అఖిల్ సినిమా 30 సార్లు చూశాను : అక్కినేని అఖిల్

తాతయ్య మహానటుడు, తండ్రి అగ్ర కథానాయకుడు, అమ్మ ఒకప్పటి అగ్ర కథానాయకి, ఇక అన్నయ్య యువ కథానాయకుల రేస్ లో ఎప్పట్నుంచో ఉన్నాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ తొలి చిత్రంతో చతికిలపడ్డాడు అఖిల్ అక్కినేని. తాను స్టార్ హీరోగా ఎదగడం కంటే ముందుగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం ముఖ్యం అనుకొన్నాడు. అందుకే మొదటి సినిమా విషయంలో జరిగిన తప్పులు సెకండ్ సినిమాలో రిపీటవ్వకూడదనే ధృడ నిశ్చయంతో కొన్నాళ్లపాటు గ్యాప్ తీసుకొని మరీ నటించిన చిత్రం “హలో”. “మనం, 24” చిత్రాల ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ మంచి విజయం సొంతం చేసుకొంది. ఈ సందర్భంగా మీడియాతో తన ఆనందాన్ని, తదుపరి చిత్రాల వివరాల్ని, తన మొదటి సినిమా ఫ్లాపైనప్పుడు తాను పడిన మనోవేదనను, తనకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రుల గురించి ముచ్చటించాడు అఖిల్ అక్కినేని. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..!!

అదే బెస్ట్ కాంప్లిమెంట్..
“హలో” సినిమా రిలీజ్ కి ముందు, తర్వాత చాలా కామెంట్స్, కాంప్లిమెంట్స్ వచ్చాయి కానీ.. ఒకమ్మాయి “యు స్టోల్ మై హార్ట్ ఇన్ ది క్లైమాక్స్ ఎపిసోడ్” అని మెసేజ్ పెట్టింది. నావరకూ అదే బెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అని అడగకండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు (నవ్వుతూ..).

మామూలు టెన్షన్ లేదు..
అసలే మొదటి సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది, రెండో సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన ఒకవైపు, రిజల్ట్ ఏమవుతుందో అనే ఆలోచన మరోవైపు. రిలీజ్ రోజైతే ఓవర్సీస్ షోస్ టాక్ వచ్చేవరకూ నిద్ర కూడా పోలేదు. ఇక్కడ కూడా కొన్ని వెబ్ సైట్స్ లో పాజిటివ్ రివ్యూస్, ట్విట్టర్ లో కొందరు సినిమా గురించి పెట్టిన పోస్ట్స్ చూసి “హమ్మయ్య” అనుకోని రిలాక్స్ అయ్యాను.

అది మూడు నెలల కష్టం..
“హలో” సినిమాలో నేను పాట పాడడం నాన్నగారికి మొదలుకొని అందరికీ షాకే. బేసిగ్గా నేనూ, అనూప్ మంచి ఫ్రెండ్స్.. ఒకసారి ఏదైనా కొత్తగా చేద్దాం అనుకొంటున్న టైమ్ లో “నువ్ పాట పాడు” అన్నాడు. జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ.. ఒక మూడు నెలలపాటు నాకు చిన్నపాటి ట్రయినింగ్ కూడా ఇచ్చి మరీ నాచేత పాట పాడించాడు. లక్కీగా జనాలు ఆ పాటను యాక్సెప్ట్ చేశారు. అయితే.. ఇంకోసారి పాడాలన్న ఆశ మాత్రం లేదు.

అందుకోసం 60 రోజుల కష్టపడ్డాను..
ఈ సినిమాలో నా నటన తర్వాత అందరూ మెచ్చుకుంటున్న అంశం యాక్షన్ సీక్వెన్స్ లు. అసలు సినిమా అనుకొన్నప్పుడే యాక్షన్ పార్ట్ కోసం సీజీ వాడకూడదు అని. అందుకే బాబ్ బ్రౌన్ నేతృత్వంలో 60 రోజులపాటు ట్రయినింగ్ తీసుకుని ఆ యాక్షన్ సీన్స్ చేశాను. అందుకే అవి అంత సహజంగా ఉంటాయ్.

లేడీస్ “ఐ హేట్ యూ” అని మెసేజులు పంపుతున్నారు..
“హలో” సినిమాతో విక్రమ్ కుమార్ గారు “ఐ హేట్ యూ”కు సరికొత్త మీనింగ్ ఇచ్చేశారు. దాంతో సినిమా చూసినవాళ్లలో సగానికిపైగా లేడీస్ అందరూ నాకు “ఐ హేట్ యు” అని మెసేజ్ చేస్తున్నారు. ఆ మెసేజులు చవుతుంటే చాలా ఆనందంగా ఉంది.

నా ఆశయం ఒక మంచి సినిమా తీయడం..
ఈమధ్య ఫిలిమ్ మేకింగ్ అంటే కలెక్షన్స్, గ్రాస్, షేర్ లెక్కలు అయిపోయాయ్. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందిద్దామనే ఆతృత నవతరం ఫిలిమ్ మేకర్స్ లో ఉండడం లేదు. నేను మాత్రం నా తదుపరి చిత్రాల ఎంపికలో ఒక మంచి సినిమా తీయాలనే కోరికతో మాత్రమే సబ్జెక్టులు వింటున్నాను. అదే సమయంలో నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకోవాలన్న తపన కూడా ఉంది.

ఎప్పుడు వేలు పెట్టలేదు..
నేనేదో విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ వర్క్ లో కాలు-వేలు పెట్టానని కామెంట్స్ విన్నాను. నేనసలు అలా వేలు పెట్టే టైప్ కాదు. అందునా విక్రమ్ కుమార్ చాలా క్లారిటీ మెయింటైన్ చేసే వ్యక్తి. ఆయన పనిలో వేలు పెట్టే అవకాశం ఎవ్వరికీ ఇవ్వడు.

కలిస్తే కాంబినేషన్ క్రియేట్ చేసేస్తారా..
నేను కొరటాల శివగారిని ఒకేఒక్కసారి లంచ్ కి కలిశాను. అంతే మేమిద్దరం కలిసి సినిమా చేస్తున్నామని టాక్ స్ప్రెడ్ అయిపోయింది. అలా చెప్పాలంటే “అఖిల్” రిలీజయ్యాక నేను ఆల్మోస్ట్ ఒక వందమంది డైరెక్టర్స్ ని కలిశాను. వాళ్లందరితోనూ సినిమాలు చేయాలంటే నాకు ఈజన్మ సరిపోదు.

ఆ సమయంలో నాన్న ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేను..
పరిచయం చిత్రం ఫ్లాప్ అయ్యింది. పర్సనల్ గానూ కొన్ని రీజన్స్ కారణంగా చాలా క్రుంగిపోయాను. అసలు రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ కూడా ఓపెన్ చేసేవాడ్ని కాదు. కొన్నిరోజులు అసలు ఎలా ఉన్నానో నాకే తెలియదు. ఆ టైమ్ లో నాన్న ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేను. నేను అలానే ఉంటే ఇంకా కృంగిపోతాను అని ఆలోచించి విక్రమ్ కుమార్ సినిమా కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ కథ చెప్పడం, నాన్నగారితోపాటు అందరికీ నచ్చడం.తో వెంటనే సెట్స్ కి వెళ్లిపోయామ్. ఇక అప్పట్నుంచి సినిమాకి అంకితమై నా పర్సనల్ ప్రోబ్లమ్స్ ని మర్చిపోయాను.

అన్నయ్య అలా అనేసరికి…
మా అన్నయ్య నా బెస్ట్ క్రిటిక్. సినిమా చూశాక బాగుందని కానీ, హిట్ అవుతుందని కానీ ఏమీ చెప్పలేదు. ఒకే ఒక్క మాట అన్నాడు “నువ్ యాక్టర్ గా బాగా ఓపెన్ అప్ అయ్యావురా, ఇలాగే కంటిన్యూ చెయ్. ఆల్ ది బెస్ట్” అని చెప్పి హగ్ చేసుకున్నాడు.

అఖిల్ సినిమా ఇప్పటివరకూ 30 సార్లు చూశాను..
ఒకరు చెప్పేదానికంటే.. మనం చేసిన పనుల నుంచే మనం ఎక్కువ నేర్చుకుంటాం. అందుకే నా ఫస్ట్ ఫెయిల్యూర్ “అఖిల్”ను దాదాపు 30సార్లు చూశాను. చూసిన ప్రతిసారీ సినిమాలో తప్పేముంది, నేను తప్పుగా ఎక్కడ నటించాను అని చెక్ చేసుకొనేవాడ్ని. నేను, వినాయక్ గారూ ఎంతో నమ్మి చేసిన సినిమా అది.

అదే నా న్యూఇయర్ రిజల్యూషన్..
ఇకపై నేను హాలీడేస్ అని, ఎంజాయ్ మెంట్ అని ఇక టైమ్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అందుకే జనవరి 10కి నా తదుపరి సినిమా ఎనౌన్స్ మెంట్ ఇవ్వడమే కాక ఫిబ్రవరి కల్లా సినిమా మొదలెట్టేస్తాను కూడా. 2018 ద్వితీయార్ధంలో సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus