యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా.. ఇప్పటికి 18 ఏళ్ళ కుర్రాడిలా ఆలోచించే నటుడు అమీర్ ఖాన్. కొత్తగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. స్టార్ డం ను పక్కన పెట్టి ప్రయోగాలను చేస్తుంటారు. బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నఅమీర్ ఖాన్ గురించి ఆసక్తికర సంగతులు..
రావద్దు అంటున్నా..అమీర్ ఖాన్ తండ్రి తాహీర్ హుస్సేన్. సినిమా నిర్మాత. సినిమాల్లో నష్టాలు రావడంతో అమీర్ ను సినిమా రంగంలోకి తీసుకురాకూడదని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అమీర్ వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా రంగుల ప్రపంచం లోకి అడుగు పెట్టి .. స్టార్ అయ్యారు. నిర్మాతగా కూడా లగాన్, తారే జామీన్ పర్, పీప్లి లైవ్ వంటి సినిమాలు తీసి హిట్ కొట్టారు. “యుద్ధంలో ముందు నిలబడి పోరాడే నాయకుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో అలాంటిదే సినిమా నిర్మాణం” అని అంటారు అమీర్ ఖాన్.
మైనపు బొమ్మ వద్దు..మేడం టుసాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ పెట్టే అవకాశం కొందరికే వస్తుంది. ఆ ఆఫర్ అమీర్ ఖాన్ ను వెతుకుంటూ వస్తే.. అతను సున్నితంగా తిరస్కరించారు. ప్రాణం లేని బొమ్మలా ఉండటం తనకి ఇష్టం ఉండదని చెప్పారు.
పాత సినిమాలంటే ఇష్టంబాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా పాత సినిమాలు బాగా చూస్తారు. అవి మనసుకు హాయిని ఇవ్వడమే కాకుండా వాటినుంచి ఎన్నో నేర్చుకోవచ్చని చెబుతుంటారు. ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కథలంటే అమీర్ కి భలే ఇష్టం. ఆయన సినిమాలు ఏది వదలకుండా చూశారు. అలాగే బాలీవుడ్ నటీనటుల్లో గోవిందా, వహీదా రెహమాన్, గీతా మూవీలను ఎక్కువసార్లు చూస్తుంటారు.
కొత్త రుచులను ఆస్వాదిస్తూ ..సిక్స్ ప్యాక్ లతో కనిపించాల్సి వచ్చినప్పుడు, పాత్రలకు కసరత్తు చేయాల్సివచ్చినప్పుడు మాత్రమే అమీర్ డైట్ ఫాలో అవుతుంటారు. మిగతా సమయాల్లో కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. పీకే చిత్రం ప్రమోషన్లో భాగంగా అమీర్ హైదరాబాద్ వచ్చినప్పుడు బిర్యానీ టేస్ట్ చేశారు. బాగుందని కితాబు ఇచ్చారు.
బుల్లి తెరపై ..సినిమాల్లో బిజీగా ఉంటూనే బుల్లితెరపై కనిపించడానికి ఆసక్తి చూపించారు. అది సామాజిక బాధ్యతకు సంబంధించిన కార్యక్రమం కావడంతో ఒప్పుకున్నారు. పలు సమస్యల్ని ఈ షో ద్వారా ఎత్తి చూపారు. ఈ కార్యక్రమం ద్వారా అమీర్ కు మరింత మంది అభిమానులు ఏర్పడ్డారు.