ఒక్కోసారి రాజకీయ నాయకులు తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం అనవసరమైన లేక వ్యంగ్యమైన ఇంకా చెప్పాలంటే గొడవలకు తెరలేపే వ్యాఖ్యలు చేయడం అనేది చూస్తూనే ఉంటాం. నిజానికి ఆ తరహా వ్యాఖ్యలు అప్రస్తుతం. కానీ.. కేవలం జనాలు, మీడియా వాళ్లవైపు తిప్పుకోవడం కోసం కొందరు పొలిటీషియన్స్ లేదా కొందరు పబ్లిసిటీ పిచ్చి పట్టిన సంఘ సంస్కర్తలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. న్యూ ఏజ్ పాలిటిక్స్ లో ఈ తరహా వ్యక్తులు లేరులే అని అందరూ అనుకుంటున్న తరుణంలో కమల్ హాసన్ తెరపైకి వచ్చాడు.
మరి తన రాజకీయ తెరంగేట్రాన్ని మీడియా కానీ జనాలు కానీ పెద్ద సీరియస్ గా తీసుకోలేదని బాధపడ్డాడో లేక తన ఉనికిని కాస్త గట్టిగా చాటుకోవడం అత్యవసరం అనుకున్నాడో తెలియదు కానీ.. సందర్భంతో సంబంధం లేకుండా “స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఒక హిందువు, అతడే నాథూరాం గాడ్సే” అని కామెంట్ చేశాడు కమల్ హాసన్. పైగా.. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం లేదు, ఇది నిజం అంటూ తన వ్యాఖ్యలను తానే సమర్ధించుకొన్నాడు కమల్ హాసన్. మరి ఈ కామెంట్ కి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాన్ని పక్కన పెడితే.. మొన్నటివరకూ కమల్ హాసన్ మీద ఉన్న అభిప్రాయంలో మాత్రం గట్టి మార్పులు వచ్చే అవకాశం ఉంది.