స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య ఏమి చేసినా సంచలనం అయిపోతోంది. “చెప్పను బ్రదర్” అంటూ బన్నీ చేసిన హడావుడి నుంచి నెటిజనులు తేరుకోక ముందే మరో విషయం పై చక్కర్లు కొడుతున్నాడు. సోషల్ మీడియాలో సోమావారం కూడా ట్రెండ్స్ లిస్టులో టాప్ పొజిషన్లో చేరాడు. వివరాల్లోకి వెళితే.. నిన్న (ఆదివారం) మా సినీ అవార్డ్స్ కార్యక్రమాన్ని మా టీవీ వాళ్లు ప్రసారం చేశారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. గ్యాంగ్ లీడర్ సినిమాలోని టైటిల్ పాటకు స్టెప్పులేసి అదర గొట్టారు. చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీని పురస్కరించుకుని ఈ ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన వారందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మెగాస్టార్ కు సినిమాల్లోకి పునః స్వాగతం పలికారు. ఆయన తొమ్మిదేళ్ల తర్వాత డాన్స్ వేయడాన్ని అభిమానులతో పాటు, చిరు సతీమణి సురేఖ, తమ్ముడు నాగేంద్ర బాబు, కొడుకు రాంచరణ్, కుమార్తె శ్రీజలు చూసి ఆనందించారు. చిరుకి మిత్రుడు, బావ మరిది అయిన అల్లు అరవింద్ వేదికపై మాట్లాడుతూ “చిరంజీవి డాన్స్ వేస్తున్నప్పుడు ఆయన కుటుంబసభ్యుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది.
నాకైతే కత్తిలాండోడు సినిమాను కొంత ఇప్పుడే చూసినట్లు అనిపించింది” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా చిరు డాన్స్ వేస్తున్నప్పుడు బన్నీకళ్లు ఉద్వేగంతో చెమ్మగిల్లాయి. అది కనబడనీయకుండా తుడుచుకున్నాడు. ఆ షాట్ ని బుల్లి తెరపైన చూసిన కొందరు పాజిటివ్ గా స్పందిస్తే .. మరికొందరు ఓరి వీడి వేషాలో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొడుకు రామ్ చరణ్ చిరు డ్యాన్స్ ని ఎంతో ఎంజాయ్ చేస్తూ చూస్తుంటే అల్లుడు బన్నీ ఓవర్ యాక్షన్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదిక పై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.