గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

రాజేంద్రప్రసాద్ టైటిల్ పాత్ర పోషించగా రూపొందిన తాజా చిత్రం “గాలి సంపత్”. “అలా ఎలా, లవర్” చిత్రాల ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ సమకూర్చడం విశేషం. సినిమా ట్రైలర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు-లవ్లీ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: ఆలిండియా రేడియోలో వ్యాఖ్యాతగా ప్రఖ్యాతి గాంచిన సంపత్ (గాలి సంపత్) ఓ యాక్సిడెంట్ లో గొంతు పోతుంది. అందువల్ల ఆయనేం మాట్లాడినా నోట్లో నుంచి గాలి తప్ప మరేమీ రాదు. దాంతో ఆయన్ని అందరూ “గాలి సంపత్” అని పిలుస్తూ ఉంటారు. ఆయన కొడుకు (శ్రీవిష్ణు) పాపం సంపత్ గారి అల్లరికి బలవుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో తండ్రీకోడుకుల మధ్య రేగిన చిన్నపాటి గొడవ కారణంగా సంపత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనుకుంటారు అందరూ. కానీ.. సంపత్ తన స్వంత ఇంట్లోని నీళ్ళు లేని బావిలో పడిపోయి ఉంటాడు. పాపం పిలుద్దామంటే గొంతు లేక, ఆ బావి నుంచి బయటపడే ఓపిక, దారి లేక నానా కష్టాలు పడుతున్న సంపత్.. చివరికి ఆ బావి నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది “గాలి సంపత్” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాకి హీరో రాజేంద్రప్రసాదే. టైటిల్ పాత్రలో ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన కెరీర్ లో ప్లే చేసిన మోస్ట్ డిఫికెల్ట్ రోల్ గా ఈ పాత్రను చెప్పుకోవచ్చు. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం, డబ్బింగ్ విషయంలో ఆయన తీసుకున్న స్పెషల్ కేర్ ప్రశంసనీయం మాత్రమే కాదు.. నేటితరం నటులకు స్పూర్తి కూడా. మొదటిసారి శ్రీవిష్ణు నటుడిగా తేలిపోయాడు. రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ పక్కన నటించడం వలనో లేక మనోడి క్యారెక్టర్ కి సరైన డెప్త్ లేకనో తెలియదు కానీ.. నటుడిగా శ్రీవిష్ణు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు.

హీరోయిన్ లవ్లీ సింగ్ కి ఉన్నవే నాలుగు సన్నివేశాలు, ఒక పాట. పాటలో గ్లామరస్ గా కనిపించడానికి ప్రయత్నించింది కానీ.. సన్నివేశాల్లో మాత్రం కనీస స్థాయి లిప్ సింక్ లేక, హావభావాల ప్రకటనలో ఓనమాలు తెలియక ఆమె ఇబ్బందిపడి, ప్రేక్షకులను కూడా ఇబ్బందిపెట్టింది.సత్య క్యారెక్టర్ సినిమాకి మరో ఎస్సెట్ గా చెప్పొచ్చు. సంపత్ పాత్రకు అసిస్టెంట్ కమ్ ట్రాన్స్ లేటర్ గా సత్యది చాలా కీలకమైన పాత్ర. సత్య తన పాత్రకు వంద శాతం న్యాయం చేయడమే కాదు, రాజేంద్రప్రసాద్ టైమింగ్ ను కూడా అందుకోగలిగాడు. రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగర్, అనీష్ కురువిల్ల, రజిత కాస్త నవ్వించారు.

సాంకేతికవర్గం పనితీరు: మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాడు. తెలుగులో చాలా రోజుల తర్వాత అచ్చు రాజమణి మ్యూజిక్ వినిపించింది. పాటలు బాగున్నాయి. అలాగే నేపధ్య సంగీతంతో సినిమాకి మంచి యాడ్ ఆన్ గా నిలిచాడు అచ్చు. ముఖ్యంగా సెకండాఫ్ లో టెన్షన్ క్రియేట్ అవ్వడానికి అచ్చు రాజమణి నేపధ్య సంగీతం కీలకం. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా బావిలో ఆయన పెట్టిన కెమెరా ఫ్రేమ్స్, లైటింగ్ బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చే చాలా సీక్వెన్స్ లకు ఆయన తీసుకున్న జాగ్రత్త సినిమాకి ప్లస్ అయ్యింది.

ఇక సినిమాకి “కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వ పర్యవేక్షణ” అందించిన అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకోవాలి. మూల కథను ఓ కొరియన్ సినిమా నుంచి స్పూర్తి పొందిన అనిల్ రావిపూడి దాన్ని లోకలైజ్ చేసిన విధానం బాగున్నప్పటికీ.. కథనానికి చాలా ముఖ్యమైన ఎమోషన్ ను మిస్ అయ్యాడు. అందువల్ల కథ అలా వెళ్తూ ఉంటుంది కానీ.. కథనానికి ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. రాజేంద్రప్రసాద్ తన పాత్రను పండించడానికి పడిన శ్రమలో సగం అనిల్ రావిపూడి కథనం విషయంలో పడి ఉంటే అందరి కష్టానికి తగిన ఫలితం వచ్చేది.

ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ ను లాజిక్ పక్కన పెడితే మరీ కామెడీగా కానిచ్చేశాడు. రెండు గంటలకి ఒక నిమిషం తక్కువ నిడివి ఉన్న సినిమాలో కూదా ల్యాగ్ ఉండడం అనేది బిగ్గెస్ట్ మైనస్. అన్నిటీకీ మించి క్లైమాక్స్ ను కంగారుగా ముగించేయడం, చాలా విషయాలకు సరైన సమాధానాలు చెప్పకపోవడం మరో మైనస్. ఇలా కథకుడిగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా అనిల్ రావిపూడి చాలా తప్పులు చేశాడు. అనీష్ కృష్ణ మార్క్ అనేది ఎక్కడా కనిపించలేదు. అనిల్ రావిపూడి పర్యవేక్షణలొ అనీష్ కృష్ణ దర్శకత్వానికి పెద్దగా స్కోప్ లేదేమో అనిపిస్తుంది.

విశ్లేషణ: బేసిగ్గా “గాలి సంపత్” మంచి కాన్సెప్ట్ సినిమా. రాజేంద్రప్రసాద్ నటన, అచ్చు రాజమణి సంగీతం, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ హైలైట్స్. అయితే.. కథకు-కథనానికి చాలా ముఖ్యమైన ఎమోషన్ అనేది పండలేదు. అన్నిటికీ మించి.. సెకండాఫ్ ప్రొసీడింగ్ లో ఎమోషన్ అనేది లేకుండాపోయింది. రెండు పాత్రల మధ్య టెన్షన్ అనేది సరిగా క్రియేట్ చేయలేదు, క్యారెక్టర్స్ బిహేవియర్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది.

అందువల్ల ప్రేక్షకుడిలో ఆసక్తి రేపాల్సిన సెకండాఫ్ సోసోగా సాగిపోయింది. అందువల్ల నటీనటులందరూ చక్కని నటప్రదర్శన కనబరిచినా, ఆడియన్స్ ను సినిమాలో ఎంగేజ్ చేసే ఎమోషన్ మాత్రం మిస్ అవ్వడంతో కనెక్టివిటీ ఉండదు. అయినప్పటికీ.. రాజేంద్రప్రసాద్ నటవిశ్వరూపం కోసం సినిమాని కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus