తెలుగులో కల్ట్ హిట్ అని పేర్కొనే స్థాయిలో ఘన విజయం సొంతం చేసుకొన్న “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని తమిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ నిర్మించనున్న ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి “వర్మ” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి.. ఇంకో రెండ్రోజుల్లో హీరోయిన్ ఎవరనేది కూడా ఎనౌన్స్ చేస్తానని ప్రకటించిన చియాన్ విక్రమ్ సరిగ్గా ఎనౌన్స్ మెంట్ కు ముందురోజు “మా హీరోయిన్ మిస్సింగ్” అంటూ ఆన్లైన్ లో పోస్ట్ పెట్టాడు.
ఇదంతా సినిమా ప్రమోషన్ లో భాగమే అని తెలిసినప్పటికీ.. చియాన్ విక్రమ్ ఈ విధంగా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటుండడం చెన్నై వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. మరి “వర్మ”లో ధృవ్ సరసన ఎవరైనా కొత్త కథానాయికను ఎంపిక చేశారా లేక ఎవరైనా క్రేజ్ ఉన్న హీరోయిన్ ను సెలక్ట్ చేసి పబ్లిసిటీ కోసం ఇలా హడావుడి చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే.. ధృవ్ ఇప్పటికే తెలుగు “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని ఆల్రెడీ 15 సార్లు చూశాడట. సేమ్ టు సేమ్ విజయ్ దేవరకొండను రిపీట్ చేయకుండా తన మార్క్ ను వేయడం కోసం తపిస్తున్నాడు ధృవ్. మరి తన పరిచయ చిత్రంతో ధృవ్ ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.