టీవీలో ‘రామాయణం’ లాంటి సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూశాం.. చూస్తూనే ఉన్నాం.. చూస్తాం కూడా. అయితే ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలు వస్తే చెప్పలేం కానీ.. రామాయణాన్ని రామాయణంలా తీసే సినిమాలు వస్తే మాత్రం కచ్చితంగా చూస్తాం. ఈ నమ్మకంతోని, రాముడి మీద ప్రేమతో ఇప్పుడు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా మొదటి పార్టును ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రచారాన్ని ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ప్రచార చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ట్రైలర్ జులై 24న యూట్యూబ్‌లో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ఏ పాత్రను ఎవరు పోషిస్తున్నారనే దానిపై ప్రచార చిత్రంతో స్పష్టత వచ్చింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, శతృఘ్నుడిగా నితీశ్ శర్మ నటిస్తున్నారు.
రామానంద్ సాగర్ ఆవిష్కరించిన ప్రఖ్యాత ధారావాహికలో రాముడిగా కనువిందు చేసిన అరుణ్ గోవిల్ ఇప్పుడు ఈ సినిమాలో దశరథుడిగా నటిస్తున్నారు. కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, సుమిత్రగా సోనల్ ఝా కనిపించనున్నారు. మంధర పాత్రను సీబా చద్దా పోషిస్తుండగా, వశిష్ఠ మహర్షిగా శిశిర్ శర్మ, విశ్వామిత్రుడిగా అజింక్య దేవ్ నటిస్తున్నారు.
రావణుడి తల్లి కైకసిగా సీనియర్ నటి శోభన, రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్, సోదరి శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విభీషణుడిగా హరీశ్ ఉత్తమన్, కుంభకర్ణుడిగా ఫైసల్ మాలిక్, శూర్పణఖ భర్త విద్యుత్ జిహ్వుడుగా వివేక్ ఒబెరాయ్ కనిపిస్తాడు. హనుమంతుడిగా సన్నీ డియోల్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, అగస్త్య మహామునిగా ముకేశ్ తివారి, మారీచుడిగా సౌరబ్ సచ్‌దేవ్, తాటకిగా కాంచన్ చేతన్ నటిస్తున్నారు. జటాయువు పాత్రకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారని బాలీవుడ్ టాక్.
https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw