ఈ మధ్యకాలంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు రీమేక్ కథలపై దృష్టి పెడుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలు సైతం తమిళ, మలయాళ సినిమాల రీమేక్స్ లో నటిస్తున్నారు. అయితే ఓటీటీల హవా పెరగడంతో అన్ని సినిమాలు అవైలబుల్ గా ఉంటున్నాయి. ఇతర భాష సినిమాలను సబ్ టైటిల్స్ సహాయంతో చూసేస్తున్నారు ఆడియన్స్. ఇలాంటి సమయంలో ఎప్పుడో ఐదారేళ్ల క్రితం వచ్చిన ఓ బాలీవుడ్ కథను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు.
2018లో అజయ్ దేవగన్ హీరోగా ‘రైడ్’ అనే సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఈ సినిమా పెద్ద హిట్టు. ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఒక ఊరిలో కోట్ల రూపాయల అక్రమాస్తులు, బ్లాక్ మనీ, ఇల్లీగల్ గా సంపాదించుకొని దాచుకున్న పెద్దమనిషి ఇంటి మీదకు రైడింగ్ కు వెళ్లే ఓ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ కథ ఇది. సూర్య ‘గ్యాంగ్’ సినిమాతో పోలికలు ఉంటాయి. అలా చూసుకుంటే సూర్య సినిమా అక్షయ్ కుమార్ ‘స్పెషల్ 26’ రీమేకే.
కాకపోతే నేపధ్యాలు దగ్గరగా అనిపించినా ట్రీట్మెంట్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ‘రైడ్’ని తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఆలోగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తాడని టాక్. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదట. మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరో నటించే అవకాశం ఉంది. లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశల్లోనే ఉంది.