వెండితెరపై చిరు చిరునవ్వులతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే నటీమణుల వెనుక ఎన్నో కనబడని బాధలు దాగి ఉంటాయి. అలాంటి అనుభవాన్ని తన జీవితంలో ఎదుర్కొన్న నటి ఈషా రెబ్బా. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈషా, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అతిపెద్ద విషాదాన్ని పంచుకొని ఎమోషనల్ అయ్యారు.
కెరీర్ మంచి గాడిలో పడుతున్న సమయంలోనే ఆమె తల్లి అనూహ్యంగా కన్నుమూయడం ఈషాను తీవ్రంగా కుదిపేసింది. షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో, తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చిందన్న సమాచారం అందిందని ఈషా గుర్తుచేసుకున్నారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే కారులోనే తల్లి ప్రాణాలు విడిచారని చెప్పుకొచ్చారు. కేవలం 53 ఏళ్ల వయసు కలిగిన తల్లిని కోల్పోవడం తన జీవితంలో ఎప్పటికీ మానని గాయం అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
అయితే, ఆ విషాద సమయంలో కూడా ఒక నటిగా తన బాధ్యతను మర్చిపోలేదు ఈషా. తన కారణంగా షూటింగ్ ఆగిపోకూడదని, నిర్మాతలకు నష్టం కలగకూడదన్న ఆలోచనతో, అమ్మ మరణించిన కేవలం 11 రోజులకే మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. గుండె నిండా బాధ ఉన్నా, ముఖంపై నవ్వు పెట్టుకుని కెమెరా ముందుకు రావడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఆ సమయంలో తండ్రి కూడా తీవ్ర షాక్‌లో ఉన్నారని, కుటుంబం మొత్తం ఒకరికొకరు అండగా నిలిచామని ఆమె తెలిపారు.
ఇంటర్వ్యూలో ఈషా స్పష్టంగా చెప్పిన మాట ఒక్కటే.. “అమ్మ లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరు.” మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినీ రంగంలో నిలబడే వరకు తల్లి ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహం తనకు బలమని ఆమె అన్నారు. ఇప్పుడు తన విజయాలను చూసేందుకు అమ్మ లేకపోవడం ఎప్పుడూ మనసును కలిచివేస్తుందన్నారు. అయితే , ఈ రోజు అనగా జనవరి 30న తరుణ్ భాస్కర్ హీరోగా ఈషా రెబ్బా హీరోయిన్ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతిహి’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ఈ మూవీ ‘జయ జయహే’ మలయాళ సినిమాకి రీమేక్.