స్టేజీ మీద హీరోల ఫ్యాన్స్ వచ్చి చేసే హడావుడి కొన్నిసార్లు ఓవర్‌గా కనిపించి.. రియల్ ఫ్యాన్స్ చేసే సందడి కూడా ఒక్కోసారి నమ్మే పరిస్థితి లేకుండా పోయింది కానీ.. కొన్ని సినిమాల వేదికల మీద భావోద్వేగానికి గురై అభిమానులు చేసే పనులు మనసును మెలితిప్పేస్తుంటాయి కూడా. అలాంటి ఓ ఘనట ‘కర’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగింది. ప్రముఖ తమిళ నటుడు ధనుష్, యువ కథానాయిక మమితా బైజు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానున్న విషయం తెలిసిందే.
‘కర’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ పూర్తయి ధనుష్ వెళ్లిపోతుండగా ఓ మహిళా అభిమాని ఆయన్ను కలిశారు. ధనుష్‌ను చూసి ఎగ్జైట్ అయిన ఆమె మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు. దీంతో షాక్ అయిన ధనుష్ ఆమెను పైకి లేపడానికి ప్రయత్నించినా అలాగే మోకాళ్లపై కూర్చుని తన అభిమానాన్ని చాటుకున్నారామె. దీంతో కాస్త అసౌకర్యంగా ఫీల్ అయిన ధనుష్ ఆమెను పైకి లేపి ఫొటో దిగి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అదే ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. నాకెంతో దగ్గరైన చిత్రమిది. అసాధారణ సమస్యల్లో చిక్కుకున్న ఓ సామాన్యుడి కథ ఈ సినిమా. నాకింత మంచి చిత్రాన్ని ఇచ్చినందుకు దర్శకుడు విఘ్నేశ్‌కి థాంక్స్. ఇకపై తన పేరుని మళ్లీ మళ్లీ వింటూనే ఉంటారు. ఈ విషయంలో మేం చాలా నమ్మకంగా ఉన్నాం అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ దేశం గర్వించే నటుడు ధనుష్. సినిమా టీజర్, ట్రైలర్ చూశాను. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను అని చెప్పారు.