నా కెరీర్ లో చెత్త సినిమాలు మాత్రం చేయలేదు – గోపీచంద్

18 ఏళ్ల కెరీర్ లో గోపీచంద్ నటించింది 25 సినిమాలే. హిట్ పర్సెంట్ తక్కువ ఉండొచ్చు కానీ.. ఒక నటుడిగా తన పాత్రకు ఎప్పుడూ పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు గోపీచంద్. అందుకే మాస్, క్లాస్ అన్న బేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులకు గోపీచంద్ ఒన్నాఫ్ ది ఫేవరెట్ హీరో. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ లేక కాస్త ఢీలాపడ్డాడు కానీ.. సరైన సినిమా ఒకటి పడితే మాత్రం హీరోగా నిలదొక్కుకొని, అగ్ర కథానాయకుడిగా క్రేజ్ సంపాదించుకోవడానికి కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న గోపీచంద్ మునుపటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అందుకే ఈసారి కమర్షియల్ అంశాలతోపాటు అండర్ కరెంట్ సోషల్ మెసేజ్ కూడా ఉన్న “పంతం” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు గోపీచంద్. ఎన్టీయార్ లాస్ట్ సూపర్ హిట్ ఫిలిమ్ “జైలవకుశ” చిత్రానికి రైటర్ గా వర్క్ చేసిన చక్రి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన “పంతం” చిత్రంలో గోపీచంద్ సరసన మహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా.. రేపు (జూలై 5) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు గోపీచంద్..!!

చెప్పినంత బాగా తీస్తాడా లేదా అని భయపడ్డాను కానీ..
నాకు ఆల్రెడీ కొత్త డైరెక్టర్స్ తో మాత్రమే కాక కొందరు సీనియర్ డైరెక్టర్స్ తోనూ పెద్ద ఫ్లాప్స్ వచ్చాయి. కథ చెప్పినంత బాగా తీయలేకపోవడమే అందుకు కారణం. చక్రి విషయంలోనూ మొదట ఆ భయం ఉండేది. ఎందుకంటే కుర్రాడు కథ చాలా అద్భుతంగా చెప్పాడు. చెప్పినంత బాగా సినిమా తీయగలాడా లేదా అనే అనుమానం ఉండేది. చెప్పినంత పర్ఫెక్ట్ గా సినిమా తీశాడు చక్రి.

నా పంతం ఏమిటనేది రేపు తెలుస్తుంది..
“పంతం” ఒక అండర్ కరెంట్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్. ఇప్పటివరకూ ఈ తరహా సినిమా రాలేదు అని చెప్పను కానీ.. ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే సినిమా మాత్రం అవుతుంది. సమాజంలో మనం రోజూ ఎదుర్కొనే సమస్యలను కొన్ని చూపిస్తూనే.. ప్రధానమైన ఓ సమస్యకు మాత్రం సోల్యూషన్ చెప్పాలనుకొన్నాం. ఇంతకీ సినిమాలో నా “పంతం” ఏమిటి అనేది మాత్రం రేపు వెండితెరపై చూడండి.

ప్రసాద్ మూరెళ్ళ గారి సహాయం మరువలేనిది..
“పంతం” స్క్రిప్ట్ ను తొలుత రమేష్ రెడ్డి అనే డైలాగ్ రైటర్ నా వద్దకు తీసుకొచ్చారు. దాదాపు 3 నెలల తర్వాత కథ విన్నాను. మధ్యలో ప్రసాద్ మూరెళ్ళ గారు కూడా కథ విను గోపీ నీకు చాలా బాగుంటుంది అని చెప్పారు. కథ విన్న తర్వాత “నాకు నచ్చిందండీ.. కాకపోతే చెప్పినంత బాగా తీయగలాడా, చూస్తే కుర్రాడు కొత్తలా ఉన్నాడు” అని నా మనసులో మాట చెప్పాను. వెంటనే ప్రసాద్ గారు బాధ్యతను తన భుజాలపై వేసుకొన్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు తన ఎక్స్ పీరియన్స్ చాలా హెల్ప్ అయ్యింది. ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. ఆయన లేకపోతే “పంతం” అవుట్ పుట్ ఇలా ఉండేది కాదు.

కమిట్ మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన..
కె.కె.రాధామోహన్ గారు సినిమా అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. మొదట్లో ఆయన కూడా కొత్త దర్శకుడితో రిస్కేమో అని భయపడ్డారు కానీ.. మా కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసి ఆయన కూడా ధైర్యంగా ముందుకొచ్చారు. ఒక బడ్జెట్ అనుకొన్నాక ఆ మొత్తంలోనే సినిమా తీశామ్. నిర్మాతగా మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదాయన. మంచి కమిట్ మెంట్ తోపాటు సినిమా అంటే విపరీతమైన ఫ్యాషన్ ఉన్న నిర్మాత ఆయన.

నన్ను ఎవరూ “ఎంటి ఇలాంటి సినిమా తీశావ్” అని తిట్టలేదు..
నా కెరీర్ లో నేను చేసిన 25 సినిమాల్లో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ.. చెత్త సినిమాలు మాత్రం లేవు. దర్శకులు చెప్పినట్లుగా తీయకపోవడం వల్ల కొన్ని ఫెయిల్ అయితే, ఇంకొన్ని పబ్లిసిటీ సరిగా చేయక లేదా సరైన రిలీజ్ డేట్ సెట్ అవ్వక ఫెయిల్ అయ్యాయి. అంతే తప్ప నా కెరీర్ లో “ఏంట్రా గోపీ చంద్ ఇలాంటి సినిమా చేశాడు” అని ప్రేక్షకులు తిట్టుకొనే స్థాయి బ్యాడ్ ఫిలిమ్ ఒక్కటి కూడా లేదు అని నమ్మకంగా చెప్పగలను.

టెన్షన్ లేదు అంటాను కానీ…
రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ లో సినిమా విడుదలకు ముందు టెన్షన్ పడతారా అని ఎవరు అడిగినా పెద్దగా టెన్షన్ పడను అని పైకి చెప్తుంటాను కానీ.. చాలా టెన్షన్ పడతాను. నేనెప్పుడు రిజల్ట్ గురించి కంటే జనాలు సినిమాని ఎలా రిసీవ్ చేసుకొన్నారు అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.

మెహరీన్ మరింత అందంగా కనిపిస్తుంది..
మెహరీన్ ను ఇప్పటివరకూ చాలా బొద్దుగా చూసుంటారు. ఈ సినిమాలో అమ్మాయి బాగా చిక్కింది. చక్కగా నటించింది కూడా. ఈ సినిమా ఆ అమ్మాయికి మంచి ప్లస్ అవుతుంది.

అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు..
కొన్ని సినిమాలు షూటింగ్ స్పాట్ లోనే తెలిసిపోతాయి రిజల్ట్ ఏమిటనేది. కానీ.. వీలైనంతలో రిజల్ట్ మరీ బ్యాడ్ గా ఉండకూడదు అని కష్టపడతాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకూ పర్లేదు కానీ.. ప్రమోషన్స్ టైమ్ లో సినిమా బాగా రాలేదు అని తెలిసి కూడా పైకి మాత్రం “సినిమా బాగా వచ్చింది, తప్పకుండా హిట్ అవుతుంది” అని చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. తప్పని పరిస్థితి, నిర్మాత ఆల్రెడీ కోట్లు ఖర్చు చేసి ఉంటాడు. ఏమీ చేయలేని పరిస్థితి అది.

రిజల్ట్ పక్కన పెట్టేస్తే.. ప్రతి సినిమా ఎంజాయ్ చేశాను.
నేను నటించిన 25 సినిమాల్లో ఏది బెస్ట్, ఏది వరస్ట్ అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. అందుకు కారణం నేను నటించే ప్రతి సినిమా మేకింగ్ ప్రొసెస్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి సినిమా ఒక పాఠమే. కొన్ని గుణపాఠాలుగా కూడా మిగిలిపోతాయనుకోండి (నవ్వుతూ..).

తదుపరి సినిమాలు..
“పంతం” రిలీజ్ అనంతరం ఇమ్మీడియట్ గా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి నిర్మాణంలో కుమార్ అనే కొత్తబ్బాయి దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుంది. ఆ సినిమా అనంతరం మళ్ళీ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయాలానుకొంటున్నాను. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus