Mokshagnya: ప్రశాంత్‌ వర్మనా? మోక్షజ్ఞనా? అసలు సమస్య ఎవరు?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) సినిమా ఎంట్రీ ఎప్పుడు అంటూ నందమూరి అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సగటు యువ హీరోల వయసు కంటే ఆయన వయసు పెరిగిపోతుండటం ఓ వైపు కలవరపెడుతుంటే, మరోవైపు ఇంకా సినిమా ప్రారంభం కాకకపోవడం ఇబ్బందిపెడుతోంది. ఈ సమయంలో ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు అంటూ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే ఆ ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే చెప్పిన టైమ్‌కి సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వలేదు.

Mokshagnya

ఇదిగో, అదిగో అప్పటి నుండి సినిమా టీమ్‌ ఏవేవో కారణాలు చెబుతున్నా.. సినిమా షూటింగ్‌ మొదలయ్యేది ఎప్పుడో చెప్పలేకపోతున్నారు. ఈ లోపు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన కొత్త సినిమా ‘జై హనుమాన్‌’ పనుల్లో బిజీ అయిపోయారని వార్తలొస్తున్నాయి. రిషభ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పనులు జోరుగా సాగుతున్నాయట. దీంతో మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్‌ ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో అసలు ఈ ఏడాది మోక్షు వస్తాడా? అనే డౌట్‌ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది.

ఓవైపు తమ సినిమా ఉందని ప్రశాంత్‌ వర్మ చెబుతున్నా.. మరికొంతమంది దర్శకుల పేర్లు వినికిడిలోకి వచ్చాయి. దీంతో వారసుడి తొలి సినిమా ఏంటో అర్థం కావడం లేదు. ఎలాంటి కథతో వస్తాడు అనేది కూడా తెలియడం లేదు. బాల‌కృష్ణ స్వ‌యంగా మోక్ష‌జ్ఞ‌ని ప‌రిచ‌యం చేస్తార‌ని, ‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్‌ ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ లో ఇద్దరూ కలసి నటిస్తారు అని వార్తలొస్తున్నాయి. దీంతో ఇదంతా తేలడానికి ఈ ఏడాది తేలేలా లేదు.

అదే జరిగితే 2025లో కూడా మోక్షజ్ఞను చూడలేం. వచ్చే ఏడాది వారసుడి దర్శనం అని చెప్పొచ్చు. ఇదే జరిగితే నందమూరి అభిమానుల బాధ ఇంకొన్నాళ్లు నడిచేలా ఉంది. ఈ క్రమంలో తొలి సినిమా విషయంలో సమస్య ప్రశాంత్‌ వర్మతోనా? లేక మోక్షజ్ఞతోనా? అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే అనారోగ్యం కారణంగా ముహూర్తం వాయిదా పడింది అని ఆ మధ్య బాలకృష్ణ చెప్పారు. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus