చూడొచ్చు.

ఫోకస్ పాయింట్: అర’కొర’గానే అలరించిన “దేవర”!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus