హ్యాపీ వెడ్డింగ్

డజను మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అయిన నిహారిక కొణిదెల నటించిన తాజా చిత్రం “హ్యాపీ వెడ్డింగ్”. సుమంత్ అశ్విన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్ కార్య దర్శకుడిగా పరిచయమయ్యాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!

కథ : అక్షర (నిహారిక కొణిదెల) హైద్రాబాద్ లో తల్లిదండ్రుల గారాబం, స్నేహితుల చెలిమి నడుమ పెరిగిన అల్లరి పిల్ల. అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏది తనకు కరెక్ట్ అనే విషయంలో మాత్రం అనవసరంగా తెగ కన్స్ఫ్యూజ్ అయిపోతుంటుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లోనే.. తనను రోడ్డుపై వదిలేసిన విజయ్ (రాజా) మీద కోపంతో తనకు అండగా నిలిచిన ఆనంద్ విరాట్ (సుమంత్ అశ్విన్)ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్తుంది. ముహూర్తాలు ఫిక్స్ అయిపోయి.. ఆఖరికి తాళిబొట్టు కూడా కొనేశాక.. ఆనంద్ ఇదివరకట్లా తనతో టైమ్ స్పెండ్ చేయడం లేదనే భావన అక్షరలో ఎక్కువైపోతుంది. ఈ కన్ఫ్యూజన్ లో తన మాజీ ప్రియుడు విజయ్ కి మళ్ళీ దగ్గరవుతుంది.

సో, ఫైనల్ గా ఆనంద్, విజయ్ లలో అక్షర ఎవర్ని చూజ్ చేసుకొంది? ఈ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ వచ్చిందా లేదా? వంటివి “హ్యాపీ వెడ్డింగ్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన సమాధానాలు.

నటీనటుల పనితీరు : సుమంత్ అశ్విన్ హావభావాల ప్రకటన వరకూ పర్వాలేదు కానీ.. డైలాగ్ డెలివరీ & మాడ్యూలేషన్ విషయంలో ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గా బిహేవ్ చేస్తుండడం అతడికి పెద్ద మైనస్. సినిమా మొత్తంలో కళ్ళతో చాలా భావాలు పలికించిన సుమంత్.. మాటల రూపంలో మాత్రం ఆ వైవిధ్యాన్ని తెరపై పండించలేకపోయాడు. నిహారిక మంచి పరిణితి ప్రదర్శించింది. అయితే.. మేకప్ విషయంలో అమ్మాయి ఇంలాస్త జాగ్రత్త వహించాల్సింది. చాలా చోట్ల ఫేస్ డల్ గా చూపించడం కోసం అమ్మాయికి వేసిన మేకప్ బాగోలేదు. చలాకీగా, తుంటరి అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకొంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదనిపించుకొంది.

నరేష్, మురళీ శర్మలు తండ్రుల పాత్రల్లో ఇమిడిపోగా.. తులసి, పవిత్ర లోకేష్ లు అమ్మ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజా ఒక డెడికేటెడ్ లవర్ గా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకొన్నాడు. సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ తన పెద్ద తరహా మాటలతో కాస్త నవ్వించింది.

సాంకేతికవర్గం పనితీరు : “ఫిదా” ఫేమ్ శక్తికాంత్ బాణీలు కానీ నేపధ్య సంగీతం పెద్దగా ఆకట్టుకొనే విధంగా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ ఒక్క సన్నివేశంలోనూ సినిమాలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయలేకపోయింది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా ఉంది. క్వాలిటీ పరంగా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు కానీ.. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో బాల్ రెడ్డి క్వాలిటీ జనాల బుర్రకి పెద్దగా పట్టదు.

దేవా కట్ట శిష్యుడు, సుమంత్ అశ్విన్ తో ఆల్రెడీ “ఎందుకిలా?” అనే వెబ్ సిరీస్ తీసిన అనుభవం ఉన్న లక్ష్మణ్ కార్య “హ్యాపీ వెడ్డింగ్” చిత్రాన్ని కూడా ఏదో వెబ్ సిరీస్ లా తెరకెక్కించడం గమనార్హం. సినిమా మొత్తం చాలా బ్రైట్ గా, క్వాలిటీగా కనిపిస్తుంది కానీ.. సినిమాలో ఒక ఎమోషన్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండదు. సో, రచయితగా-దర్శకుడిగా లక్ష్మణ్ కార్య ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ : మెగా ఫ్యామిలీ మీద విశేషమైన అభిమానం, నిహారిక మీద కాస్తంత కరుణ, సినిమా మీద విపరీతమైన ప్రేమ, చేతిలో ఒక పాప్ కార్న్, పక్కనే ఒక కాఫీ లేదా అర లీటర్ కూల్ డ్రింక్, ఫోన్ లో ఫుల్ చార్జ్ తోపాటు ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే తప్ప “హ్యాపీ వెడ్డింగ్” చూస్తున్నంతసేపు థియేటర్ లో కుదురుగా కూర్చోవడం కష్టమే.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus