Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

హైదరాబాద్‌లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నిబంధనలు పెట్టింది జీహెచ్‌ఎంసీ. ఆ ప్రదేశం, పరిస్థితులకు అనుగుణంగా అక్కడి భవనాల నిర్మాణంపై ఆ నిబంధనలు ఉంటాయి. వాటిని అతిక్రమిస్తే భవనం యజమానికి నోటీసులు పంపిస్తుంటారు. ఇప్పటికే నగరంలో ఇలాంటివి చాలానే జరిగాయి. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ఓ ఫ్లోర్‌ను ఎందుకు కూల్చివేయకూడదో చెప్పండి అని అందులో పేర్కొంది. ఇంతకీ ఏమైందంటే?

Allu Business Park

జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో అల్లు అరవింద్‌కి ఓ పెద్ద భవనం ఉంది. దానికి అల్లు బిజినెస్ పార్క్‌ అనే పేరు పెట్టారు. అక్కడ కేవలం నాలుగు ఫ్లోర్‌లు నిర్మించడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ అల్లు అరవింద్‌ కుటుంబం ఓ పెంట్ హౌస్ కూడా నిర్మించారని అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. మీరు అనుమతి లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని.. దానిని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు.

రెండేళ్ల క్రితం నిర్మించిన అల్లు బిజినెస్‌ పార్క్‌లో గీతా ఆర్ట్స్‌, అల్లు ఆర్ట్స్‌ కార్యకలాపాలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ అధికారుల నోటీసులకు అల్లు అరవింద్‌ ఏం రిప్లై ఇస్తారో చూడాలి. ఇదిలా ఉండగా అల్లు అరవింద్‌ కుటుంబం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తోంది అనే చర్చ మరోవైపు జరుగుతోంది. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా విడుదల సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న, చేసిన పనులు అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెట్టడానికే అని అప్పట్లో కామెంట్లు వినిపించాయి.

ఇప్పుడు ఈ నోటీసులు రావడంతో ఆ విషయం చర్చలోకి వచ్చింది. అయితే నిబంధనలు అతిక్రమించినప్పుడు అధికారులు చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం ఏదో చేస్తోంది అనుకోవడం సరికాదు అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ విషయంలో ఏమవుతుందో, అల్లు అరవింద్‌ ఏం రియాక్ట్‌ అవుతారో చూడాలి.

 కామెంట్‌ చేసిన వాడిని మాటలతో మడతెట్టేసిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus