Em Chestunnav Review in Telugu: ఏం చేస్తున్నావ్? సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజయ్ కుమార్ (Hero)
  • నేహా పఠాన్ (Heroine)
  • అమిత రంగనాథ్ , రాజీవ్ కనకాల, 'కేరాఫ్ కంచెరపాలెం' ఫేమ్ రాజు, ఆమని, మధు తదితరులు (Cast)
  • భరత్ మిత్ర (Director)
  • కురువ నవీన్, కురువ కిరణ్ (Producer)
  • గోపీ సుందర్ (Music)
  • ప్రేమ్ అడివి (Cinematography)
  • Release Date : ఆగస్టు 25, 2023

ఆగస్టు చివరి వారంలోకి ఎంటర్ అయ్యాం. ప్రతి వారంలానే ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రాల్లో ‘ఏం చేస్తున్నావ్?’ అనే చిన్న సినిమా కూడా చేరింది. ఎందుకంటే యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ‘ఏం చేస్తున్నావ్?’ ట్రైలర్ ని లాంచ్ చేశాడు. అలాగే ట్రైలర్ లో యూత్ ఫుల్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో ‘ఏం చేస్తున్నావ్?’ అని హీరోయిన్ హీరోని అడిగితే ‘వెయిటింగ్ ఫర్ ప్రభాస్ అన్న ఇన్ పోలీస్ గెటప్ అని మీమ్ చేస్తున్నా’ అంటూ చెప్పడం బాగా హైలెట్ అయ్యింది. సినిమాలో విషయం ఉంది అనే హోప్ ని కలిగించింది. మరి ఆ స్థాయిలో సినిమా ఉందో లేదో ఓ లుక్కేద్దాం రండి :

కథ : సాయి(విజయ్ రాజ్ కుమార్) బి.టెక్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉండే కుర్రాడు. అతని తండ్రి ఓ గవర్నమెంట్ ఉద్యోగి. తనలాగే అతని కొడుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని.. సుఖంగా జీవించాలి అనేది అతని కోరిక. కానీ సాయికి తన తండ్రి చేసే ఉద్యోగం నచ్చదు. అందుకే అతను తన తండ్రిలా గవర్నమెంట్ ఉద్యోగి అవ్వడానికి ఇష్టపడడు. అలా అని అతనికంటూ ఓ గోల్ ఏమీ ఉండదు. ఓ కన్ఫ్యూజన్లో బ్రతుకుతూ ఉంటాడు.

మరోపక్క అతను మ్యాథ్స్ లో వీక్. అయినప్పటికీ మిగతా సబ్జెక్టుల్లో టాపర్. బి.టెక్ లో కూడా అతను ఓ సబ్జెక్ట్ ఫాయి అయ్యి సప్లీలు రాస్తుంటాడు. ఇక సాయి ఖాళీగా ఉండటంతో పక్కింటి వాళ్ళు, చుట్టుపక్కనున్న వాళ్ళు ‘ఏం చేస్తున్నావ్?’ అంటూ అడిగి అతన్ని బాగా విసిగిస్తూ ఉంటారు. అలాంటి టైంలో అతనికి నక్షత్ర(నేహా పఠాన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.

ఆమె సాయిని పెళ్లి చేసుకోవడానికి తన ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఒప్పుకుని తమ హోటల్ బిజినెస్ చూసుకోవాలని సాయికి ఆఫర్ ఇస్తారు. అది సాయికి నచ్చదు. దీంతో నక్షత్రకి బ్రేకప్ చెప్పేస్తాడు. కొన్ని రోజులకి తండ్రి కూడా సాయిని నిలదీయగా.. ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తాడు. దీంతో అతని తండ్రికి కోపం వస్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది.. అతని కెరీర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : ‘ఏం చేస్తున్నావ్?’ సినిమాలో తెలిసిన మొహాలు చాలా తక్కువ. ఆమని హీరో తల్లి పాత్ర చేసింది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది? ఆమె మార్క్ నటన కనపరిచింది. ‘హెలికాఫ్టర్’ సన్నివేశంలో ఆమె పలికించిన హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. రాజీవ్ కనకాల తనకి అలవాటైపోయిన చనిపోయే పాత్ర చేశాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.

‘కేరాఫ్ కంచెరపాలెం’ రాజు రెండు మూడు సన్నివేశాల్లో కనిపించాడు. ఇక హీరోగా చేసిన విజయ్ కుమార్ పెద్దగా ఎనర్జిటిక్ గా చేయలేదు కాని ఆ పాత్రకు తగ్గట్టు సెటిల్డ్ గా చేశాడు. కానీ అతను పలికిన కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నక్షత్ర గా చేసిన నేహా పఠాన్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా మంచి మార్కులు వేయించుకుంది.మరో హీరోయిన్ అమిత రంగనాథ్ జస్ట్ ఓకే అనిపించేలా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఈ సినిమా హీరోకి అన్నయ్యే దర్శకుడు అని ప్రమోషన్స్ లో చెప్పారు. దర్శకుడు భరత్ మిత్ర ఇప్పటి యూత్ లో కెరీర్ పట్ల ఉండే కన్ఫ్యూజన్స్ ఆధారంగా ఈ కథని రాసుకున్నాడు. అది తప్పకుండా మంచి పాయింట్. గతేడాది వచ్చిన శివ కార్తికేయన్ ‘కాలేజ్ డాన్’ పోలికలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఇందులో కొన్ని మంచి డైలాగులు ఉన్నాయి.

అవి సహజంగా ఉండటం వల్ల ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి. సినిమాలో కూడా అక్కడక్కడ అవి బాగా పేలాయి. టైటిల్ కార్డ్ పడే విధానం కూడా బాగుంది. డైరెక్టర్లో టాలెంట్ ఉంది అనడానికి అవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు ‘ఏం చేస్తున్నావ్?’ పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

కానీ సెకండ్ హాఫ్ విషయంలో బ్యాలన్స్ తప్పింది. కథనం ల్యాగ్ అనిపిస్తుంది.ఎమోషనల్ సన్నివేశాలు చాలా బరువుగా అనిపిస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కవర్ చేయడానికి టెక్నికల్ టీంకి ఎక్కువ పని పడింది. టెక్నికల్ గా మాత్రం టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టే సినిమా ఉంటుంది. ప్రేమ్ అడివి సినిమాటోగ్రఫీ బాగుంది. గోపీ సుందర్ బీజియం సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం కొంచెం వీక్ అనే చెప్పాలి.

విశ్లేషణ : యూత్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన ‘ఏం చేస్తున్నావ్?’.. ఫస్ట్ హాఫ్ పరంగా వాళ్ళను మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ ను శ్రద్ధ పెట్టి తీసుంటే ఫలితం మరోలా ఉండేదేమో..!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus