‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత, ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి (ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్) మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. ఈ గొడవ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరింది. నిర్మాత.. ప్రశాంత్ వర్మపై సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయగా, ప్రశాంత్ వర్మ కూడా తన వాదనను బలంగా వినిపించారు.
నిరంజన్ రెడ్డి ఆరోపణల ప్రకారం.. ‘హనుమాన్’ తర్వాత ‘అధీర’, ‘మహాకాళి’, ‘జై హనుమాన్’, ‘బ్రహ్మరాక్షస’ సహా మొత్తం ఐదు సినిమాలు తమకే చేస్తానని ప్రశాంత్ వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఆ సినిమాలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, వేరే నిర్మాత వద్ద ఉన్న ‘ఆక్టోపస్’ చిత్రాన్ని 10.23 కోట్లు ఖర్చు పెట్టి కొనిపించి, దానికి NOC ఇప్పించడం లేదని ఆరోపించారు.
ఈ ఐదు సినిమాల ‘లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ’ కింద ప్రశాంత్ వర్మ నుంచి ఏకంగా రూ.200 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘అధీర’ సినిమాను డైరెక్ట్ చేయడానికి కూడా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై ప్రశాంత్ వర్మ తన వాదనను ఛాంబర్‌కు వినిపించారు. తాను ఆ ఐదు సినిమాలు డైరెక్ట్ చేస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై ఎలాంటి అగ్రిమెంట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘అధీర’కు తీసుకున్న కోటి రూపాయలు సినిమా డైరెక్ట్ చేయడానికి కాదని, కేవలం ‘టీజర్ డైరెక్ట్’ చేయడానికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. ‘ఆక్టోపస్’ విషయంలో ఏవైనా సమస్యలుంటే ఒరిజినల్ నిర్మాతతో తేల్చుకోవాలని సూచించారు.
ఇక డబ్బుల విషయంలో, తనకు రూ.15.82 కోట్లు మాత్రమే అందాయని, అది అడ్వాన్స్ కాదని, ‘హనుమాన్’ లాభాల్లో తనకు రావాల్సిన వాటా (షేర్) అని ప్రశాంత్ వర్మ తెలిపారు. ‘హనుమాన్’ నుంచి తనకు ఇంకా చాలా డబ్బులు రావాల్సి ఉందని, అవి ఎగ్గొట్టడానికే నిర్మాత తనపై ఈ కథ అల్లుతున్నారని వర్మ ఛాంబర్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.