కేసు పెట్టినంత మాత్రాన.. హృతిక్ వరకూ వెళ్తుందా?

  • July 4, 2019 / 05:03 PM IST

బాలీవుడ్ అందగాడు.. ఆరడుగుల ఆజాను బాహుడు అయిన హృతిక్ రోషన్ పై హైదరాబద్ కూకట్ పల్లిలో కేసు నమోదయ్యింది. మీరు చదివింది కరెక్టే.. హైదరాబాద్, కూకట్ పల్లి లోనే హృతిక్ పై కేసు నమోదయ్యింది. వినడానికే చాలా విడ్డూరంగా ఉంది కదూ.. ఇప్పుడు అసలు విషయం ఏంటో చూద్దాం రండి. హృతిక్ ‘కల్ట్ ఫిట్‌నెస్’ అనే ఫిట్ నెస్ సెంటర్‌ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూ వ్యాయామానికి స్లాట్ ఇవ్వడం లేదని శశి అనే వ్యక్తి తాజాగా కేసు పెట్టాడు.

వివరాల్లోకి వెళితే… ‘ఫిట్‌నెస్ ప్యాకేజ్ అంటూ రూ. 17,490 నుండీ 36,400 వరకూ వసూలు చేశారు. ప్రశ్నిస్తే వెబ్‌సైట్‌‌లో బ్లాక్ చేస్తున్నారు.’ అంటూ శశి ఆరోపిస్తున్నాడు. కూకట్‌పల్లి లోని శేషాద్రి నగర్‌కు చెందిన ఐనేని శశికాంత్ అనే వ్యక్తి కె.పి.హెచ్.బి. కాలనీలోని ‘కల్ట్.ఫిట్’ జిమ్ లో డిసెంబర్ 26న సభ్యత్వం తీసుకున్నాడు. ఆ సమయంలో… ‘బరువు తగ్గించటమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కావల్సిన శిక్షణ మా జిమ్‌లో లభిస్తుంది అంటూ’ నిర్వాహకులు గ్యారంటీ ఇచ్చారట. అయితే ఇప్పుడు ఆ జిమ్ సామర్థ్యాన్ని మించి మొత్తం 1800 మంది సభ్యులను జిమ్‌లో చేర్చుకున్నారని శశి చెబుతున్నాడు.

‘దీంతో సరైన శిక్షణ లభించకపోగా, వ్యాయమం చేసేందుకు కూడా వసతి లేదని’ శశికాంత్ జిమ్ డైరెక్టర్లకు చెప్పాడట. దీంతో వారు ఆ సమస్యని పరిష్కరించకపోగా శశికాంత్‌ను జిమ్‌కు రాకుండా.. అతనికి సంబందించిన కల్ట్.ఫిట్ యాప్‌ను బ్లాక్ చేసారట. ‘ఇలా మోసపూరిత హామీలతో అమాయకులను మోసం చేస్తున్నారని’ కల్ట్.ఫిట్ సంస్థ డైరెక్టర్లు ముఖేష్ బన్సాల్, అంకిత్ అగోరి, షణ్ముగవేల్ మణి సుబ్బయ్యలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌ అయిన హృతిక్ రోష‌న్‌ పై కూడా కేసు పెట్టాడట. ఈ విషయం హృతిక్ వరకూ వెళ్తుందో లేదో కానీ… ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండవుతుంది. శశికి మద్దతుగా చాలా మంది కామెంట్లు పెడుతూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus