‘ఇదిగో కుంభ’ అంటూ రాజమౌళి తన కొత్త సినిమాలోని విలన్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరో పాత్రను రివీల్ చేస్తామని చెప్పిన ఆయన.. విలన్ పాత్రతో తన సినిమా ప్రచారం చేశారు. దీంతో హీరో మహేష్ బాబు లుక్ కోసం అభిమానులు ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వచ్చిన విలన్ లుక్‌తోనే రాజమౌళి ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలు రేకెత్తించారు. బ్యాటరీ ఆపరేటెడ్ స్పెషల్ చక్రాల కుర్చీలో కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ని చూసి వావ్ అనుకోనివాళ్లు లేరు. అలాగే ఈ లుక్ ఎక్కడో చూసినట్లుగా ఉంది కదా అంటూ పాత సినిమాల పేర్లు ప్రస్తావిస్తున్నారు.
పాత సినిమాల సంగతి తర్వాత చూద్దాం. తొలుత కుంభ పాత్ర గురించి, పోస్టర్‌లో కనిపిస్తున్న ప్రత్యేకమైన చెట్ల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను చూద్దాం. ఆ ఫొటోల బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తున్న వృక్షాలు ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయట. వాటిని మంకీ బ్రెడ్ లేదా బవోబాబ్ వృక్షాలు అని పిలుస్తారట. వీటి జీవిత కాలంలో సుమారు 2 వేల సంవత్సరాలు ఉంటుంది అని గూగుల్ సమాచారం. ఇవి వేల కొద్దీ లీటర్ల నీటిని కొమ్మల్లో దాచుకుంటాయట. అలాగే సీసా ఆకారంలో ఉంటాయి. అందులోనూ నీళ్లను స్టోర్ చేసుకుంటాయట.
ఇక ‘కుంభ’ పాత్ర పేరుతో ఈ సినిమాను త్రేతా యుగంతో కనెక్ట్ చేసేశారు నెటిజన్లు. కుంభకర్ణుడి తనయుడే ఈ కుంభ అని.. తండ్రి చనిపోయాక తన సోదరుడు నికుంభతో కలసి వానరసేనతో యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయని సోషల్ మీడియా చర్చల సారాంశం. ఆ యుద్ధంలో అంగధుడి చేతిలో కుంభ ఓడిపోగా.. హనుమంతుడి చేతిలో నికుంభ ఓడిపోయాడట. ఆ లెక్కన ఇప్పుడు ఈ సినిమా నికుంభ పాత్రధారి కూడా ఉంటారు.
ఈ సినిమాలో మహేష్‌బాబు ఆంజనేయుడిగా నటించొచ్చనే వార్తలు చాలా నెలలుగా వస్తున్నాయి. ఇప్పుడు లుక్ లీకుల ప్రకారం అది నిజమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అంగధుడిగా ఎవరు నటిస్తారు అనేది కూడా చూడాలి. పురాణాల్లో హనుమంతుడిని మించిన గ్లోబల్ ట్రాటర్ మరొకరు లేరు అనే విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ విషయంలో క్లారిటీ నవంబరు 15న రావొచ్చు. ఆ రోజే సినిమా పూర్తి వివరాలు ఓ ఈవెంట్‌లో రాజమౌళి అండ్ కో. చెప్పబోతున్నారు.