హిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

“వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్” చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్ కథానాయకుడిగా.. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారధ్యంలో “అ!” అనంతరం వచ్చిన సినిమా “హిట్”. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా అదే స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!

కథ: హోమోసైడ్ ఇంటర్వెన్షన్ టీం (HIT)లో చీఫ్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్). 30 ఏళ్ల విక్రమ్ గతంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ కు లోనవుతుంటాడు.. అందువల్ల ప్యానిక్ ఎటాక్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి మెంటల్ స్ట్రెస్ తో పోలీస్ ఉద్యోగం చేయడం మంచిది కాదని సూచించినా వినడు. ప్రీతి అనేది అమ్మాయి హైవేలో మిస్ అయిన కేస్ HIT హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఆ మిస్సింగ్ కేస్ ను విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. అదే తరహాలో విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ & ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేహా (రుహానీ శర్మ) కూడా మిస్ అవుతుంది. దాంతో ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేసినప్పటికీ.. ఉపయోగం లేకపోతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పెద్దగా క్లూస్ దొరకవు.

ఒక పక్క కేస్ సాల్వ్ చేయాలంటూ డిపార్ట్ మెంట్ పెట్టే ప్రెజర్, మరోపక్క గర్ల్ ఫ్రెండ్ మిస్ అయ్యిందనే బాధ, ఇంకోపక్క తన మెంటల్ స్ట్రెస్ ను అధిగమించి విక్రమ్ దుండగులను ఎలా పట్టుకోగలిగాడు? అందుకోసం అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనేది “హిట్” కథాంశం.

నటీనటుల పనితీరు: “వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది” సినిమాల్లోనే నటుడిగా వేరియేషన్స్ చూపించిన విశ్వక్ సేన్.. “ఫలక్ నుమా దాస్”తో దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నాడు. “హిట్” సినిమాకి విశ్వక్ నటన హైలైట్ అనే చెప్పాలి. ఒక సగటు పోలీస్ ఆఫీసర్ ఎన్ని టెన్షన్ ఫేస్ చేస్తుంటాడు, ఒక పోలీస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది విశ్వక్ చాలా నేచురల్ గా చేసి చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో విశ్వక్ ఇంకాస్త డెవలప్ అవ్వాల్సి ఉంది.

రుహానీ శర్మ పాత్ర సినిమాకు గ్లామర్ ను మాత్రమే కాదు ఇంటెన్సిటీని కూడా యాడ్ చేసింది. “చిలసౌ” సినిమాతో పక్కింటి అమ్మాయిలా అలరించిన రుహానీ.. ఈ చిత్రంలో నేహా పాత్రలో ఆధునిక యువతిగా ఆకట్టుకుంది.

భానుచందర్, బ్రహ్మాజీ, హరితేజ, మురళీ శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: మరీ కథానాయకుడు విశ్వక్ చెప్పినట్లు టాయిలెట్ వెళ్లడానికి కూడా వీల్లేనంత టైట్ స్క్రీన్ ప్లే కనిపించకపోయినా.. రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ కు భిన్నంగా “హిట్” చిత్రాన్ని తెరకెక్కించాడు శైలేష్. సాధారణంగా ఎమోషన్స్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు ఈ తరహా థ్రిల్లర్స్ లో. కానీ.. శైలేష్ మాత్రం ప్రొసీజర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక ప్రోపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి విషయాలు దోహదపడతాయి? అనేది చాలా డీటెయిల్డ్ గా వివరించాడు. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎమోషనల్ గా సినిమాకి కనెక్ట్ అవ్వడమే కాక.. ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న అనుభూతిని కూడా పొందుతారు. సొ, ఒక దర్శకుడిగా కంటే శైలేష్ కథకుడిగా ఎక్కువగా ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో కథను పూర్తిస్థాయిలో ముగించకుండా.. సీక్వెల్ కి హింట్ ఇవ్వడం బాగానే ఉన్నా.. ఆడియన్స్ సాటిస్ఫేక్షన్ కోసం ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది.

ప్రోపర్ ప్రీప్రొడక్షన్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. సినిమాలో అసహజత్వం ఎక్కడా ఉండదు. సన్నివేశాలు, సందర్భాలు, ఆర్ట్ వర్క్ అన్నీ సహజంగానే ఉంటాయి.

వివేక్ సాగర్ పాటలకంటే నేపధ్య సంగీతానికి ఎక్కువ మార్కులు స్కోర్ చేశాడు. ఒక కథను నేపధ్య సంగీతంతోనూ చెప్పొచ్చు అని మరోసారి ప్రూవ్ చేశాడు. మణికందన్ కెమెరా వర్క్ సినిమాకి ఆ థ్రిల్లర్ ఫీల్ ను తీసుకువచ్చింది. నైట్ షాట్స్ బాగున్నాయి. అలాగే లైటింగ్ సీక్వెన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది.

విశ్లేషణ: రెగ్యులర్ థ్రిల్లర్స్ కు భిన్నంగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “హిట్”. విశ్వక్ సేన్ నటన, శైలేష్ కొలను స్క్రీన్ ప్లే & ఇన్వెస్టివేషన్ ప్రొసీజర్స్ ను అర్ధవంతమైన రీతిలో వివరించిన విధానం, వివేక్ సాగర్ నేపధ్య సంగీతం కోసం థియేటర్లో తప్పకుండా చూడాల్సిన చిత్రం. థ్రిల్లర్ సినిమాల అభిమానులనే కాక రెగ్యులర్ మూవీ గోయర్స్ ను కూడా ఆకట్టుకునే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయి. నిడివి 2 గంటలే కావడం సినిమాకి పెద్ద ఎస్సెట్.

రేటింగ్: 2.5/5

Click Here To Read English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus