Homebound: ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

ఆస్కార్ అనగానే మన వాళ్ల అంచనాలు ఎప్పుడూ భారీ బడ్జెట్ సినిమాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఈసారి ఆస్కార్ కమిటీ మన ఇండియన్ కమర్షియల్ సినిమాలకు గట్టి షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టే సినిమాలు కాదు, మనసును తాకే కథలే మాకు కావాలని తేల్చి చెప్పింది. అందుకే పుష్ప 2, కన్నప్ప, కుబేరా లాంటి భారీ చిత్రాలను పక్కన పెట్టి, ‘హోమ్‌బౌండ్’ అనే ఒక చిన్న సినిమాను షార్ట్ లిస్ట్ చేసింది.

Homebound

నిజానికి ఆస్కార్ రేసులో మన దగ్గర నుంచి చాలా పెద్ద సినిమాలు పోటీ పడ్డాయి. సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2 లాంటి సినిమాలపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అకాడమీ జ్యూరీ మాత్రం ఆ స్టార్ డమ్ ను, గ్రాఫిక్స్ ను అస్సలు పట్టించుకోలేదు. నీరజ్ ఘైవాన్ డైరెక్షన్ లో వచ్చిన హోమ్‌బౌండ్ సినిమాలోని నిజాయితీకి ఓటు వేసింది. ఇది మన కమర్షియల్ సినిమా మేకర్స్ కు ఒక రకమైన రియాలిటీ చెక్ అనే చెప్పుకోవాలి.

ఈ సినిమా కథ మనందరికీ తెలిసిన, మనం అనుభవించిన ఒక చేదు జ్ఞాపకం చుట్టూ తిరుగుతుంది. కరోనా లాక్ డౌన్ టైమ్ లో వలస కూలీలు పడ్డ నరకాన్ని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. చందన్, షోయిబ్ అనే ఇద్దరు మిత్రులు ఇంటికి వెళ్ళడానికి పడే ఆరాటం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే కులం, మతం అనే అడ్డుగోడలు చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. ఇలాంటి యూనివర్సల్ ఎమోషన్ ఉంది కాబట్టే జ్యూరీ దీనికి కనెక్ట్ అయ్యింది.

ఇందులో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో కనిపించే వీళ్లు, ఇందులో డీ గ్లామర్ రోల్స్ లో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. స్టార్ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి, పాత్రలో జీవించారు. ఆస్కార్ లాంటి వేదికలు ఆశించేది ఇలాంటి పర్ఫార్మెన్స్ నే తప్ప, స్లో మోషన్ ఎలివేషన్లను కాదని ఈ సెలెక్షన్ తో స్పష్టమైంది.

ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఎలాంటి హడావిడి, ప్రమోషన్లు లేకుండా సైలెంట్ గా వచ్చి ఇంత పెద్ద విజయం సాధించడం సామాన్య విషయం కాదు. కంటెంట్ ఉంటే కటౌట్లు అవసరం లేదని ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడు అందరి కళ్లు జనవరి 22న రాబోయే ఫైనల్ నామినేషన్స్ మీద ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus