కెరీర్ ప్రారంభంలో ఎన్నో నెగిటివ్ రోల్స్ పోషించి తరువాత విలన్ గా కూడా చేసి మెప్పించాడు శ్రీహరి. అంతేనా తరువాత హీరోగా కూడా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన అభిమానుల్ని కూడా సంపాదించుకున్నాడు. ఎన్నో దేశభక్తి సినిమాలు, సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ఉన్న చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక అటుతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘మగధీర’ ‘బృందావనం’ ‘ఢీ’ ‘కింగ్’ వంటి చిత్రాల్లో నటించాడు. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేస్తాడు అనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన 2013 అక్టోబర్ లో సడెన్ గా మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆయన్ని అభిమానించేవాళ్ళు ఇప్పటికీ ఆ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు కూడా..! ఆయన మరణం వెనుక ఉన్న అసలు కారణాల్ని తాజాగా ఆయన భార్య డిస్కో శాంతి తెలియజేసింది. తాజాగా తన కుమారుడు మేఘాంశ్ హీరోగా రాబోతున్న ‘రాజ్ దూత్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా శ్రీహరి మరణించిన రోజు రాత్రి ఏం జరిగింది అనేది మరోసారి మీడియాతో పంచుకుంది శాంతి.
డిస్కో శాంతి మాట్లాడుతూ.. ” అప్పటి వరకూ మాతోనే ఉన్న నా బావ కొన్ని గంటల్లోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. లివర్ సమస్య కారణంగా ఒక్కసారిగా హాస్పిటల్‌కు తీసుకెళ్ళడం.. రక్తం కక్కుకోవడం.. రెండు గంటల్లోనే చనిపోవడం… ఇదంతా ఇప్పటికీ ఓ పీడకలగానే ఉందని చెబుతుంది శాంతి. ఆ రోజు ఆర్.రాజ్ కుమార్ సినిమా కోసం ముంబై వెళ్ళాము.. హోటల్లో ఉన్నాం. అప్పటి వరకూ బాగానే ఉన్న నా బావ.. కాస్త అనారోగ్యంగా ఉందని చెప్పడంతో డాక్టర్‌కు ఫోన్ చేసి రమ్మని చెప్పాము… డాక్టర్ రావడం.. ఏదో ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పటికీ నేను మా ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగి ఇంజెక్షన్ ఇవ్వండని చెప్పినా వాళ్ళు వినకుండా ఇచ్చేసారు. అప్పటికి నేను నైటీలో ఉండటంతో లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేలోపే ఆయన్ని బండిలో ఎక్కించి లీలావతి హాస్పిటల్ కు తీసుకువెళ్ళిపోయారు.అది తెలుసుకుని వెంటనే నేను కూడా హాస్పిటల్ కు వెళ్ళాను. అప్పటికే ఆయన్ని ఐసియులో పెట్టారు.. కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. దీంతో నేను చాటుగా లోపలికి వెళ్ళాను.. అప్పటికే నా బావ రక్తంలో తడిసిపోయి ఉన్నాడు. అది చూసి గట్టిగా ఏడ్చేసాను.. దాంతో డాక్టర్లు నన్ను బలవంతంగా బయటికి పంపేసారు. వెంటనే నేను భయపడి నా చెల్లి, తమ్ముడికి ఫోన్ చేసాను. వాళ్ళు కూడా వచ్చి శ్రీహరిని చూసొచ్చారు. రాత్రి 9.30 ప్రాంతంలో మరోసారి లోపలికి వెళ్ళి చూసేసరికి డాక్టర్లు ఏదో తప్పు చేసారని అర్థమైపోయింది. పైగా తప్పు జరిగిందని బతిమాలుకుంటున్నట్లు కనిపించింది. లివర్ సమస్య ఉందని తెలిసినప్పుడు పైప్ నేరుగా పెట్టడంతో అది వెళ్ళి లివర్‌కు కుచ్చుకోవడంతో రక్తం ధారాళంగా పోయిందని.. నేను వెళ్ళి చూసినప్పుడు గది అంతా రక్తంతోనే నిండింది. ఏదేమైనా అప్పుడు డాక్టర్లు చేసిన తప్పుకు నా బావ… నాకు దూరమైపోయాడు” కన్నీళ్ళు పెట్టుకుంది శాంతి.