సోషల్ మీడియా అతి కంటెంట్, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గురించి ఇటీవల ఒక జోక్ బాగా వైరల్ అవుతోంది. ఒకప్పుడు పేదవారు డాన్సులు వేస్తుంటే ధనవంతులు కూర్చుని చూసేవారట. కానీ ఇప్పుడు ధనవంతులు, సెలబ్రిటీలు రీల్స్ కోసం వింత వింత డాన్సులు వేస్తుంటే, సామాన్య ప్రజలు ఫోన్లలో వాటిని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ మార్పు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఇప్పుడు డబ్బు సంపాదన కోసం అశ్లీలత వైపు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సబ్‌స్క్రిప్షన్’ అనే కొత్త ఆప్షన్ వచ్చినప్పటి నుండి ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల ఒక ప్రముఖ టీవీ నటి, యాంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘పెయిడ్ సబ్‌స్క్రిప్షన్’ మోడ్ ఆన్ చేసి, డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే కనిపించేలా అర్ధనగ్న వీడియోలు పెడుతోందని ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. కేవలం డబ్బు కోసమే ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు, ఇంకొక నటి కూడా తన ఖాతాలో ఇలాంటి ప్రత్యేక వీడియోలు పెడుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఆమె స్పందిస్తూ.. అందులో కేవలం తన వ్యక్తిగత ఆలోచనలు, రోజువారీ విశేషాలు మాత్రమే ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.
విచిత్రమేమిటంటే, ఈ వివాదాల వల్ల సదరు నటీమణుల ఖాతాలకు హైప్ పెరిగి, సబ్‌స్క్రైబర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నెటిజన్లు ఆ సబ్‌స్క్రిప్షన్‌లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో డబ్బులు కట్టి మరీ చేరుతున్నారు.
ఇదంతా చూస్తుంటే ఒక పక్క వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు, మరోపక్క జనం హైప్ ఇస్తూ వారికి మరింత లాభం చేకూరుస్తున్నారు అనిపిస్తోంది. కేవలం సబ్‌స్క్రిప్షన్ ఉన్న ఖాతాలే కాదు, సాధారణంగా కూడా అర్ధనగ్న వీడియోలు పెట్టే ఖాతాలు ఇన్‌స్టాగ్రామ్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
ప్రభుత్వం మరియు సోషల్ మీడియా వేదికలు ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌ను పూర్తిగా నియంత్రించనంత వరకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం సెలబ్రిటీలు దిగజారడం.. వాటిని చూస్తూ జనం తమ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. కంట్రోల్ అనేది వ్యవస్థలోనూ, చూసే ప్రజల్లోనూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.