టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. తన తండ్రి తెరకెక్కించే సినిమాలను నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమాతో పాటు ‘శాకుంతలం’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారామె. ఇప్పుడు వివాహ బంధంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. రవి అనే వ్యక్తితో ఆమె నిశ్చితార్ధం జరిగింది. అతడు ఎవరనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఎంగేజ్మెంట్ ఫొటోను మాత్రమే ట్విట్టర్ లో షేర్ చేసింది నీలిమ గుణ.
ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే గుణశేఖర్ కూడా ఓ పోస్ట్ పెట్టారు. ఈరోజు తమకు ప్రత్యేకమైన రోజు అని.. తన కూతురికి శుభాకాంక్షలు చెప్పారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నీలిమ గుణ మొదట్లో పెద్దగా ఇండస్ట్రీలో కనిపించేవారు కాదు. గుణశేఖర్ స్వయంగా తన బ్యానర్ కి సంబంధించిన పనులు చూసుకునేవారు. ఆ తరువాత ఆ బాధ్యతను తన పెద్ద కూతురు నీలిమ గుణ చేతిలో పెట్టారు. అప్పటినుంచి నిర్మాత వ్యవహారాలు ఆమే హ్యాండిల్ చేస్తుంది. క్యాస్టింగ్, రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ డిజైనింగ్ ఇలా చాలా విషయాలు ఆమె దగ్గరుండి చూసుకుంటుంది.
‘శాకుంతలం’ సినిమాకి సంబంధించి ఆమె చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ముందుగా ఈ ఏడాదిలో ఎలాగైనా సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారామె. దానికి తగ్గట్లే నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు సినిమాను 3D ఫార్మాట్ లో చూపించాలని నిర్ణయించుకున్నారు. అందుకే రిలీజ్ ఆలస్యమవుతుందని చెప్పారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.