ఆయన దర్శకుడై 18 ఏళ్లు పూర్తవుతోంది. చేసినవాటిలో మ్యాగ్జిమమ్ విజయాలే. కానీ ఇప్పటివరకు ఆరు సినిమాలు మాత్రమే చేశారు. ఎందుకు, ఏంటి అనేది తెలియదు కానీ.. కథలను ఓకే చేసుకోవడంలో మాత్రం చాలా లేటు అని మాత్రం అర్థమవుతుంది. ఆయన నుండి ఓ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా సినిమా రావడం లేదు కానీ.. ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నారు అని మాత్రం తెలుస్తోంది. ఆయనే వంశీ పైడిపల్లి.
దిల్ రాజు ఆస్థాన దర్శకుడిగా పేరు గాంచిన వంశీ పైడిపల్లి నుండి వచ్చిన ఆఖరి సినిమా ‘వరిసు’ / ‘వారసుడు’. 2023లో ఈ సినిమా వచ్చింది. అప్పటి నుండి వంశీ ఇప్పటివరకు సినిమా చేయలేదు. కనీసం ఎవరికైనా కథ చెప్పారు అనే మాట కూడా వినిపించలేదు. అయితే ఎట్టకేలకు ఆయనకు ఓ హీరో ఓకే అయ్యారు అని తెలుస్తోంది. ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఇటీవల వంశీ చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పారు అని ఓ వార్త బయటకు వచ్చింది.
బాలీవుడ్ – సౌత్ సినిమా కలయికల ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఆ కోవకే ఈ కాంబినేషన్ కూడా రానుంది. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లోకి సోలో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాతోనే వెళ్లనున్నారట. దిల్ రాజు ఎన్నో ఏళ్లుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ అవ్వడం లేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. మరి ఈసారి వంశీ ఎలాంటి కథతో వస్తారో చూడాలి.
సల్మాన్ ఖాన్ అంటే యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తారు. గతంలో వంశీ పైడిపల్లి ‘మున్నా’, ‘ఎవడు’, ‘వరిసు’ లాంటి యాక్షన్ సినిమాలు చేశారు. అయితే అందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇక పూర్తిగా కథ, ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్ అయితే ‘బృందావనం’, ‘ఊపిరి’, ‘మహర్షి’ కనిపిస్తాయి. కాబట్టి ఎలాంటి సినిమా వస్తుందనేది ఆసక్తికరమే.