నేను మార్చను అంటే… నేనే చేసుకుంటా అంది

‘మణికర్ణిక’ సినిమా సమయంలో కర్ణిసేన నుంచి ఎదురైన నిరసనలు ఒకెత్తయితే… దర్శకత్వం విషయంలో కంగన – క్రిష్‌ జాగర్లమూడి మధ్య జరిగిన మరో ఎత్తు. సోనూ సూద్‌ సినిమా నుంచి తప్పుకోవడం, కథలో మార్పులు చేస్తున్నారనే విషయాలు తెలియడం, క్రిష్‌ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ వార్తలు రావడం ఆ రోజుల్లో చర్చకు దారి తీశాయి. ఆఖరికి టైటిల్స్‌లో డైరక్షన్‌ అంటూ క్రిష్‌, కంగన రనౌత్‌ పేర్లు కనిపించాయి. ఈ విషయంలో అప్పుడు క్రిష్‌ ఓ సారి స్పందించారు. ఆ తర్వాత మీడియా కొన్ని కథనాలు రాసింది, కంగన ఏవో ట్వీట్లు కూడా చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు క్రిష్‌ స్పందించారు.

‘‘మణికర్ణిక’ గురించి నేను ఇప్పటివరకు ఒక్కసారే మాట్లాడాను. ఆ తర్వాత సోషల్‌మీడియాలో ఏవేవో వార్తలు వచ్చాయి. కంగన రనౌత్‌ కూడా ట్వీట్‌ పెట్టారు. దాదాపు 25 రోజులపాటు హైదరాబాద్‌లోనే షూటింగ్‌ చేశాం. 91 రోజుల్లో ‘మణికర్ణిక’ చిత్రీకరణ పూర్తయింది. ఆ సమయంలో మా ఇద్దరి (కంగన- క్రిష్‌) మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు. అయితే రీరికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు కంగన టీమ్‌ సినిమా చూశారు. ఫస్ట్‌ హాఫ్‌ నచ్చిందన్నారు. సెకండ్ హాఫ్‌ కూడా బాగుందని చెప్పారు’’ అంటూ అప్పటి విషయాలు చెప్పారు క్రిష్‌.

‘‘అక్కడికి కొన్నిరోజులు తర్వాత కంగన టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ చేశారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు నచ్చలేదని, అలాగే కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగోలేదని చెప్పారు. నేను షూట్‌ చేసిన సినిమా ప్రకారం సోనూ సూద్‌ పోషించిన ‘సదాశివ్‌’ పాత్ర ద్వితీయార్ధంలో చివరి 20 నిమిషాల వరకు ఉంటుంది. కానీ ఆ పాత్ర నిడివి విషయం వాళ్లకు నచ్చలేదు. సదాశివ్ పాత్రను ఫస్ట్‌ హాఫ్‌తోనే ముగించమన్నారు. ఆ పని నా వల్ల కాదని చెప్పాను. ‘మణికర్ణిక’ ఒక చారిత్రాత్మక చిత్రమని, అలాంటి మార్పులు సరికాదని కూడా చెప్పాను. ఆ తర్వాత కంగన టీమ్‌ సోనూసూద్‌ని కలసి సినిమాలో పాత్రను తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు రీషూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రతిపాదనకు సోనూ అంగీకరించలేదు’’ అంటూ సోనూ సూద్‌ పాత్ర నిడివి తగ్గింపు చర్చను వివరించారు.

‘‘కంగన టీమ్‌తో మాట్లాడాక సోనూ నాకు ఫోన్‌ చేసి.. ‘నిజంగానే నా పాత్రను రీషూట్‌ చేస్తున్నారా? నీకు ఓకే అయితే నాకెలాంటి ఇబ్బందిలేదు’’ అన్నారు. దానికి నేను ‘అలా ఏం లేదు అని, నేను రీషూట్‌ చేయడం లేద’’ని చెప్పాను. ఇదే విషయాన్ని కంగనకు ఫోన్‌ చేసి సోనూ చెప్పారు. దానికి ‘క్రిష్‌ సినిమా రీషూట్‌ చేయకపోతే నేను చేస్తాను’ అని కంగన అన్నారట. అలా సినిమాకు సంబంధించిన వివాదం ప్రారంభమైంది. నేను ఒప్పుకోకపోయేసరికి ఆ తర్వాత వాళ్లే రీషూట్‌ చేసుకున్నారు’’ అని చెప్పారు క్రిష్‌.

‘‘ఈ మొత్తం వ్యవహారంలో నా బాధ ఏమిటంటే.. నేను అనుకున్న, తెరకెక్కించిన కథను ప్రజలకు చూపించలేకపోయాను. ‘మణికర్ణిక’ను నేను వంద శాతం చిత్రీకరించాను. కానీ అందులో కంగన టీమ్‌ ఎన్నో మార్పులు చేసి ఇప్పుడు మీరు చూసిన సినిమాను సిద్ధం చేశారు’’ అని క్రిష్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రాత్మక కథలో మార్పులు కంగన తన పాత్ర వెయిట్‌ పెంచుకుందని గతంలో వార్తలొచ్చాయి. క్రిష్‌ మాటలు వింటుంటే అదే నిజం అనిపిస్తోంది. మరి ఈ విషయంలో కంగన అండ్‌ టీమ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus