గాసిప్స్ అనేవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. కానీ ఈమధ్య ఓ వెబ్ సైట్ లో నా బిహేవియర్ గురించి, నా సినిమా గురించి కాకుండా నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో నా పేరు ప్రస్తావించకపోయినా నా గురించే అని స్పష్టంగా తెలుస్తోంది. అలాంటి వార్తలు చదువుతుంటే అసహ్యం వేస్తోంది. అందరం సినిమా మీద బ్రతుకుతున్న వాళ్లమే.. ఇలా సినిమా గురించి, అందులో నటించేవారి గురించి ఇంత నీచంగా ఎలా రాస్తున్నారా అని బాధపడుతున్నాను అంటూ తన “మిడిల్ క్లాస్ అబ్బాయి” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాని సదరు రూమర్స్ పై స్పందించాడు. అలాగే.. సినిమాకి సంబంధించిన విశేషాలు, స్క్రిప్ట్స్ ఎన్నుకొనేప్పుడు ఆయన తీసుకొంటున్న జాగ్రత్తలు, సాయిపల్లవితో కలిసి నటించడం, భూమికతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి చాలా విశేషాలు చెప్పాడు. ఆ విశేషాలు మీకోసం..!!
నేను క్రిటిక్ ని కాదు..
“మిడిల్ క్లాస్ అబ్బాయి” ట్రైలర్ చూసి చాలా మంది “నేను లోకల్” సినిమాతో పోలుస్తున్నారు. క్యారెక్టరైజేషన్ సేమ్ టు సేమ్ ఉంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే.. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది మాత్రమే నేను పరిగణలోకి తీసుకొంటాను. కేవలం క్రిటిక్స్ మాత్రమే నా పాత్ర స్వభావం సేమ్ ఉందంటున్నారు తప్పితే ప్రేక్షకులైతే ఎంజాయ్ చేస్తున్నారు.
ఎలాంటి మార్పు లేదు..
“ఆష్టా చెమ్మా” మొదలుకొని “మిడిల్ క్లాస్ అబ్బాయి” వరకూ నా పరిధి మరియు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను బెస్ట్ స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకొన్నాను. కొన్ని వర్కవుట్ అవ్వలేదు, కొన్ని అయ్యాయి. అంతే తప్ప అప్పట్లో చెత్త సినిమాలు, ఇప్పుడు మంచి సినిమాలు ఎంపిక చేసుకోవడం అనేది లేదు, అలాంటి సిట్యుయేషన్ కూడా ఎప్పుడు రాలేదు.
బ్యాగ్రౌండ్ లేకపోవడమే నాకున్న పెద్ద ప్లస్ పాయింట్..
ఇండస్ట్రీలో నాకు బ్యాగ్రౌండ్ లేదు, గాడ్ ఫాదర్ లేరు అని ఎప్పుడూ బాధపడలేదు. ప్రేక్షకులే నా బ్యాగ్రౌండ్, వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. నా సినిమాల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంతకుమించి నాకు కావాల్సింది ఏముంది చెప్పండి. ఇక నా దృష్టిలో బ్యాగ్రౌండ్ ఉండడం కూడా మైనస్ అనే అనుకొంటాను. ఎందుకంటే.. బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల ఇలాంటి సినిమాలే చేయాలీ అనే రెస్ట్రిక్షన్ ఉంటుంది. నాకు అలాంటివేవీ లేకపోవడం వల్ల నాకు నచ్చిన కథను చేసుకోవచ్చు.
మొదట షాకయ్యాను.. తర్వాత బాధపడ్డాను
సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరోహీరోయిన్లపై గాసిప్స్ రావడం అనేది చాలా సహజం. మొదట్లో అలాంటి కామెంట్స్ చూసి నేను-సాయిపల్లవి నవ్వుకొన్నాం. కానీ.. రీసెంట్ గా వచ్చిన ఒక రూమర్ మాత్రం నన్ను చాలా బాధించింది. మరీ ఇంత దిగజారిపోవాలా అని అసహ్యపడే స్థాయిలో ఉందా వార్త.
కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేశాం..
“మిడిల్ క్లాస్ అబ్బాయి” ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని ట్రైలర్ లోనే చెప్పేశాం. సినిమాలో అంతకుమించి ఏం ఉండదు. సో, ఆడియన్స్ కి కూడా సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో క్లారిటీ ఉంటుంది కాబట్టి.. ఏదో ఎక్స్ పెక్ట్ చేసి వచ్చి.. “వార్నీ ఇంతేనా” అనుకోకుండా.. సినిమా ఎంజాయ్ చేస్తారు.
ప్రతి జోనర్ కి పర్టిక్యులర్ ఆడియన్స్ ఉంటారు..
నాకు హారర్ సినిమాలంటే ఇష్టం.. కానీ ఆ జోనర్ సినిమా చేయను. అలాగే ప్రతి జోనర్ కి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఎందుకని డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయరు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే.. ఆడియన్స్ ఆదరిస్తున్న సినిమాలే నేను చేస్తున్నాను.
మా “మిడిల్ క్లాస్ అబ్బాయి:కి అవే ప్లస్ పాయింట్స్
మా సినిమా చాలా రొటీన్ గా ఉంటుందండి. ఒక అన్నయ్య, వదిన, మరిదిల నడుమ జరిగే కథ. హీరోయిన్, ఫ్రెండ్స్ ఉంటారు. ఇలా అన్నీ రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లోనే ఉంటాయి. అయితే.. ప్రతి పాత్ర చాలా సహజంగా తెరకెక్కించబడింది, అందువల్ల ఎమోషన్ కి ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అవుతాడు. ఆడియన్స్ కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అయినట్లే.
ఆ సంఘటన భూమిక గారితో చెప్పాను..
మా సినిమాలో భూమిక గారు నాకు వదినగా నటిస్తున్నారని తెలిసినప్పుడు బాగా ఎగ్జయిట్ అయినవాళ్లలో మొదటివాడ్ని నేనే. ఎందుకంటే.. “ఖుషి” సినిమా టికెట్స్ కోసం లైన్ లో నిల్చోకుండా.. నేనే సపరేట్ లైన్ క్రియేట్ చేసినందుకు పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నాను. ఆ సంఘటన భూమికగారితో చెప్పి మరీ నవ్వుకొన్నాను. ఆవిడ కూడా నాకు నిజంగా వదినలా అనిపించేది, వాళ్ళబ్బాయి చదివిన మంచి బుక్స్ మా అబ్బాయికి పనికొస్తాయని ఇచ్చేది. వాళ్ళబ్బాయి కోసం షాపింగ్ చేసేప్పుడు మా అబ్బాయికి కూడా షాపింగ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.
ఎవరూ ఎవర్నీ డామినేట్ చేయలేదు..
“ఫిదా” సినిమాలో సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ మరియు “మిడిల్ క్లాస్ అబ్బాయి” టీజర్ చూసి చాలామంది “ఏంటీ సాయిపల్లవి నిన్ను బాగా డామినేట్ చేసేసింది” అంటున్నారు. ఆమె క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది తప్పితే ఎవరూ ఎవర్నీ డామినేట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే.. సాయిపల్లవి సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.
రోజూ సాయంత్రం కూర్చొని ఎదురుచూస్తున్నాను..
ప్రతిరోజూ సాయంత్రం నా ఆఫీస్ లో బోలెడు కథలు వింటున్నాను. అన్నీ రొటీన్ కథలే చెబుతున్నారు కానీ.. ఒక్క వైవిధ్యమైన కథ కూడా నా దగ్గరకి రాలేదు. నేను కూడా ఎదురుచూస్తూ ఉన్నాను మంచి కథ కోసం. వస్తే ఒక విభిన్నమైన సినిమా చేయాలన్న ఆలోచన నాకు కూడా ఉంది.
ఆయనలో పది శాతం కూడా చేయలేం..
ఒక నటుడిగా నేను అనునిత్యం ఇన్స్ ఫైర్ అయ్యే వ్యక్తి కమల్ హాసన్ గారు. ఆయన తరహాలో విభిన్నమైన కథలు చేయాలన్న ఆలోచన మాకూ ఉంటుంది. కానీ.. ఆయనకి దొరికినన్ని కథలు మాకెక్కడ దొరుకుతున్నాయ్. అందుకే ఎప్పటికైనా ఆయన పోషించిన పాత్రల్లో కనీసం 10% అయినా మేము నటించగలిగితే మా జన్మలు ధన్యం.
ఆయన సినిమా చేయకుండా ఏదో ఆపుతోంది..
“ఒకే బంగారం” టైమ్ లోనే మణిరత్నం గారితో ఒక సినిమా అనుకొన్నామ్. అది వర్కవుట్ అవ్వలేదు, తర్వాత మళ్ళీ రీసెంట్ గా కూడా ఓ మల్టీస్టారర్ సినిమా అనుకొన్నామ్. అయితే.. ఆయన సినిమాకి భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో నాకున్న టైట్ షెడ్యూల్ లో ఆ సినిమా చేయడం కుదరలేదు. ఏదో శక్తి ఆయనతో సినిమా చేయకుండా ఆపుతోంది. ఏదైనా మంచి సినిమా కోసమేమో.. చూద్దాం భవిష్యత్ లో ఇంకా మంచి సినిమా చేస్తామేమో.
లిస్ట్ చాలా పెద్దది..
ప్రస్తుతం “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తున్నాను. నాగార్జున గారితో కలిసి చేయబోయే సినిమా ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. హను రాఘవపూడి సినిమాకి టైమ్ పడుతుంది, ఇక అవసరాల శ్రీనివాస్ తో ఒక సినిమా అనుకొన్నానే కానీ ఎలాంటి సినిమా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో చాలా సినిమాలున్నాయి లైన్ లో.
– Dheeraj Babu