ఎవరైనా ట్రోల్ చేస్తే.. హీరోయిన్లం కదా అలానే అంటారులే అనుకునే రోజులు ఇప్పుడు సినిమా పరిశ్రమలో లేవు. అలాగే ఎవరైనా మీడియా పర్సన్ వ్యక్తిగత ప్రశ్నలు వేస్తే లైట్ తీసుకునే నటులు ఇప్పుడు సినిమా పరిశ్రమలో లేరు. మొన్నీమధ్య మంచు లక్ష్మి ఇలానే ఓ మీడియా పర్సన్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. అలా తమిళనాడు గౌరీ కిషన్ కూడా ఓ రిపోర్టర్‌ను కడిగిపారేసింది. ఎంతలా అంటే ఆయన చెప్పిన సారీని తీసుకోకుండా.. ఇంకాస్త బాగా చెప్పాల్సింది అంటూ సారీకి రివ్యూ ఇచ్చింది.
‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాతో తెలుగుకు పరిచయమైన తమిళ కథానాయిక గౌరి కిషన్.. అప్పటికే మనకు ‘96’ సినిమాతో తెలుసు. ఆమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చిన ఆమెను.. ఆర్.ఎస్.కార్తీక్ అనే సీనియర్ తమిళ సినీ జర్నలిస్టు ‘మీ బరువు ఎంత.. ఈ మధ్య వెయిట్ పెరిగినట్లున్నారే’ అని అడిగారు. దానికి ఆమె నేనెందుకు నా వెయిట్ చెప్పాలి అంటూ ఫైర్ అయింది.
ఆ తర్వాత ఇది అసలు జర్నలిజమేనా కాదంటూ ఆ జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగింది. దానికి ఆ జర్నలిస్టు కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నారు. అయితే ఎప్పుడూ సినిమా వాళ్లకు వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియా ఆ విషయంలో పూర్తిగా గౌరీ కిషన్‌వైపే నిలిచింది. ఇవేం ప్రశ్నలు అంటూ ఆ జర్నలిస్టు తీరును దుయ్యబట్టింది. అలాంటి ప్రశ్నలు అడగడమే తప్పంటే.. మళ్లీ వాదించడమొకటా అని నిలదీసింది. అలా వ్యతిరేకత రావడంతో గౌరి కిషన్‌కు ఆ జర్నలిస్టు సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు.
అయితే ఆ క్షమాపణను గౌరీ కిషన్ స్వీకరించలేదు. బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆ వీడియోలో జర్నలిస్టు వివరణ ఇవ్వడం గౌరీకి నచ్చలేదు. ఇదసలు క్షమాపణ లాగే లేదని, దీన్ని అంగీకరించనని తేల్చి చెప్పింది. ఆయన బాడీ షేమింగ్ చేయలేదు అనడం, సరదాగా అడిగిన ప్రశ్న అనడం సరికాదు అని గౌరీ అభిప్రాయం. అందుకేనేమో ఇంకా బెటర్‌గా ట్రై చేయండి అని సజెషన్ కూడా ఇచ్చింది.