‘రాజు వెడ్స్ రాంబాయి’.. ఈ సినిమా కొబ్బరికాయ నుండి ఇప్పుడు రిలీజ్ అనంతరం ప్రచారం వరకు అంతా డిఫరెంట్‌గానే సాగాయి, సాగుతున్నాయి కూడా. సినిమా ఫలితం గురించి టీమ్ చూపించిన తెగువ, ప్రచారంలో విసిరిన సవాళ్లు అదిరిపోయాయి. సినిమా ఫలితం తేడాకొడితే అమీర్‌పేట సెంటర్‌లో అర్ధనగ్నం తిరుగుతా అని డైరెక్టర్ కామెంట్స్ కూడా చేశాడు. ఆ తర్వాత సినిమాకు రూ.99, రూ.105 ధరలు పెడతాం అంటూ మరో ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు అనుకోండి. ఆ వెంటనే తమ సినిమాను తక్కువ చేశారు అంటూ సినిమా నిర్మాతల్లో ఒకరు సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు.
అవును, అయితే ఈ ఆఫర్ కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే. ఏపీలో ఈ రోజు మహిళలు ఎవరైనా సరే కొన్ని సెలెక్టడ్ థియేటర్ల దగ్గరకు వెళ్లి కౌంటర్‌లో ఉచితంగా టికెట్ తీసుకోవచ్చు. ఎంత మంది అనే లిమిట్ లేదు. హౌస్ ఫుల్ అయ్యేదాకా సినిమా టికెట్‌లు తీసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చును థియేటర్ల, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ల నిర్మాతలు చెల్లిస్తారట. దీని కోసం ఏపీ వ్యాప్తంగా 25 థియేటర్లు సిద్ధం చేశారట. ఇంకా తెలంగాణలో ఈ ఆఫర్ లేదు అని చెబుతున్నారు.
ఎందుకంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఈ వారం చాలా కీలకం. వీలైనంత ఈ వారంలోనే రాబట్టుకోవాలి. డిసెంబర్ 5 బాలకృష్ణ – బోయపాటి శ్రీను ‘అఖండ 2: తాండవం’ సినిమా వచ్చేస్తోంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేస్తారని టాక్. బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే మొత్తం థియేటర్లు అటెళ్లిపోతాయి. కాబట్టి ఇప్పుడే వీలైనంత ప్రచారం చేసి.. వసూళ్లు సాధించేయాలి. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్ అదే పని చేస్తోంది.
గతంలో చేసిన టికెట్ రేటు ప్రచారం వర్కవుట్ కాలేదు. రెండ్రోజులకే తిరిగి మామూలు టికెట్లు రేట్లు పెట్టేశారు. మరి ఈ ఆఫర్ అయినా రోజంతా ఉంచుతారా? తెలంగాణలో తెస్తారా అనేది చూడాలి.