ఎం.ఎస్.ధోనీ

“సినిమా, క్రికెట్”లను రెండు కళ్లుగా భావించే మన భారతీయులకు “ధోనీ” గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ ను సాధించి పెట్టిన ఘనమైన రికార్డ్ సొంతం చేసుకోవడంతోపాటు కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే “ఎం.ఎస్.ధోనీ”. “స్పెషల్ చబ్బీస్, బేబీ” చిత్రాల సృష్టికర్త నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 30)న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారతీయుల ముందుకు వచ్చింది. మరి ఈ విశేషాలేంటో చూసేద్దాం..!!

కథ : ఇది ధోనీ జీవితం, జార్ఖాండ్ కు చెందిన ఓ సాధారణ యువకుడు భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎలా ఎదిగాడు, ఆ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అవరోధాలేమిటి? వంటి విషయాలకు దృశ్య రూపమే “ఎం.ఎస్.ధోనీ” చిత్రం.

నటీనటుల పనితీరు : టైటిల్ క్యారెక్టర్ అయిన “ఎం.ఎస్.ధోనీ”గా నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ జీవించేశాడు. ఆహార్యం మొదలుకొని బాడీ లాంగ్వేజ్ వరకూ ప్రతి విషయంలోనూ ధోనీని మక్కీకి మక్కీ దించేశాడు. ముఖ్యంగా ధోనీ హాట్ ఫేవరెట్ అయిన “హెలికాప్టర్” షాట్స్ విషయంలో ధోనీని సైతం మించిపోయాడు సుశాంత్. ధోనీని కెప్టెన్ కూల్ అని ఎందుకు సంభోదిస్తారో ఈ సినిమాలో సుశాంత్ నటన చూస్తే అందరికీ అర్ధమవుతుంది, ఆ స్థాయిలో సుశాంత్ తన నటనతో అదరగొట్టాడు.

ధోనీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గా దిశా పాట్నీ, ధోనీ వైఫ్ గా కైరా అద్వానీలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ధోనీ తండ్రి పాత్రలో అనుపమ్ ఖేర్, అక్కయ్యగా భూమిక చావ్లా కూడా పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు : సంగీత దర్శకులు అమాల్ మాలిక్, రోచక్ కోహ్లీ, సంజోయ్ చౌదరీలను ముందుగా మెచ్చుకోవాలి. సినిమా నత్తనడకలా సాగుతున్న తరుణంలో తమ బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని తెచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎడిటింగ్ పర్లేదు కానీ.. ఎంత ధోనీ అయినా మూడు గంటలపాటు అతడ్నే తెరపై చూడాలంటే క్రికెట్ అభిమానులకు ఏమో కానీ.. రెగ్యులర్ ఆడియన్స్ కు కాస్త కష్టమే.

సంతోష్ కెమెరా పనితనం ఆశ్చర్య గొలిపేలా ఉంది. ముఖ్యంగా ధోనీ సిక్సర్ లను తెరకెక్కించిన విధానం, ధోనీ మనసులో మదనపడే సన్నివేశాల్లో లైట్ డిమ్ చేసి సన్నివేశంలోని ఎమోషన్ ను ప్రేక్షకులకు మరింత సులభంగా అర్ధమయ్యేలా చేసిన విధానం అతడి ప్రతిభకు నిదర్శనం. దిలీప్ ఝా తో కలిసి దర్శకుడు నీరజ్ పాండే సిద్ధం చేసుకొన్న కథలో చాలా వరకూ నిజం ఉన్నప్పటికీ.. సినిమాగా తీయడం కోసం కాస్త నాటకీయతను ఎక్కువగానే మేళవించారనిపిస్తుంది. ధోనీ వీరాభిమానుల్ని ఈ విషయం కాస్త బాధపెట్టవచ్చు.

దర్శకుడిగా నీరజ్ పాండే ధోనీ జీవితాన్ని అందరికీ చెప్పాలనుకోవడం అనేది మంచి ఆలోచనే కానీ.. అందుకు మూడు గంటలా అయిదు నిమిషాల నిడివిని ఎంచుకోవడం మాత్రం సరైనది కాదు. అందులోనూ కథలో నాటకీయతను పతాక స్థాయిలో ఇనుమడింపజేయడం, అతి ముఖ్య ఘట్టమైన వరల్డ్ కప్ ను గెలవడాన్ని సాదాసీదాగా ముగించేయడం సగటు ప్రేక్షకులనూ అంతగా మెప్పించదు. సో, దర్శకుడిగా నీరజ్ పాండే బొటాబోటి మార్కులతో పాస్ అయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ : “బయో పిక్” అంటే ఉన్నది ఉన్నట్లుగానే తీయాలని రూల్ ఏమీ లేదు. ఇంతకుమునుపు వచ్చిన “భాగ్ మిల్కా భాగ్”నే తీసుకొంటే.. అందులో మిల్కా సింగ్ జీవితాన్ని చాలా నాటకీయంగా తెరకెక్కించాడు దర్శకుడు, కానీ కీలకమైన క్లైమాక్స్ ఘట్టాన్ని ఎంతో నేర్పుతో ధియేటర్ లో ఆడియన్స్ నిల్చోని చప్పట్లు కొట్టే స్థాయిలో తెరకెక్కించాడు అందుకే ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతోపాటు చిత్ర బృందానికి మంచి పేరు కూడా తీసుకువచ్చింది. అయితే.. “ఎం.ఎస్.ధోనీ” విషయంలో మాత్రం ఆ పట్టు మిస్ అయ్యింది. ఆ కారణంగా “ధోనీ” మేనియా కారణంగా ఈ సినిమాకు ప్రారంభంలో మంచి వసూళ్లు రావోచ్చు కానీ.. ఓవరాల్ గా ఘన విజయం సాధించడం అయితే.. కష్టమే!

రేటింగ్ : 3/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus