కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయం ‘క’ (KA) సినిమా రూపంలో ఈ దీపావళికి వచ్చింది. దీంతో ఆయనకు బీభత్సమైన కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా సినిమాల్లోనే ఆయన మీద ట్రోలింగ్ జరిగింది. అంతలా ఆయన మీద ద్వేషం వెళ్లగక్కారు మరి. సినిమా విజయం సాధించిన నేపథ్యంలో సినిమాకు సీక్వెల్ ముచ్చట్లు వినిపించాయి. కానీ దర్శకద్వయం మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. టాలీవుడ్ బాక్సాఫీసు దీపావళి బరిలో ‘క’ సినిమాతో మోస్ట్ అవైటెడ్ విజయం అందుకున్నాడు కిరణ్ అబ్బవరం.
సుజీత్ – సందీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేపథ్యం, కిరణ్ పాత్ర ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాలో చూపించిన కృష్ణగిరి ఊరు కూడా ఆకట్టుకుంది. దీంతో ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది అని వార్తలొచ్చాయి. టీమ్ ఆలోచనా అదే అని అన్నారు. కానీ దర్శకద్వయం వేరేగా చెబుతోంది. ‘క’ సినిమా కథ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నాం.
కానీ మల్టీప్లెక్స్‌ల కన్నా బీ,సి సెంటర్ల ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు అని సినిమాకు వస్తున్న స్పందన గురించి చెప్పారు సుజీత్ – సందీప్. ఒకప్పుడు తాము థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డ్స్ చూశామని, ఇప్పుడు మా సినిమాకు హౌస్‌ఫుల్స్ బోర్డులు పెడుతున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు.
‘క’ సినిమాలోని క్లైమాక్స్‌ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని సినిమా చేస్తున్న సమయంలో భయపడ్డాం. కానీ ఇప్పుడు అందరికీ కనెక్ట్ అయ్యింది. థియేటర్స్‌లో ప్రేక్షకులు క్లైమాక్స్ చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ ‘క’ సినిమాకు ప్రీక్వెల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. కృష్ణగిరి గ్రామం నేపథ్యం ఏంటి అనేది సినిమాలో చూపించాలని అనుకుంటున్నాం అని తెలిపారు.