సినిమా బాగుందని టాక్ వస్తే.. భాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే మన మేకర్స్ వేరే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వెంటనే రైట్స్ కొనేసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. ఇటీవల ‘కాంతారా’ సినిమా కన్నడ ఇండస్ట్రీలో సంచలనం రేపుతుందని తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్.. తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులో సినిమా రిలీజై మూడు వారాలు దాటినా..
ఇప్పటికీ భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ‘కాంతారా’ జోరు చూసి ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈసారి ఆ పని దిల్ రాజు చేయబోతున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళంలో విడుదలైన ‘లవ్ టుడే’ అనే సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. గతంలో జయం రవితో ‘కోమాలి’ అనే సినిమాను తెరకెక్కించాం దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి తమ ఫోన్స్ ను మార్చుకొని ఒక రోజు మొత్తం గడిపితే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనేది సినిమా. దీన్ని కామెడీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు భారీ వసూళ్లు రాబడుతోంది.
కోలీవుడ్ లో గత కొన్నేళ్లలో సూపర్ హిట్ అయిన చిన్న సినిమా ఇదేనని చెబుతున్నారు. ఈ సినిమాకి వస్తోన్న టాక్ చూసి ఇప్పుడు తెలుగులో డబ్ చేయాలని నిర్ణయించుకున్నారు దిల్ రాజు. మరి తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!