కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు థియేటర్లలో అంతగా ఆదరణ పొందకపోవచ్చు.. కానీ ఓటీటీలోకి వచ్చాక ఇలాంటి మంచి సినిమాను థియేటర్లలో మిస్ అయ్యామా. ఫ్రెండ్స్ అందరం కలసి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసేవాణ్ని కదా అనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్‌సేన్‌లోని వెర్సటాలిటీని ప్రేక్షకుల పరిచయం చేసిన సినిమా, తరుణ్ భాస్కర్ టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించిన సినిమా అది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రెడీ అవుతోంది.
నిజానికి, ఈ సినిమా సీక్వెల్ కోసం చాలా ఏళ్లుగా వెయిట్ చేశారు జనాలు. ఇదిగో, అదిగో అంటూ తరుణ్ భాస్కర్ చెప్పడమే కానీ అవ్వలేదు. దీంతో ఈ సినిమా మీద ఇక ఆశలు, అంచనాలు వదిలేసుకోవడమే అనుకుంటున్న సమయంలో సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి స్టార్ట్ చేసేశారు కూడా. ఆ సినిమా గురించి ఇప్పుడు ఓ విషయం బయటకు వచ్చింది. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తున్నపుడు బడ్జెట్ పెరగడం సహజమే. కానీ ఆ బడ్జెట్ ఏకంగా 15 రెట్లు పెరిగిందట. ఈ విషయాన్ని నిర్మాతే చెప్పారు.
దీంతో తొలి పార్టు వచ్చినప్పుడే థియేటర్లలో ఆ సినిమా చూడటానికి ముందుకు రాలేదు, ఈసారి వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో ఇంత బడ్జెట్ పెంచేశారా అనే ప్రశ్నలు, చర్చలు మొదలయ్యాయి. అయితే నిర్మాత సృజన్ యరబోలు మాత్రం సినిమా కోసం అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెబుతున్నారు. తొలి పార్టుకు రూ.2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. అంటే ఇప్పుడు రూ.30 కోట్ల వరకు సినిమాకు పెడుతున్నారన్నమాట.
ఇలా బడ్జెట్ పెరగడానికి ఉన్న ముఖ్య కారణాల్లో తొలి పార్టులో ఉన్న ముఖ్యమైన నటుల్ని ఇప్పుడూ కంటిన్యూ చేయడమే అని తెలుస్తోంది. తొలి పార్టులో విశ్వక్‌సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గొమటం, వెంకటేశ్ కాకుమాను ముఖ్య పాత్రల్లో నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. వీరిలో ఆ తర్వాత రాణించి రెమ్యూనరేషన్లు పెంచేసింది ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అన్నట్లు ఈ సినిమాలో ఈ సారి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని సమాచారం.