‘ఐబొమ్మ’ కేసులో రవి అరెస్ట్ కేవలం ఆరంభం మాత్రమే అనిపిస్తోంది. ఇన్నాళ్లు సినిమాలు లీక్ చేయడం వరకే అతని నేరం అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే ఆర్థిక లావాదేవీలు బయటపడుతున్నాయి. రవి చేసిన తప్పుకు ఇప్పుడు అతని ప్రాణస్నేహితులు కూడా చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. తాను సంపాదించిన అక్రమ ఆస్తుల కూపీ లాగుతుంటే, ఆ తీగ స్నేహితుల మెడకు చుట్టుకుంటోంది.
IBOMMA RAVI
రవి లైఫ్ స్టైల్ చూసి పోలీసులే అవాక్కయ్యారట. బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను రవి నీళ్లలా ఖర్చు చేశాడు. విదేశీ టూర్లు, లగ్జరీ జల్సాలు ఒక ఎత్తయితే.. ఆంధ్రా, తెలంగాణలో కొన్న స్థలాలు, ఆస్తులు మరో ఎత్తు. అయితే ఈ ఆస్తుల కొనుగోలులో, డబ్బు దాచడంలో రవి తన స్నేహితులను పావులుగా వాడుకున్నాడనే నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
అరెస్ట్ సమయంలో రవి ప్రవర్తించిన తీరు కూడా అనుమానాలకు బలం చేకూర్చింది. పోలీసులు రాగానే తలుపు తీయకుండా, ఆ దొరికిన కొద్ది టైమ్‌లో ల్యాప్‌టాప్‌లోని డేటాను లేపేసి, దాన్ని బాత్రూంలో దాచడం చూస్తుంటే ఇతను ఎంత ముదురో అర్థమవుతోంది. విచారణలో సర్వర్ ఐపీలు అడిగితే “మర్చిపోయాను” అని తప్పించుకుంటున్నాడు కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రం రవి మెడకు ఉచ్చు బిగిస్తోంది.
ఇప్పుడు అసలు టెన్షన్ అంతా రవి స్నేహితులదే. రవి అకౌంట్ల నుంచి ఎవరెవరికి డబ్బు వెళ్లింది? ఆ డబ్బుతో బినామీ పేర్లతో ఏమైనా కొన్నారా? అనే కోణంలో పోలీసులు చిట్టా విప్పుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఏపీలోని రవి సన్నిహితుల జాబితా రెడీ అయ్యింది. పైరసీ డబ్బుతో ఎంజాయ్ చేసిన వాళ్లందరూ ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
సోమవారంతో రవి కస్టడీ ముగియనుంది. కోర్టులో హాజరుపరిచే సమయానికి పోలీసులు పూర్తి సాక్ష్యాలతో రెడీ అవుతున్నారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, ఫ్రెండ్స్ అకౌంట్లలో ఉన్న నగదు వివరాలు బయటకు వస్తే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఐబొమ్మ రవి కక్కుర్తి, అతని స్నేహితుల పాలిట యమపాశంలా మారింది.