కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదే స్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సూర్య సినిమాలు తెలుగులో కూడా అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంటాయి. ఇలా నటుడిగా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన పుట్టినరోజు వేడుకలను కూడా తెలుగు అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా (Suriya) సూర్య జులై 23వ తేదీ తన 48వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించి సెలబ్రేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు అభిమానులు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ పలనాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నక్క వెంకటేష్, పోలూరు సాయి అనే అభిమానులు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు.
ఇక ఈ విషయం సూర్య అభిమానులను ఎంతగానో కలిచి వేసింది. ఇలా పుట్టినరోజున తన అభిమానులు మరణించారన్న వార్త సూర్య వరకు వెళ్లడంతో ఆయన చాలా విచారం వ్యక్తం చేశారు.ఈ విధంగా తన అభిమానులు మరణించారన్న వార్త తెలుసుకున్నటువంటి సూర్య వారి కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిని పరామర్శించారు.
చనిపోయిన వారిని నేను తీసుకురాలేను కానీ మీ కుటుంబ అవసరాలన్నింటికీ తాను అండగా ఉంటానని ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని భరోసా వారికి కల్పించారు. ఇక ఇందులో ఓ అభిమాని సోదరి డిగ్రీ చదివింది. ఇక కుటుంబ భారం మొత్తం ఆ అమ్మాయి పైనే ఉండడంతో సూర్య తనకు ఉద్యోగం ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తానని హామీ ఇచ్చారు.