దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ మూవీ సంచలన విజయం సాధించింది. నాని, సమంత నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సాయికొర్రపాటి నిర్మించి ప్రశంసలు అందుకున్నారు. అదే బ్యానర్లోనే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్నారు. మంచి నిర్మాణ విలువలు కలిగిన బ్యానర్ ని ఎంచుకొని కల్యాణ్ దేవ్ సగం విజయాన్ని అందుకున్నారు. ఈ బ్యానర్లో డైరక్టర్ రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన విజేత సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అలాగే సినిమాని జులై ఆరో తేదీన రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు.
అదే డేట్ న విజేత రావడం వెనుక బలమైన కారణం ఉంది. తన బ్యానర్లో అద్భుతమైన హిట్ గా నిలిచిన ఈగ జులై ఆరో తేదీన విడుదలయింది. అందుకే అదే రోజు విజేతని థియేటర్లోకి తీసుకు వస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి బ్యానర్లో హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయిన తేదీనే సావిత్రి బయోపిక్ మహానటిని రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు సాయికొర్రపాటి అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.