Siddharth: ఇంటర్వ్యూ : ‘టక్కర్’ గురించి సిద్దార్థ్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • June 8, 2023 / 02:46 PM IST

తెలుగు ప్రేక్షకులకు సిద్దార్థ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘బాయ్స్’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘బొమ్మరిల్లు’ ‘లవ్ ఫెయిల్యూర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాడు. త్వరలో ‘టక్కర్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీ కోసం :

ప్రశ్న) ‘బొమ్మరిల్లు’ లో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే కనిపిస్తున్నారు? దీనికి సీక్రెట్ ఏంటో తెలుసుకోవచ్చా?

సిద్దార్థ్ : అలాగే ఉండాలండి. లేకపోతే మమ్మల్ని షెడ్డుకి పంపించేస్తారు కదా(నవ్వుతూ). ఇక ఇలా ఉండటానికి సీక్రెట్ అంటూ ఏమీ లేదు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోను అంతే..!

ప్రశ్న) ‘టక్కర్’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

సిద్ధార్థ్ : ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఉంటుంది. ఈ చిత్రంలో హీరో-హీరోయిన్ మధ్య ఘర్షణ, హీరో-విలన్‌ మధ్య ఘర్షణ, అహం, లింగం, వయస్సు, డబ్బు ఇలా చాలా ఉంటాయి. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్లో చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు సంపాదించాలనే కోరికతో.. హీరోని కిడ్నాపర్‌గా మారతాడు. కొడుకు, తల్లి మధ్య సాగే కీలకమైన డైలాగ్ సినిమా సినిమా మెయిన్ ప్లాట్ ఏంటి అన్నది తెలియజేస్తుంది.

ప్ర) అంటే మీది నెగిటివ్ రోల్ అనుకోవాలా?

సిద్దార్థ్ : అలా అని కాదు. హీరోని ఆ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితులు ఏంటి? హీరో సిటీకి రాగానే దిగజారిపోతున్నట్టు ఫీలవుతాడు. పాత్ర తీరు, పరిస్థితుల కారణంగా అతను రౌడీలతో ఫైట్ చేయాల్సి వస్తుంది.

ప్ర) నిజ జీవితంలో మీరు డబ్బుకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు?

సిద్దార్థ్ : ప్రెజంట్ జనరేషన్లో డబ్బు సంపాదించాలి అనే తాపత్రయం అందరిలోనూ పెరిగిపోయింది. ఎందుకు సంపాదించాలి అంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. పక్కోళ్లు సంపాదిస్తున్నారు కాబట్టి సంపాదించాలి అంతే..! సెలబ్రిటీల బాగా సంపాదిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ నేను పెరిగిన విధానం వేరు. నేను డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటాను. నేను చేసే సినిమాలు నాకు నచ్చినవి చేస్తున్నానా లేదా? సంగీతంలో, ఇంకా ఇతర విషయాల్లో నేను ఆనందాన్ని వెతుక్కుంటాను.

నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో కేవలం రూ. 2000 మాత్రమే వచ్చేవి. పెట్రోల్ బిల్లులు రూ.160 కంటే తక్కువగా ఉండేవి. ఒక్కసారి డబ్బు వస్తే, దానితో పాటు కొన్ని అలవాట్లు కూడా వస్తాయని అందరూ తరచుగా అంటుంటారు. కానీ నేను అలా కాదు. నాకు రూ.160 విలువ ఇప్పటికీ బాగా తెలుసు. మా అమ్మ అంటూ ఉంటుంది. 10 ఏళ్ళ క్రితం కొన్న షర్ట్ లు ఇప్పటికీ వాడుతున్నావ్ అని..! అది నిజం..!

ప్ర) 8 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘మహాసముద్రం’ అనే తెలుగు సినిమా చేశారు? అది ప్లాప్ అయ్యింది? కారణాలు ఏమనుకుంటున్నారు?

సిద్దార్థ్ : ఆ సినిమాకి నేను చాలా కష్టపడ్డాను. అలాగే దానికి వంద మంది పనిచేస్తే.. ఆ వంద మంది కూడా సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మి చేశారు. కానీ స్నేహితుడి ప్రేయసిని పెళ్లి చేసుకోవడం.. అనేది జనాలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నిర్మాత అనిల్ సుంకర గారు ఆ కథను నమ్మి ఆ సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చారు. డైరెక్టర్ అజయ్ భూపతి చాలా మంచి టెక్నీషియన్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది అని నేను అతనితో భవిష్యత్తులో సినిమా చేయను అనుకోకండి. అతనితో పనిచేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను.

ప్ర) తెలుగులో మళ్ళీ బిజీ అవ్వాలనే ఆలోచన ఉందా?

సిద్దార్థ్ : నాకు తెలుగు సినిమా చాలా స్పెషల్. ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు సినిమా ఆంటే ఓ బ్రాండ్ క్రియేట్ చేశారు. గతంలో దర్శకులు వంద సినిమాలు తెరకెక్కించేవారు. ఇప్పుడు ఒక్క సినిమాకి నాలుగేళ్లు టైం పడుతుంది.నేను తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉన్నాయి. ‘భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాని నేనెప్పుడూ రిజెక్ట్ చేయను’ అని సమాధానం ఇస్తుంటాను. తెలుగు సినిమా అభిమానులు నన్ను పక్కింటి అబ్బాయిగా భావించి, నన్ను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. మంచి కంటెంట్ దొరికితే మీకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాను.

ప్ర) ప్రేమ కథలకి కంప్లీట్ గా గుడ్ బై చెప్పేశారా?

సిద్దార్థ్ : ప్రేమకథలు అనేవి ఎమోషన్స్ తో కూడిన అలసిపోయే ప్రయాణం. ఒక్కసారి లవ్ స్టోరీలు చేసి సక్సెస్ అయితే ఇక వాటికే ఫిక్స్ అయ్యామని అంతా అనుకుంటారు. ఒకే రోజా పువ్వు పట్టుకుని అవే సీన్లు ప్రతి సినిమాలో చేస్తుంటే విసుగొచ్చేస్తుంది. అందుకే లవ్ స్టోరీ ఆంటే వద్దు బాస్ అని కొంతమంది దర్శకులతో చెప్పాను. తర్వాత వాళ్ళు నా దగ్గరకు రాలేదు. అంటే వేరే కథలకి నేను సరిపోను అనే ఉద్దేశమే కదా వారిది.

ప్ర) గతంలో రైటర్ గా పనిచేశారు. ఇప్పుడు చేయాలనిపించడం లేదా?

సిద్దార్థ్ : ‘చుక్కల్లో చంద్రుడు’ కి ట్రై చేశాను. అది ప్లాప్ అయ్యింది. అప్పటి నుండి నేను దానికి దూరంగా ఉంటున్నాను. ‘గృహం’ సీక్వెల్‌ కి రాసాను. దాని సంగతి చూడాలి. మా సొంత ప్రొడక్షన్ లో మేము కొత్త రచయితలను ప్రోత్సహించాలి అనుకుంటున్నాము. రేటింగ్ అనే కాదు అన్ని రకాలుగా నేను కొత్త సవాళ్ళను సవీకరించడానికి రెడీగా ఉన్నాను.

ప్ర) ‘బొమ్మరిల్లు 2 ‘ పై భాస్కర్ ఓ మాట అనేసారు? మీరేమంటారు?

సిద్దార్థ్ : ‘బొమ్మరిల్లు’ చిత్రం నాకు (Siddharth) మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ బాగా స్పెషల్. ‘బొమ్మరిల్లు’ లో బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. అవి ప్రేక్షకుల హృదయాల్లో బలంగా నాటుకుపోయాయి. సిద్దు, హాసిని పాత్రలను తెలుగు ప్రేక్షకులు తమ ఫ్యామిలీ మెంబర్స్ లా ఓన్ చేసుకున్నారు. బొమ్మరిల్లు 2 అని చెప్పి మేము ఆ పాత్రలను ఏమాత్రం తేడాగా చూపించినా మమ్మల్ని బూతులు తిడతారు. కాబట్టి .. అది చాలా కష్టం, ఇప్పట్లో అయితే ఆ ఆలోచన లేదు.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి?

సిద్ధార్థ్ : ‘టక్కర్’ తర్వాత మా సొంత బ్యానర్లో ‘చిన్నా’ సినిమా ఉంటుంది. అలాగే ‘ఇండియన్-2’ లో కూడా నటిస్తున్నాను. మాధవన్, నయనతార తో ‘టెస్ట్’ అనే మూవీ చేస్తున్నాను. కార్తీక్ క్రిష్‌తో మరో మూవీ చేయాలి. దాని పనులు కూడా జరుగుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus