మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు కొన్ని దశాబ్దాలుగా మారుమోగుతున్న ఒక బ్రాండ్. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వటం ఖాయం. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా ద్వారా మళ్ళీ చిరు తన గ్రేస్ డాన్సులతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించటంతో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు మళ్లీ పాత రోజులను గుర్తుచేశాయి.
ఇప్పుడు అదే ఊపును రెట్టింపు చేస్తూ మరోసారి థియేటర్లలో మాస్ జాతరకు సిద్ధమవుతున్నాడు చిరు. గతంలో దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ హిట్ తర్వాత చిరు-బాబీ కాంబో మళ్లీ కలిసి పనిచేయబోతుంది అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతానికి ‘మెగా 158’గా పిలుస్తున్న ఈ సినిమా కలకత్తా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
ఈ చిత్రంలో చిరంజీవి పాత్రకు గట్టి భావోద్వేగాలుంటాయని, కథలో కుమార్తె పాత్ర కీలకంగా ఉండబోతుందని సమాచారం. అందుకే ఆ పాత్ర కోసం యంగ్ హీరోయిన్స్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట దర్శకుడు. అందులో ముందుగా వినిపిస్తున్న పేరు కృతిశెట్టి. ఈ యంగ్ హీరోయిన్, ఈసారి పూర్తిగా కొత్త షేడ్ ఉన్న పాత్రలో కనిపించనుందన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అలాగే మరో యంగ్ టాలెంట్ అనశ్వర రాజన్ పేరు కూడా రేసులో ఉంది. సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్న అనస్వర ఈ సినిమాలో ఉంటే, చిరుతో ఆమె కాంబినేషన్ ఫ్రెష్ గా వుంటుందని వినికిడి. ఇలా మెగా 158 నుంచి వస్తున్న అప్డేట్స్ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి.
సంగీతం విషయానికి వస్తే ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం. నిర్మాణ బాధ్యతలను KVN ప్రొడక్షన్స్ చేపట్టనుండగా, ఫిబ్రవరిలో ఫార్మల్ లాంచ్, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూట్ పూర్తి చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి చిరు-బాబీ కాంబో మరోసారి మాస్ రచ్చకు తెరలేపబోతోంది!