విక్రమ్ తనయుడు.. ఇది ధ్రువ్‌కి ఎంతవరకు కెరీర్‌లో ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. తెలియని బరువును అయితే పెంచుతోంది. ఎందుకంటే ధ్రువ్ సినిమా వచ్చినప్పుడల్లా తన తండ్రితో పోలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ధ్రువ్ నుండి రెండు సినిమాలు రాగా, రెండింటిలోనూ పోలికలు వచ్చాయి. అయితే తండ్రి మార్గంలో ప్రయోగాలకు వెళ్లకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు ధ్రువ్. ఈ క్రమంలో తన కెరీర్‌లో మూడో సినిమా చేశాడు. అదే ‘బైసన్’. గ్రామీణ కబడ్డీ, కక్షలు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. కబడ్డీనే ప్రాణంగా భావించే ఓ ఊరిలోని ఓ కుర్రాడికి, అతని కుటుంబానికి అదే కబడ్డీ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే కథ. కబడ్డీ నేపథ్యం అంటూ బైసన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియాల్సి ఉంది. అయితే ఆ కటలో బైసన్‌లా హీరో దూసుకుపోతాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అన్నట్లు ఈ సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.
కబడ్డీ బ్యాక్ డ్రాప్‌గా 1990 నాటి పరిస్థితుల ఆధారంగా ‘బైసన్’ సినిమా తెరకెక్కింది. ధ్రువ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మామన్నన్’ సినిమా ఫేమ్ మారి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు ధ్రువ్ సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులూ చూస్తారని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది.
తండ్రిలా యాక్షన్ సినిమాలకు ఓటేస్తున్న ధ్రువ్.. ఆయనలా ప్రయోగాలు అయితే చేయడం లేదు. అయినా చేసిన రెండు సినిమాలు ‘ఆదిత్య వర్మ’, ‘మహాన్’ సినిమాలతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. ఇప్పుడు ‘బైసన్’ అయినా ఆయన కోరుకున్న ఫలితం ఇస్తుందేమో చూడాలి. కుర్రాడికైతే తమిళ స్టార్ హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ కాలమే కలసి రావడం లేదు.