ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ దర్శకుడిగా ప్రమోషన్ తీసుకొన్న తర్వాత చాలా కాలం గ్యాప్ అనంతరం కథానాయకుడిగా నటించిన చిత్రం “గులేబకావళి”. తమిళంలో తెరకెక్కిన ఈ డార్క్ కామెడీ అక్కడ ఎబౌ యావరేజ్ గా ఆడింది. నిధి అన్వేషణలో ఒక బృందం ఎదుర్కొనే సమస్యల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రభుదేవతోపాటు కథానాయికగా నటించిన హన్సికకు తెలుగులో మంచి మార్కెట్ ఉండడం ఇందుకు ముఖ్యకారణం. మరి తమిళ ప్రేక్షకులే యావరేజ్ అనేసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతుందో చూద్దాం..!!
కథ : బద్రి (ప్రభుదేవ, విజ్జు (హన్సిక), మాషా (రేవతి) అనే ముగ్గురు దొంగలు కలిసి గులేబకావళి అనే ప్రాంతంలోని ఒక గుడిలోని విగ్రహాన్ని దొంగతనం చేస్తారు. అయితే.. ఆ విగ్రహం కంటే ఎక్కువ విలువైన వజ్రాలు అదే ఊర్లో దాచిపెట్టబడ్డాయని తెలుసుకొంటారు. అప్పటికే సదరు విలువైన వజ్రాల కోసం ఓ మాఫియా గ్యాంగ్ కూడా వెతుకుతుంటుంది. ఇరు వర్గాల మధ్య ఎత్తుకు పై ఎత్తులు చాలా జరుగుతాయి. తీరా నిధి (వజ్రాలు) ఉన్న బోషాణం పెట్టి దొరికిందని బద్రి అండ్ గ్యాంగ్ సంతోషించేలోపు ఆ పెట్టెలో ఉన్నవి వజ్రాలు కావని అస్తిపంజరం అని తెలుసుకొని నిరాశతో వెనుతిరుగుతారు. కట్ చేస్తే.. ఆ అస్తిపంజరమే అసలు నిధి అనే విషయం తర్వాత వెలుగులోకి వస్తుంది. అప్పుడు బద్రి అండ్ టీం ఎలా రియాక్ట్ అయ్యింది? అనేది “గులేబకావళి” కథాంశం.
నటీనటుల పనితీరు : దర్శకుడిగా మారిన తర్వాత ప్రభుదేవ పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మధ్యలో “అభినేత్రి, ఎబిసిడి” చిత్రాల్లో నటించినప్పటికీ అవి సపోర్టింగ్ రోల్సే. ఈ సినిమాలో ఆయన ఎప్పట్లానే తన డ్యాన్స్ తో ఆశ్చర్యపరిచి, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకొని, నటుడిగా పర్వాలేదనిపించుకొన్నాడు. ప్రభుదేవ స్క్రీన్ ప్రెజన్స్ ను దర్శకుడు సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. ప్రభుదేవ కామెడీ టైమింగ్ ను ఇంకాస్త బాగా యూటిలైజ్ చేసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది.
హన్సిక గ్లామర్ డోస్ కాస్త పెంచింది. నటిగానూ పర్వాలేదనిపించుకొంది. ప్రభుదేవాతో పోటీపడి చేసిన డ్యాన్సులు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ముఖ్యంగా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే గ్రాఫిక్స్ డ్యూయెట్ వినడానికి పెద్దగా బాగోకపోయినా చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉంది. సీనియర్ నటి రేవతి ఈ చిత్రంలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ తో ప్రభుదేవ, హన్సిక పాత్రలను డామినేట్ చేసింది. ఆమె నటన సినిమా ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి. మధుసూదన్, రాజేందర్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : వివేక్-మెర్విన్ ద్వయం సమకూర్చిన సంగీతం ఓ మోస్తరుగా ఉండగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. సన్నివేశం కాస్త డల్ అవుతుంది అనిపించినప్పుడల్లా బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ కి ఎనర్జీ ఇచ్చారు. ఎక్కువగా పాప్ బీట్స్ యూజ్ చేయడం మైనస్ అని చెప్పొచ్చు. ఆర్.ఎస్.ఆనందకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే.. లైటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా ఫ్రేమ్స్ లో ఆర్టిస్టుల ముఖాలు అవుటాఫ్ ఫోకస్ అయ్యాయి. ఫ్రేమింగ్స్ లో ఎక్కడా నవ్యత కనిపించలేదు.
సినిమా లెంగ్త్ బాగా ఎక్కువైంది. సబ్ ఫ్లాట్స్ ఎక్కువ అవ్వడంతో.. మెయిన్ థీమ్ మీద కాన్సన్ ట్రేషన్ తగ్గి కథ ఎక్కువగా అనవసరమైన మలుపులు తిరిగింది. అందువల్ల ప్రేక్షకుడు అసలు కథను మరచిపోయి సబ్ ప్లాట్ మీద కాన్సన్ ట్రేట్ చేసేలోపు మళ్ళీ మెయిన్ స్టోరీలోకి ప్రేక్షకుడ్ని తీసుకెళ్లడానికి దర్శకుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దర్శకుడు కళ్యాణ్ ఇంతకుమునుపు చిన్న పిల్లల సినిమా అయిన “కథ సోల్ల పోరెన్” అనే చిత్రాన్ని తెరకెక్కించిన అనుభవం మాత్రమే ఉండడం వలన “గులేబకావళి”ని కూడా ఒక చిన్న పిల్లల సినిమాలా ట్రీట్ చేశారు. అందువల్ల సినిమాలో చాలా లైట్ హ్యూమర్ ఉంటుంది. అయితే.. అది అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే స్థాయి కామెడీ కాదు. అందుకే తమిళ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేలేకపోయారేమో. ఇక తెలుగులో డబ్బింగ్ వాయిస్ లు, లక్ష్మీ గణపతి ఫిలిమ్ వారి చిత్రాలను తలపించే స్థాయి కుళ్ళు జోకులు నిండిపోవడంతో సగానికిపైగా జనాలు “గులేబకావళి”ని ఎంజాయ్ చేయలేరు.
విశ్లేషణ : డబ్బింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, అసలు కథలో పిట్ట కథలు ఎక్కువైపోవడం వల్ల “గులేబకావళి” ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. అయితే.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మాత్రం ఓ మోస్తరుగా ఎంజాయ్ చేయగల చిత్రమిది.
రేటింగ్ : 1.5/5